ఆంధ్రప్రదేశ్‌

కేరళకు ఆంధ్రా బియ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 20: కేరళ రాష్ట్రానికి త్వరలో రాష్ట్రం నుంచి జయ రకం బియ్యం సరఫరా కానున్నాయి. రేటు విషయంలో స్పష్టత వస్తే, సెప్టెంబర్‌లో జరిగే ఓనం పండుగ నాటికి ఈ బియ్యం సరఫరా చేయాలని కేరళ ప్రభుత్వం కోరుతోంది. కేరళలో సాగు భూమి విస్తీర్ణం తక్కువగా ఉండటంతో వరిపంట సాగు తక్కువగానే ఉంటుంది. దీంతో కేరళలో డిమాండ్ ఎక్కువగా ఉన్న జయ, మట్ట రకం బియ్యం కోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ అవకాశాన్ని వ్యాపారులు, మిల్లర్లు సొమ్ము చేసుకోవడం వల్ల ఈ రెండు రకాల బియ్యం కేరళలో ఎక్కువ ధరకు విక్రయిస్తూ ప్రజలపై భారం మోపుతున్నారు. ఈ వ్యవహారానికి తెర దించేందుకు నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతోనే చర్చలు జరిపి, బియ్యం కొనుగోలు చేసేందుకు కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తికి కేరళ ముఖ్యమంత్రి విజయన్ ఫోన్ చేసి ఓనం పండుగ నాటికి బియ్యం సరఫరా చేయాలని కోరారు. కేరళ సంప్రదాయ వంటకాల్లో ఈ బియ్యం వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని సిఎం చంద్రబాబు దృష్టికి కెఇ తీసుకువెళ్లగా, సిఎం సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో వెలగపూడి సచివాలయంలో గురువారం కేరళ పౌరసరఫరాల శాఖ మంత్రి తిలోత్తమన్‌తో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి, పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చర్చలు జరిపారు. నెలకు 6000 టన్నుల బియ్యం సరఫరా చేయాలని మంత్రి తిలోత్తమన్ కోరారు. తాము ఇ-టెండర్ విధానంలో కిలో 35 రూపాయలకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జయ రకం బియ్యం ధర 47 రూపాయలు ఉంది. ధర తేడా ఎక్కువగా ఉండటంతో మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర మంత్రులు ప్రతిపాదించారు. ఏటా 72 వేల టన్నులను కొనుగోలు చేయాలని, దీని వల్ల రైతులకు మేలు జరుగుతుందని కోరారు. ధరలో తేడా ఎక్కువగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా రెండు ప్రతిపాదనలు రాష్ట్ర మంత్రులు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నేరుగా కేరళ ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసి, బియ్యంగా మార్చి తీసుకువెళ్లేందుకు ప్రతిపాదించారు. మార్కెట్‌లో ఉన్న ధర ప్రకారం బియ్యం కొనుగోలు చేసి సరఫరా చేసేందుకు, ఆ ధర కేరళ ప్రభుత్వం చెల్లించేందుకు మరో ప్రతిపాదన చేశారు. కాస్ట్ టు కాస్ట్ విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం ఉండదని భావిస్తున్నారు. త్వరలో మరో సమావేశంలో ధర విషయమై చర్చించి ఖరారు చేసేందుకు నిర్ణయించారు. తూర్పు గోదావరి ప్రాంతంలో దాదాపు 3.5 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుండగా, కేరళలో దాదాపు 1.1 లక్షల టన్నుల వరకూ జయ రకం బియ్యానికి డిమాండ్ ఉంది. దీంతో ఇది ఇక్కడి రైతులకు కూడా మేలు జరుగుతుందని భావిస్తున్నారు. సమావేశం అనంతరం కేరళ మంత్రి తిలోత్తమన్ మీడియాతో మాట్లాడుతూ జయ రకం బియ్యం సరఫరాలో లోపాల వల్ల ఎక్కువ భారం పడుతోందని తెలిపారు. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వాల మధ్య ఒప్పందమే మేలన్న అభిప్రాయంతో తాము చర్చలకు వచ్చామని తెలిపారు. దీని వల్ల తమ రాష్ట్ర ప్రజలు లబ్ధిపొందుతారన్నారు. బియ్యం సరఫరా చేసిన రెండు రోజుల్లో చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర మంత్రి పుల్లారావు మాట్లాడుతూ బియ్యం ధరపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. దీని వల్ల రాష్ట్ర రైతులకు కూడా మేలు జరుగుతుందన్నారు. బియ్యం ఒప్పందం తరువాత ఎండు మిర్చి కూడా సరఫరా చేస్తామన్నారు. ఈ సమావేశంలో కేరళ పౌర సరఫరాల సంస్థ సిఎండి మహమ్మద్ హనీష్, డైరెక్టర్ లోహిత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరా శాఖ కమిషనర్ రాజశేఖర్, ఎండి రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. రాష్ట్ర మంత్రులతో చర్చలు జరుపుతున్న కేరళ మంత్రి తిలోత్తమన్