ఆంధ్రప్రదేశ్‌

గెలుపే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, జూలై 20: త్వరలో జరుగనున్న కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపే ధ్యేయంగా పక్కా ప్రణాళికతో తెలుగుదేశం పార్టీ కార్యాచరణ రూపొందించి ముందుకుపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నంద్యాల ఉప ఎన్నికలో పనిచేసేందుకు 25 మంది ఎమ్మెల్యేలు ఈనెల 25వ తేదీ నాటికి నంద్యాలకు చేరుకొనే అవకాశం ఉందని టిడిపి వర్గాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి ఈనెల 22వ తేదీ నంద్యాలలో పర్యటించిన అనంతరం తమ వ్యూహాన్ని అమలుచేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఉప ఎన్నిక కోసం 8 మంది రాష్ట్ర మంత్రులు ఇప్పటికే పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన అనంతరం వీరితో పాటు 20 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎమ్మెల్సీలు నంద్యాలలో తిష్టవేయనున్నారు. వీరంతా చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు సమాచారం. నంద్యాల అసెంబ్లీ పరిధిలో 2,09,000 ఓట్లు ఉండగా, మరో 10 వేల మంది కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొత్త ఓటర్ల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం పక్కాగా ఓటర్ల జాబితా తయారుచేయనున్నారు. ఈ జాబితా ప్రకారం తమ ప్రణాళికను అమలుపరిచేందుకు ఎమ్మెల్యేలు చొరవ తీసుకునే అవకాశం ఉంది. ప్రతి పదివేల మంది ఓటర్లకు ఒక ఎమ్మెల్యే ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ ఆయా వార్డుల్లోని కౌన్సిలర్లు, ఇన్‌చార్జిలు, టిడిపికి నమ్మినబంటుగా ఉన్న ఆయా వార్డు నాయకులను సమీకరించి ఓటర్ల జాబితా ప్రకారం సమీక్షించి పోలింగ్ రోజున 90 శాతం ఓట్లు పోలయ్యే విధంగా పనిచేయాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్లను విభజించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని పార్టీకి నమ్మినబంటుగా ఉన్న వ్యక్తికి వంద ఓటర్లను పరిచయం చేయడంతో నాయకుల ద్వారా ముఖాముఖి, పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల తీరును వివరించేలా తర్ఫీదు ఇవ్వనున్నారు. మరోవైపు ఆ వంద ఓటర్లలో పొదుపు మహిళలను గుర్తించి వారికి కుట్టుమిషన్లు, బ్యాంక్ రుణాలు అందించడంతో పాటు పోలింగ్ రోజు ఆ వందమందిని ఓటింగ్‌కు తరలించే పనిని కూడా బూత్ లెవెల్ కార్యకర్తలే చూసుకునేలా బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. 10 వేల మంది ఓటర్లకు ఇన్‌చార్జిగా వ్యవహరించే ఎమ్మెల్యే నుంచి వంద ఓట్లకు బాధ్యత వహించే బూత్‌స్థాయి కార్యకర్త మధ్య అనుసంధానంగా కౌన్సిలర్, ఇన్‌చార్జి, నమ్మిన బంటుగా ఉన్న నాయకులు తెరవెనుక పనిచేస్తారు. 8 మంది మంత్రులు వార్డుల వారీ, గ్రామాల వారీగా బాధ్యతలు స్వీకరించి వీరికి కావాల్సిన ఆర్థిక అండదండలు అందించడంతో పాటు ఓటర్లను ఆకర్షించే బాధ్యత తీసుకుంటున్నారు. మొత్తం మీద నంద్యాల ఉప ఎన్నికను తెలుగుదేశం పార్టీ సవాల్‌గా స్వీకరించింది. కార్యకర్త నుంచి మంత్రి వరకు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది.