ఆంధ్రప్రదేశ్‌

సిఎంతో మృత్యుంజయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 17: గుంటూరు జిల్లా వినుకొండ మండలం ఉమ్మిడివరంలో బోరుబావిలో పడిన చిన్నారిని ప్రాణాలతో కాపాడిన ఘటనను ఒక కేస్ స్టడీగా తీసుకుని డాక్యుమెంట్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. తల్లితండ్రులతో కలిసి మృత్యుంజయుడు చంద్రశేఖర్‌ను మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావులు గురువారం ముఖ్యమంత్రి వద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రానున్న కాలంలో ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో మరెక్కడా పునరావృతం కాకుండా గట్టి జాగ్రత్తలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వదిలేసిన ఇలాంటి నీళ్లు పడని బోరు బావులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే వాటి ఛాయాచిత్రాలు తీసి ప్రభుత్వానికి పంపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ముఖ్యంగా ఈ విషయంలో యువత ప్రధాన భూమిక పోషించాలని, సెల్‌ఫోన్‌లో మూతలేని బావుల ఛాయాచిత్రాలు తీసి సోషల్ మీడియాలో ఉంచాలని సూచించారు. ఇలా తెలియజేసిన వారికి ప్రభుత్వపరంగా తగిన ప్రోత్సాహకం అందిస్తామని చెప్పారు. ఎవరరైనా తమ తమ వ్యవసాయ క్షేత్రాలు, నివాస ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న బోరు బావులను పూడ్చివేయకుండా నిర్లక్ష్యంగా వదిలేసి చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఇక వెనుకాడబోదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇలాంటి విపత్తులు ఎదురైనప్పుడు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వ్యవహరించి సమయానుకూల వ్యూహాలను అనుసరిస్తే సానుకూల ఫలితాలు లభిస్తాయని చెప్పడానికి ఉమ్మిడివరం ఘటన చాటి చెప్పిందని ఆయన అన్నారు. సాధారణంగా ఇలాంటి ఉపద్రవాలు ఎదురైనప్పుడు ఎన్‌డిఆర్‌ఎఫ్, గ్రేహౌండ్స్, అక్టోపస్, ఫైర్ సర్వీసెస్, హెల్త్, పోలీస్, జిల్లా రెవిన్యూ శాఖలు కలిసి సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు దక్కుతాయన్నారు. 15 అడుగుల మేర బోరుబావిలో 11 గంటల జీవన పోరాటం చేసి మృత్యుంజయుడై తిరిగి వచ్చిన ఏడాది 9 మాసాల చిన్నారి చంద్రశేఖర్‌ను ముఖ్యమంత్రి ఎత్తుకుని ముద్దాడి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. చిన్నారి ఉజ్వల భవిష్యత్తుకు భరోసా ఇస్తూ రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి 20 ఏళ్లకి రూ.20 లక్షలు అయ్యాక అతనికి అందేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
చిత్రం..బోరుబావి నుండి సురక్షితంగా బయటపడిన బాలుడు చంద్రశేఖర్‌ను ఎత్తుకున్న చంద్రబాబు