ఆంధ్రప్రదేశ్‌

సర్వేయర్ భూదందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 14: రెవెన్యూ శాఖలో ఆయనది కేవలం సర్వేయర్ ఉద్యోగం. అధికారులకు మాయమాటలు చెప్పి, వారిని లోబరుచుకుని రికార్డులను తారుమారు చేయడం, కోట్ల రూపాయల భూములను వేరొకరి పేరున బదలాయించడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసిబికి దొరికిపోయి, సస్పెండ్ అయినా సదరు సర్వేయర్ మారలేదు. సస్పెన్షన్ తరువాత తిరిగి విధుల్లో చేరిన ఆయన మరింతగా రెచ్చిపోయి సుమారు 3,900 కోట్ల రూపాయల విలువైన భూ రికార్డులను మార్చేశాడు. ఇప్పటి వరకూ సిట్ అధికారులు జరిపిన దర్యాప్తులో ఈ సర్వేయర్ చేసిన నిర్వాకంలో కొంత మాత్రమే బయటపడింది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేగా పనిచేస్తున్న గణేశ్వరరావు పాల్పడిన, కళ్లు చెదిరే అవకతవకలు పోలీసులకే ఆశ్ఛర్యం కలిగిస్తోంది. గణేశ్వరరావు చేసిన భూ కుంభకోణాల వివరాలను నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ సోమవారం విలేఖరులకు తెలియచేశారు. రెవెన్యూ శాఖలో 1982లో చిరు ఉద్యోగిగా చేరిన గణేశ్వరరావు విజయనగరం, భీమిలి, జామి, మచిలీపట్నం, విశాఖపట్నం, కాకినాడ, హైదరాబాద్ తదితర ప్రదేశాల్లో పనిచేశాడు. 2009లో ఏసిబి అధికారులు గణేశ్వరరావు ఆస్తులపై దాడి చేసి, అక్రమార్జనను బయటపెట్టారు. అప్పుడు సస్పెండ్ అయిన గణేశ్వరరావు తిరిగి 2011లో విధుల్లో చేరాడు. అయినప్పటికీ, ఆయన క్రిమినల్ మైండ్‌లో మార్పు రాలేదు. విశాఖలోని విలువైన భూములపై గణేశ్వరరావు కన్నుపడింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడి రెవెన్యూ అధికారులను లోబరుచుకుని 1బి రికార్డులను తారుమారు చేసి, ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కార్యక్రమం విజయవంతంగా సాగించాడు. 2016లో విశాఖ రూరల్ తహశీల్దారుగా పనిచేస్తున్న మద్ది శంకరరావును గణేశ్వరరావు ఆకట్టుకున్నాడు. సర్వీసు చివరాంకంలో ఉన్న శంకరరావుకు కోటి రూపాయల విలువైన ఫ్లాట్ ఇచ్చాడు. అలాగే మారుతి స్విఫ్ట్ డిజైర్ కారును కూడా ఇచ్చాడు. దీంతో శంకరరావు, గణేశ్వరరావు చెప్పినట్టల్లా ఆడాడు. గణేశ్వరరావు మధురవాడ, కొమ్మాది, పిఎం పాలెం తదితర ప్రాంతాల్లోని సుమారు 390 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులు తారుమారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీని విలువ 3,900 కోట్లు. అయితే, ప్రస్తుతానికి ఆయన దగ్గర నుంచి 145 పట్టాదారు పాస్ పుస్తకాలతోపాటు పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించగా, వాటిలో 55 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులు తారుమారు చేసినట్టు తెలిసింది. దీని విలువ 550 కోట్లుగా పోలీసులు నిర్థారించారు. అన్నింటికన్నా ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే, విజయనగరం మహారాజుకు చెందిన మాన్సాస్ ట్రస్ట్ భూముల రికార్డులు కూడా గణేశ్వరరావు దగ్గర లభించాయి. వీటిని కూడా గణేశ్వరరావు తారుమారు చేసినట్టు పోలీసులు వివరించారు. గణేశ్వరరావుపై స్థానిక ఆరిలోవ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 202/17 కేసులో 55 ఎకరాల మేర రికార్డులు తారుమారు చేసినట్టు పేర్కొన్నారు. వీటిని 12 మంది పేరున బదలాయించినట్టు కేసు నమోదు చేశారు. 163/17 కింద గణేశ్వరరావుపై నమోదైన కేసులో మధురవాడ, కొమ్మాదిలో 320 ఎకరాల భూ రికార్డులను తారుమారు చేశాడు. వీటిని 30 మంది పేరున బదలాయించాడు. అదేవిధంగా 203/17 కింద నమోదైన కేసులో 18 ఎకరాలను 55మంది పేరిట బదలాయించాడు. ఇందులో 30 మందిని గుర్తించినట్టు కమిషనర్ వెల్లడించారు.
విలాసవంతమైన జీవితం
గణేశ్వరరావు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్టు పోలీసులు చెప్పారు. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేగా పనిచేస్తున్న గణేశ్వరరావు అక్రమార్జన అంతా ఇంతా కాదు. తన మాటకారితనంతో అధికారులను లోబరుచుకుని వారికి ఎంతో కొంత ముట్టచెప్పి, వారితో అక్రమాలు చేయిస్తుంటాడు. అన్నింటికీ మించి గణేశ్వరరావు పనిచేసిన ప్రాంతాల్లోని తహశీల్దార్లు, ఆర్డీఓలు తదితర అధికారుల సంతకాలన్నీ జిరాక్స్ తీసుకుని ఓ పెద్ద ఆల్బమ్ తయారు చేశాడు. ఆయనకు కావల్సినప్పుడల్లా ఆ సంతకాలను ఫోర్జరీ చేసి రికార్డులు తారుమారు చేస్తుంటాడు. ఇదిలా ఉండగా గణేశ్వరరావును పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ కేసు విచారణ నిమిత్తం తిరిగి పోలీస్ కస్టడీకి కోరుతామని, విచారణలో వాస్తవాలు వెల్లడించడం లేదని తేలితే, లై డిటెక్టర్‌ను వాడతామని పోలీస్ కమిషనర్ తెలియచేశారు.

చిత్రం.. నిందితుడు గణేశ్వరరావు, స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను
మీడియా ముందుంచిన నగర పోలీస్ కమిషనర్ యోగానంద్