ఆంధ్రప్రదేశ్‌

అమిత్ షా పర్యటనతో బిజెపికి కొత్త ఊపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఆగస్టు 20: ఏడాదిన్నర సమయం ఉండగానే భారతీయ జనతా పార్టీ ఎన్నికల సన్నాహాలు ప్రారంభించింది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలకు కన్వీనర్లును నియమిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకుని మండల, పట్టణ కమిటీల నియామకాలు పూర్తిచేసుకున్న కమలనాథులు తాజాగా కన్వీనర్ల నియామకంపై దృష్టిసారించారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు కన్వీనర్లను నియమించనున్నారు. జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు చాపకింద నీరులా రాష్ట్రంలో పార్టీలో సంస్థాగత వ్యవహారాలు సాగిపోతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్ర పార్టీ నేతలు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఈ నెల 28, 29, 30 తేదీల్లో అమిత్ షా రాష్ట్ర పర్యటన ఖరారు కావడంతో సంస్థాగత వ్యవహారాలపై రాష్ట్ర నాయకత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటివరకు పార్టీ కమిటీల నియామకం నామ్‌కే వాస్తేగా సాగేవని అందరికీ తెలిసిందే. అయితే జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తన పర్యటనల్లో కమిటీలపై గుచ్చిగుచ్చి వివరాలు అడుగుతుండటంతో నేతలు పరుగులు ప్రారంభించారు. అన్ని జిల్లాల్లోని ప్రధాన పార్టీ కమిటీలతో పాటు అనుబంధంగా మహిళా మోర్చా, యువమోర్చా, కిసాన్ మోర్చా, ఎస్సీ మోర్చా, మైనార్టీ, మజ్దూర్, గిరిజన, ఒబిసి ఇలా అన్నింటికి గ్రామం, మండలం, పట్టణం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో కమిటీలను పక్కాగా నియామకాలు చేస్తున్నారు.
అదేవిధంగా రాష్ట్ర స్ధాయిలో కూడా ఈ కమిటీలను అమిత్ షా పర్యటనలోపు భర్తీచేయడానికి చర్యలు చేపడుతున్నారు. సాధారణంగా రాష్ట్రంలో అధికారం కోసం పోటాపోటీగా తలపడే పార్టీలే నియోజకవర్గస్థాయి కన్వీనర్లను నియమించుకుంటాయి. టిడిపి, వైసిపి, గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో కన్వీనర్లను నియమించుకుంటాయి. తాజాగా బిజెపి సైతం నియోజకవర్గస్థాయిలో కన్వీనర్ల నియామకాలకు తెరలేపడం రాజకీవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మొత్తం మీద రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలోనైనా పోటీచేయగలిగే స్థాయిలో సంస్థాగతంగా బలపడేలా కమలనాథులు ఇప్పటి నుండే చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టమవుతోంది.