ఆంధ్రప్రదేశ్‌

పోర్టు భూముల ట్యాంపరింగ్‌పై నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 14: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ పరిసరాలలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల దుమారం చెలరేగుతోంది. భూముల ట్యాంపరింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిస్తున్నట్టు గతంలో అధికారులు చెప్పినప్పటికీ, ఆచరణలో కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను కాజేసిన అక్రమార్కుల గుట్టు బయట పెట్టడం లేదంటూ సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన శాసన సభ్యుడు జిల్లా అధికారులపై ఆరోపణలు చేయడం చర్చనీయాంశమయ్యింది. విలువైన ప్రభుత్వ భూములు ట్యాంపరింగ్ అయినట్టు ఆధారాలతో సహా నిరూపించినా జిల్లా కలెక్టర్ సహా సంబంధిత అధికారులు ఎంతమాత్రం ఖాతరు చేయడం లేదని, వీరి అనుచిత చర్యల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని కాకినాడ సిటీ శాసన సభ్యుడు వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు. నగరంలో గత ప్రభుత్వాల హయాంలో జరిగిన ప్రభుత్వ భూకబ్జాలపై గగ్గోలు పెడుతున్నా కలెక్టర్ కనీసం స్పందించడం లేదని, దీంతో ఇక నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ముఖ్యంగా అధికార పార్టీలో ఉండి కూడా అధికారుల వింత ప్రవర్తన కారణంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే పాత్ర పోషించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన వాపోయారు. దీంతో ముఖ్యమంత్రి వద్దే ఈ అక్రమ భూమి ట్యాంపరింగ్ వ్యవహారంపై పంచాయితీ పెట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే సహా అధికార పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు.
కాకినాడ నగరంలో ప్రభుత్వ భూములకు సంబంధించి నకిలీ ధృవపత్రాలు(రికార్డ్స్ ట్యాంపరింగ్) జరిగినట్టు గతంలోనే వెల్లడయ్యింది. కాకినాడ పోర్టు, రైల్వే, నగర పాలక సంస్థకు చెందిన కోట్లాది రూపాయల విలువైన సుమారు 150 ఎకరాల భూమి ట్యాంపరింగ్‌కు గురయ్యింది. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములకు నకిలీ ధృవపత్రాలను సృష్టించిన వైనాన్ని ఈ ఏడాది జనవరిలో జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ దృష్టికి స్థానిక ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తీసుకువెళ్ళారు. మళ్ళీ ఏప్రిల్‌లో కూడా ఈ అక్రమ భూ దందాపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన ఈ విషయాన్ని పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 500 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల ట్యాంపరింగ్‌కు పాల్పడినవారిపై విచారించి, నిజాల నిగ్గుతేల్చి, అక్రమార్కుల పేర్లను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేస్తునట్టు చెప్పారు. అయితే అక్రమార్కులతో జరిగిన బేర సారాల కారణంగానే వారి పేర్లను బయట పెట్టడం లేదనే అనుమానం కలుగుతోందని ఎమ్మెల్యే ఆరోపించడం గమనార్హం! జిల్లా అధికారుల వైఖరి కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆయన ఆరోపించారు.
ఇదిలావుండగా పోర్టు, రైల్వే, నగర పాలక సంస్థలకు చెందిన భూములు ట్యాంపరింగ్‌కు గురైనట్టు అధికారుల విచారణలో వెల్లడైనప్పటికీ ఆ నివేదికను బహిర్గతం చేయకపోవడం పట్ల వివిధ వర్గాల్లో అనేక సందేహాలు కలుగుతున్నాయి. అయితే పోర్టు భూములు పెద్ద మొత్తంలో ట్యాంపరింగ్ అయినప్పటికీ ఈ వివరాలను అందించడంలో పోర్టు డైరెక్టర్ సహకరించడం లేదన్న ప్రచారం మరోవైపు జరుగుతోంది. పోర్టు భూములను బడా బాబులు దొడ్డిదారిలో ఆక్రమించుకోవడం, వారి అడుగుజాడల్లో జిల్లా యంత్రాంగం పయనిస్తుండటం, మాజీ ప్రజాప్రతినిధులు ట్యాంపరింగ్‌కు సూత్రధారులు కావడం తదితర కారణాలతో పోర్టు డైరెక్టర్ ప్రేక్షక పాత్ర వహించారున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.