ఆంధ్రప్రదేశ్‌

రాష్టప్రతి ఎన్నికకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 16: రాష్టప్రతి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకూ వెలగపూడిలోని శాసనసభ కమిటీ హాల్‌లో జరిగే ఎన్నిక నిర్వహణ ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల పరిశీలకురాలు కౌర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. శాంతిభద్రతల అంశాన్ని డిజిపి నండూరి సాంబశివరావు, ఇంటలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు స్వయంగా సమీక్షిస్తున్నారు. రాష్ట్రం నుంచి ఎన్నికయిన ఎమ్మెల్యేలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు సోమవారం తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరంతా ఎక్కడ తమ ఓటుహక్కు వినియోగించుకుంటారనే దానిపై ఆప్షన్‌ను వారికే వదిలేశారు. ఆమేరకు పత్రాలను ముందుగానే పంపిణీ చేశారు. ఢిల్లీ, లేదా అమరావతిలో ఎక్కడైనా వారు తమ ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి కారణంగా ఒక స్థానం ఖాళీ అయింది. తెలుగుదేశం పార్టీకి 127, వైఎస్సార్‌సీపీకి 47, బిజెపికి నలుగురు ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. వీరి ఓటు విలువ ఒక్కొక్కరికి 159గా నిర్ణయించారు. ఆ ప్రకారంగా రాష్ట్రంలో ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువ 27,666. ఇక టిడిపికి లోక్‌సభలో 18, రాజ్యసభలో ఐదుగురు ఎంపీలు వుండగా, వైసీపీకి లోక్‌సభలో 7, రాజ్యసభలో ఒక ఎంపీ ఉన్నారు. వీరి ఒక్కో ఓటు విలువను 708గా నిర్ణయించారు. ఆ ప్రకారంగా మొత్తం పార్లమెంటు సభ్యుల ఓటు విలువ 25,488. మొత్తం పార్లమెంట్, శాసనసభ్యుల ఓటు విలువ ఏపి నుంచి 53,154 అవుతుంది.
సోమవారం జరగనున్న రాష్టప్రతి ఎన్నికకు ముందు ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిడిపి ఎమ్మెల్యేలతో సచివాలయంలో భేటీ కానున్నారు. అక్కడి నుంచి సమీపంలోని అసెంబ్లీకి వెళ్లి ఆయన తొలి ఓటు వినియోగించుకోనుండగా, స్పీకర్ కోడెల శివప్రసాదరావు రెండో ఓటు వేయనున్నారు. ఎన్డీఏ తరఫున చీఫ్ పోలింగ్ ఏజెంట్‌గా మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్యవహరించనున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఉదయం తన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయి, అక్కడి నుంచి అంతా కలిసి అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఈ ఎన్నికకు విప్ జారీ చేసే అవకాశం ఉండదు. ఒకవేళ చేసినా దాన్ని పాటించాల్సిన అవసరం లేదు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఈ ఎన్నికలో ఓటు వేయాల్సిన ప్రజాప్రతినిధి అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న గడిలో 1 అంకె వేయాల్సి ఉంటుందని, రెండో ప్రాధాన్యతా ఓటు వేయాలంటే ఆ నెంబరు రాయాలని శాసనసభ కార్యాలయ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఓటుహక్కు వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాల పత్రాలను ఎమ్మెల్యేలకు పంపామని, వాటిని అసెంబ్లీ వెబ్‌సైట్‌లో కూడా ఉంచామని అధికారులు వివరించారు.

చిత్రం.. రాష్టప్రతి ఎన్నిక పోలింగ్‌కు సిద్ధమైన ఎపి అసెంబ్లీ