ఆంధ్రప్రదేశ్‌

కాకినాడ గోశాలలో మరణ మృదంగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 20: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని జంతు హింస నివారణ సంఘం (ఎస్‌పిసిఎ)లో ఆవుల మరణాలు కొనసాగుతున్నాయి. గత నాలుగు రోజుల్లో సుమారు 40 గోవులు మృత్యువాత పడ్డాయి. ఒక్క గురువారం నాడే ఈ గోశాలలో 10 గోవులు మృతి చెందాయి. దీంతో గోసంరక్షకులు, జంతు ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేంద్రం సంరక్షణలో ఉన్న ఆవులు తిండి లేక, పోషణ లేక తొలుత 20 వరకు మృతి చెందిన విషయం విదితమే. ఈ వ్యవహారం పత్రికల ద్వారా వెలుగుచూడటంతో ప్రభుత్వ యంత్రాంగం కళ్లు తెరిచింది. గోశాలకు అధికారులు వెళ్ళి పరిశీలించి నిశే్చష్టులయ్యారు. పారిశుద్ధ్యం అధ్వాన్నంగా మారి, గ్రాసం లేక గోవులు విలవిల్లాడుతూ కనిపించాయి. చావు బతుకుల మధ్య ఉన్న ఆవులను రక్షించడానికి వెటర్నరీ వైద్య బృందంచే శిబిరాన్ని ఏర్పాటుచేశారు. అలాగే యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు చేపట్టారు. అయితే చాలా రోజులుగా గ్రాసం లేక నీరసించిన గోవులు తాజాగా కురిసిన భారీ వర్షాలకు మరింత చిక్కిశల్యమై, మరణ శయ్యను ఆశ్రయిస్తున్నాయి. ఈ కేంద్రంలో సుమారు 100 గోవులకు గాను 40కి పైగా గత నాలుగు రోజుల్లో మృతి చెందడం గమనార్హం.
ఉప ముఖ్యమంత్రి స్పందన
జంతు హింస నివారణ సంఘంలో గోవుల మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్రంగా స్పందించారు. ఈమేరకు జిల్లా కేంద్రం కాకినాడలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కలెక్టర్ కార్తికేయ మిశ్రాతో సమావేశమయ్యారు. గోసంరక్షణ కేంద్రంలో మిగిలివున్న గోవుల పరిరక్షణకు తీసుకున్న చర్యలు, అక్కడి పారిశుద్ధ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జంతు హింస నివారణ సంఘం కేంద్రంలో గోవుల మృతికి కారకులైన వారిపై చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. జంతు హింస నివారణ సంఘం కమిటీని రద్దుచేసి, కాకినాడ ఆర్‌డిఒ ఛైర్మన్‌గా నూతన కమిటీ ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు. ఆ కేంద్రంలో మురుగును యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నామని, ఇంతవరకు 50 లోడ్‌లు తొలగించగా, మరో 150 లోడ్‌లను తొలగించే పనులు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రాంగణాన్ని శుభ్రం చేసి, బయోగ్యాస్ ప్లాంటు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. గోవుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.

చిత్రం.. చనిపోయిన, చిక్కిశల్యమైన ఆవులు