ఆంధ్రప్రదేశ్‌

సారా రహిత రాష్ట్రంగా ఏపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 3: ఆంధ్రప్రదేశ్‌ను సారా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. దీని కోసం నవోదయం అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బుధవారం నవోదయం కార్యక్రమాన్ని తొలిసారిగా చేపడుతున్నామని అన్నారు. సారా రహిత రాష్టమ్రే దీని లక్ష్యమని తెలిపారు. దీన్ని 13 జిల్లాల్లోనూ అమలు చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మంగళవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మద్యం దుకాణాల్లో ఎంఆర్‌పి ధరలకే అమ్మకాలు నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ తీవ్రస్థాయిలో మద్యం దుకాణాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతవరకూ వచ్చిన ఫిర్యాదుల మేరకు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మద్యం అమ్మకాలను అత్యధిక ధరలకు అమ్ముతున్నారని ఆయన తెలిపారు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే లైసెన్సులు కూడా రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇకపై అన్ని జిల్లాల్లో మరిన్ని దాడులు జరుగుతాయని అన్నారు. ఇంతవరకూ జరిగిన దాడుల్లో అనేక కేసులు నమోదు చేశామని వివరించారు. మద్యం షాపులకు గాని, ఎక్సైజ్ అధికారులకు గాని ఆదాయం విషయంలో ఎలాంటి లక్ష్యాలు నిర్దేశించలేదని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అక్రమ వ్యాపారాలను కంట్రోల్ చేయటంతోపాటు పారదర్శకంగా మద్యం అమ్మకాలు జరగాలనేది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అక్రమ సారా వ్యాపారాలపై కొరడా ఝుళిపిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

పంటపొలాలపై
ఏనుగుల దాడులు
బైరెడ్డిపల్లె, మే 3: చిత్తూరు జిల్లాలో పలుచోట్ల ఏనుగులు పంటపొలాలపై విరుచుకుపడ్డాయి. బైరెడ్డి పల్లె మండలంలోని వెంగంవారిపల్లె అటవీ ప్రాంత సమీపంలో వ్యవసాయ పొలాల్లో గల మామిడి చెట్ల ఏనుగులు సోమవారం రాత్రి విరిచేశాయి. ఈ సందర్భంగా సుమారు 50 మామిడిచెట్లపై ఫలసాయాన్ని తినేసి చెట్లన్నీ విరిచేశాయి. ఆదివారం రాత్రి పంటపొలాలపై దాడి చేసి బీన్స్, కేబేజి పంట ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడులు ఈ వారంలో ఇది రెండోసారి అని రైతులు వాపోతున్నారు. ఇటీవల కాలంలో మంచినీటి కోసం ఏనుగులు గ్రామాలపై పడి భయభ్రాంతులకుగురిచేస్తున్నాయని, అటవీ అధికారులను వేడుకుంటున్నా వారిలో కదలిక లేదని రైతులు వాపోతున్నారు.

కాకానిలో ఎండోమెంట్ ట్రిబ్యునల్?

విజయవాడ (ఇంద్రకీలాద్రి), మే 3: గుంటూరు జిల్లా కాకానిలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత హైదరాబాద్‌లో ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం తెలంగాణ రాష్ట్రానికి తరలివెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో విజయవాడ గొల్లపూడిలో సుమారు రూ.10 కోట్ల వ్యయంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇదే శాఖకు చెందిన ట్రిబ్యునల్ కార్యాలయాన్ని గుంటూరు సమీపంలోని కాకానిలో ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా కాకానిలోని శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవస్థానానికి చెందిన అతి పెద్ద భవనాన్ని తీసుకుని ట్రిబ్యునల్ ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెరుగులను దిద్దుతున్నారు. సుమారు రెండు నెలల వ్యవధిలో ట్రిబ్యునల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఈ శాఖకు చెందిన సీనియర్ అధికారి తెలిపారు. ఈ ట్రిబ్యునల్‌లో దేవాదాయ ధర్మాదాయ శాఖ యాక్ట్‌లోని 82, 83, 87 జీవోలకు సంబంధించిన వ్యవహారాలను ఈ ట్రిబ్యునల్‌లో పరిష్కారం అవుతాయి. 13 జిల్లాలకు చెందిన ఈ శాఖకు సంబంధించిన వ్యవహారాలను ఈ ట్రిబ్యునల్‌లో పరిష్కరిస్తారు. ట్రిబ్యునల్‌లో జిల్లా జడ్జి ఛైర్మన్‌గా, రీజనల్ జాయింట్ కమినర్ స్థాయి అధికారి సభ్యునిగా ఉంటారు. గతంలో సభ్యులుగా అదనపు కమిషనర్ స్థాయి అధికారి సభ్యునిగా ఉండేవారు.

ప్రత్యేక హోదా కోసం
8నుండి ఆమరణ దీక్ష
జులై నుంచి పన్నుల సహాయ నిరాకరణ
హామీలు నేరవేర్చే వరకు ఉద్యమం
చలసాని శ్రీనివాస్ వెల్లడి
అనంతపురం సిటీ, మే 3: రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం ఈ నెల 8వ తేదీ నుండి అనంతపురంలో ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నట్టు ప్రత్యేక హోదా సాధన సమితి గౌరవాధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ప్రకటించారు. అనంతపురంలోని ఒక హోటల్‌లో మంగళవారం ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఏమీ చేయకుండా మాటలతో మాయ చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర విభజన అనంతరం అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా ఇంత వరకు ప్రత్యేక హోదాపైనగానీ, ప్రత్యేక ప్యాకేజీపైన కానీ చేసింది ఏమి లేదన్నారు. కరవు జిల్లా అయిన అనంతపురానికి కేంద్రం వసూలు చేసే సర్వీస్ టాక్స్, ఇతర టాక్స్‌ల్లో రాయితీ ఇవ్వాలని, అలాగే శ్రీకాకుళం జిల్లాకు కూడా ఈ రాయితీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మొదటి దశలో రెండు జిల్లాలకు ఇవ్వకపోతే జూలై 1 నుండి కేంద్ర ప్రభుత్వానికి చెల్లించే పన్నులను ప్రజలు చెల్లించకుండా అడ్డుకుని పన్నుల సహాయ నిరాకరణ ఉద్యమం చేపడతామన్నారు. కేంద్రానికి వ్యాపారులు చెల్లించే పన్నులు చెల్లించకుండా ఆ వర్గాలను చైతన్యం చేస్తామన్నారు. కేంద్రానికి చురుకు తగిలేలా అన్ని వర్గాలను కలుపుకుని పన్నుల సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపడతామన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, ఆస్తులకు ఎలాంటి నష్టం కలిగించకుండా శాంతియుతంగానే నిరసనలు చేపడతామని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక ప్యాకేజిని ఇచ్చేంతవరకు ఉద్యమాన్ని అపబోమని హెచ్చరించారు. రాష్ట్ర విభజనలో ఇచ్చిన హామీలను నేరవేర్చంత వరకు ప్రత్యేక హోదా సాధన సమితి ఉద్యమిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా కన్వీనర్ డి జగదీష్, తదితరులు పాల్గొన్నారు.