ఆంధ్రప్రదేశ్‌

ఇక సంకుల సమరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 15: కుల ఉద్యమాలతో ఇప్పటికే వేడెక్కిన నవ్యాంధ్రలో మరో కుల ఉద్యమం ఊపిరిపోసుకోనుంది. 20 శాతం రిజర్వేషన్ల డిమాండుతో బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, కమ్మ, క్షత్రియ, వెలమ కులాలన్నీ ఒకే వేదికపైకి రానున్నాయి. ఉద్యమ స్వరూప స్వభావం, కార్యాచరణ ఖరారు కోసం, ఆయా కుల సంఘాల ప్రతినిధులు ఈనెల 19న శ్రీశైలంలోని అఖిల భారత రెడ్డి సంఘాల సమాఖ్య కల్యాణమండపంలో భేటీ కానున్నాయి. దీనితో నవ్యాంధ్రలో గుజరాత్ మాదిరిగా కొత్తగా అగ్రకుల పోరాటానికి తెరలేవనుంది. ఇప్పటికే గుజరాత్‌లో పటేళ్లు తమను ఓబీసీల్లో చేర్చాలని ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటివరకూ బీసీ, కాపు ఉద్యమాలతో హోరెత్తుతున్న నవ్యాంధ్రలో ఇక అగ్రకుల ఉద్యమం కూడా చేరనుంది. బ్రాహ్మణ, వైశ్య, రెడ్డి, కమ్మ, క్షత్రియ, వెలమ కులాల్లోని నిరుపేదలకు విద్య, ఉద్యోగ, ఉపాధిరంగాల్లో తప్పనిసరిగా 20 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండుతో అగ్ర కులాలన్నీ ఓకే వేదికపై రానున్నాయి. దీనికోసం ఆయా కులాల్లోని ప్రముఖులంతా తొలిసారిగా ఒకే తాటిపైకి రానుండటం విశేషం.
అగ్ర కులాలన్నింటికీ ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటుచేయాలని, అది సాధ్యం కాకపోతే అగ్ర వర్ణాలన్నింటికీ కలిపి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌కు పదును పెట్టనున్నారు. ఇప్పటికే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేశారని, అయితే దానికి ఇచ్చిన 67 కోట్లు సరిపోవని, ఇంకా పెంచాలని, అదేవిధంగా అన్ని కులాలకు బ్రాహ్మణ కార్పొరేషన్ మాదిరిగానే ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటుచేయాలని, అది సాధ్యం కాని పక్షంలో అగ్రకులాలన్నింటిని కలిపి ఒకే కార్పొరేషన్‌గా ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో, ఈ భేటీ జరగనున్నట్లు తెలుగు రాష్ట్రాల ఓసి సంఘర్షణ సమితి అధ్యక్షుడు సింగం సదాశివరెడ్డి ఆంధ్రభూమికి వివరించారు. వచ్చే నెలలో కోస్తాలో మహాగర్జన ఏర్పాటుచేస్తామని, తర్వాత తెలంగాణలో కూడా సభలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్, ఏపి ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు, ఆలిండియా క్షత్రియ సేవా సంఘం అధ్యక్షులు డి.రమేష్, ఆలిండియా వెలమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు, ఏపి రెడ్డి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బాలబ్రహ్మారెడ్డి, ఏపి కమ్మ సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ చంద్రబోస్ తదితరులు ఈ భేటీకి హాజరుకానున్నారు.
అగ్ర కులాల్లోనే అధిక శాతం నిరుపేదలున్నారని, వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో 20 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్‌తో ఓసి రిజర్వేషన్ల పోరాట సమితి ఉద్యమం ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. అయితే, అగ్ర కులాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలతోపాటు వృత్తి నిపుణులు, వాణిజ్య వ్యాపార రంగాల్లో ఉన్న వారి పిల్లలకు ఈ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, కేవలం పేదలెవరో గుర్తించి వారికి మాత్రమే 20 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్‌తో ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నారు. దానికి సంబంధించి 19న శ్రీశైలంలో జరిగే కీలక భేటీలో ఉద్యమ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
ఇదిలాఉండగా వచ్చే నెలలో తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు కోస్తా ప్రాంతంలో భారీ జనసమీకరణ చేసి మహాగర్జన నిర్వహించాలని నిర్ణయించారు. తాము ఏ కులానికీ వ్యతిరేకంగా కాదని, అగ్ర కులాలపై అన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు.
ఇప్పటివరకూ బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, వైశ్య, వెలమ వర్గాల ముఖ్యమంత్రులు పనిచేసినప్పటికీ, వారి వల్ల ఆయా కులాలకు వచ్చిన ప్రయోజనాలేమీ లేవని వారు గుర్తు చేస్తున్నారు. వారు కూడా తమ పార్టీల ఉనికి కోసం ఇతర కులాలకే ప్రయోజనాలు చేకూర్చి, సొంత కులాలకు మేలు చేస్తే, ఎక్కడ ఇతర కులాల దృష్టిలో దోషిగా నిలబడతామన్న భయంతో అగ్ర కులాలను నిర్లక్ష్యం చేసిన చరిత్రను గుర్తు చేస్తున్నారు.
తాజా లెక్కల ప్రకారం.. ఏపిలో బిసిలు 45 శాతం, కాపులు 10, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనారిటీలు 9 శాతం; రెడ్డి 6, కమ్మ 5, వెలమ 2, వైశ్య 3, బ్రాహ్మణ 2, క్షత్రియ 3 శాతం ఉన్నారు. తెలంగాణలో బిసిలు 45, ఎస్సీ 15, ఎస్టీ 5, మైనారిటీ 12, బలిజ 4, కమ్మ 3, రెడ్డి 5, వెలమ 5, క్షత్రియ 2, వైశ్య 2, బ్రాహ్మణులు 2 శాతం ఉన్నారు. రెండు ప్రభుత్వాలు తమ బడ్జెట్‌లో ఓసీయేతర కులాలకు 38 కోట్లు కేటాయించాయి.
ఇతర కులాలకు
మేం వ్యతిరేకం కాదు: సదాశివారెడ్డి
తమ ఓసీ ఉద్యమం ఇతర కులాలకు వ్యతిరేకం కాదని, వారికి ఇవ్వాల్సిన రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని సదాశివారెడ్డి వెల్లడించారు. పేరుకే అగ్రకులాలుగా ఉన్న తమ వర్గాల్లో, తిండికి లేక అలమటిస్తున్న వారు, చదివిన చదువుకు తగిన ఉద్యోగాలు లేనివారి సంఖ్య లక్షల్లో ఉన్నారని వెల్లడించారు. విద్య, ఉద్యోగ, ఉపాథి రంగాల్లో ఓసీలకు కచ్చితంగా 20 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, అందులోనూ క్రిమీలేయర్ పాటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.