ఆంధ్రప్రదేశ్‌

ఆశల పల్లకిలో అమరావతి శిల్పాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 11 : బౌద్ధం పరిఢవిల్లి.. శాతవాహనులు, ఇక్ష్వాకులు ఏలిన అమరావతిలోని శిల్పకళా సంపద ఖండాంతరాలకు తరలిపోయింది. బ్రిటీష్ పాలకుల హయాంలో వివిధ మ్యూజియంలలో అమరావతి పురావస్తు సంపదను భద్రపరిచారు. కొన్నింటిని లండన్ మ్యూజియంకు తరలించారు. అమరావతి పేరిట రాజధాని నిర్మాణం జరుగుతుండటంతో దేశ, విదేశాల్లో ఉన్న పురావస్తు శిల్పాలను ఏపికి తీసుకురావటానికి ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. చెన్నైలోని ఎగ్మోర్, లండన్ పురావస్తుశాలల్లో అపారమైన, అత్యంత విలువైన అమరావతి ప్రాచీన కళాఖండాలు ఉన్నాయి. వీటిని చూసేందుకే ప్రపంచ దేశాల ప్రజలు మ్యూజియంలను సందర్శిస్తున్నారు. బౌద్ధం పరిఢవిల్లిన ప్రాంతంలో అప్పటి ఆచారాలు, వస్తు వినియోగం, నాణాలు, తదితర పరికరాలపై ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వాటిని తిరిగి ఇచ్చేస్తే ప్రాముఖ్యత దెబ్బతింటుందనే భావనతో ఎగ్మోర్, లండన్ పురావస్తుశాఖ అధికారులతో పాటు ఆయా ప్రభుత్వాలు మెలికపెడుతున్నాయి. తొలుత తమిళనాడులో ఉన్న శిల్ప సంపదను తిరిగి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితకు లేఖరాశారు. ఈ మేరకు అమరావతి శిల్ప సంపదపై సమగ్ర నివేదిక సమర్పించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వం ఎగ్మోర్ పురావస్తుశాఖ అధికారులను ఆదేశించింది. అమరావతి శిల్ప సంపద చాలా సున్నితమైనదని ఇప్పటివరకు కోట్లాది రూపాయలు ఖర్చుచేసి వాటిని కాపాడామని, అంతేకాదు శాశ్వత భవనాలలో వీటిని భద్రపరిచామని, తొలగించేందుకు వీలులేని రీతిలో ప్రత్యేక నిర్మాణాలు ఏర్పాటు చేశామని అక్కడి పురావస్తుశాఖ అధికారులు వివరించారు. మ్యూజియంలో నుంచి తరలించటం వల్ల ప్రాచీన శిల్పాలు దెబ్బతింటాయని ఆర్కియాలజికల్ క్యూరేటర్ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీనికితోడు తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నందున ఈ అంశం మరుగున పడింది. 1996లో ఎగ్మోర్ మ్యూజియంలో ఏపికి చెందిన పురావస్తు సంపదను తరలించాలని భావించారు.
నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధితో ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. అక్కడి నుంచి శిల్పాలుకాదు తేకుండా.. ఏక శిలతో కూడిన 9 నాపరాళ్లను తరలించి చేతులు దులుపుకున్నారని పురావస్తు శాఖ అధికారులే వివరించారు. ఇదిలా ఉండగా లండన్ మ్యూజియంలోని మూడో అంతస్తులో ప్రత్యేకించి భద్రపరచిన అమరావతి అద్భుత శిల్పాలను కొద్దినెలల క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా వీక్షించి తరలింపుపై భారత విదేశీ వ్యవహారాలశాఖ ద్వారా లండన్‌కు లేఖ పంపారు. దీనిపై నిపుణులతో కమిటీని కూడా నియమించారు. అమరావతి శిల్పసంపద కారణంగానే తమ మ్యూజియం విశ్వ జనీనమైందనే భావన ఉంది. ఈ పరిస్థితుల్లో వాటిని అమరావతికి తిరిగి పంపేందుకు లండన్ ప్రభుత్వం కూడా అంగీకరించటంలేదు. మ్యూజియంలలో భద్రపరిచిన వాటిలో బౌద్ధులకు సంబంధించిన శిల్పాలే 400కు పైగా ఉన్నట్లు సమాచారం. అయితే తమ వద్ద ఉన్న వాటిలో కొన్నింటిని అదీ కొంత కాలపరిమితిని నిర్దేశించి తిరిగి మ్యూజియంకు స్వాధీనపరిచే షరతుపై ఏపి ప్రభుత్వంతో ఏకాభిప్రాయం కుదిరితేనే అప్పగించాలని లండన్ పురావస్తుశాఖ స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు భారత విదేశాంగశాఖకు లండన్ పురావస్తుశాఖ క్యూరేటర్ లేఖ కూడా రాసినట్లు తెలియవచ్చింది. ఐదేళ్లు లేదా పదేళ్లవరకు అమరావతిలో ఉంచుకుని తిరిగి తమకు స్వాధీనం చేసేట్టయితే వాటిని తరలిస్తామని తేల్చిచెప్పారు.
శిల్పసంపదతో ప్రత్యేకించి రాజధాని ప్రాంతంలో పురావస్తుశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అత్యంత విలువైన ప్రాచీన సంపదను భద్రపరిచే సాంకేతిక పరిజ్ఞానం మనకులేదని అధికారులు తేల్చి చెప్తున్నారు. అవి అక్కడ ఉంటే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఏపి విజ్ఞాపనపై ఢిల్లీ, కోల్‌కతా పురావస్తుశాఖ అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానంలేదు. అమరావతి శిల్ప సంపదతో పాటు ఏపిలోని పురావస్తు కళాఖండాలు కొన్ని హైదరాబాద్ మ్యూజియంలో కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. విభజన చట్టం ప్రకారం వీటిని రాష్ట్రానికి తరలించే దిశగా ప్రభుత్వం ప్రయత్నించాల్సి ఉంది.