ఆంధ్రప్రదేశ్‌

సం‘కుల’ సమరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 20: నంద్యాల శాసనసభ ఉప ఎన్నికల్లో రాజకీయం కొత్త పుంతలు తొక్కింది. ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడుస్తూ కులాలు, మతాల వారీగా ప్రచారం కొనసాగింది. ప్రచారం ప్రారంభమయ్యాక అంతర్గతంగా కులాలు, మతాల పెద్దలను పిలిచి మాట్లాడిన రాజకీయ పార్టీలు చివర్లోకి వచ్చే సరికి బహిరంగ సమావేశాలు నిర్వహించడం విశేషం. టిడిపి, వైకాపా రెండూ కులాలు, మత పెద్దలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో సహకరించాల్సిందిగా కోరడం గమనార్హం. వైకాపా అధినేత జగన్ 10 రోజులకు పైగా నంద్యాలలో మకాం వేసి అన్ని గ్రామాలు, వార్డుల్లో రోడ్‌షోలు నిర్వహించిన అనంతరం కులాలు, మతాల సమావేశాలకు తెరదీశారు. ఆయన క్రిష్టియన్ మత పెద్దలు, వైశ్య కులపెద్దలతో సమావేశం నిర్వహించి వారి మద్దతు కోరారు. ఆయనకేమీ తక్కువ తినలేదన్నట్లుగా టిడిపి అధినేత చంద్రబాబు క్రిష్టియన్, ముస్లిం మతపెద్దలు, వైశ్య, బలిజ కుల పెద్దలతో సమావేశమయ్యారు. నంద్యాలలో పార్టీ అభ్యర్థి విజయం కోసం వారితో సంప్రదింపులు జరిపారు. వీరివురి కంటే ముందే వైకాపా, టిడిపి నేతలు కులాల నాయకులను పిలిపించుకుని మాట్లాడి మద్దతు కూడగట్టారు. ఎన్నికల నిబంధనల మేరకు ప్రచారంలో మతాలు, కులాలను ప్రస్తావించడం కూడా నేరమే. గతంలో దివంగత ఎన్టీ రామారావు శ్రీ కృష్ణుడి అవతారంలో ఉన్న కటౌట్లను సైతం ఎన్నికల కమిషన్ తొలగించిన సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచే రాజకీయ పార్టీల నేతల విగ్రహాలకు ముసుగులు వేయడం ప్రారంభించారు. వారు సైతం ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయకూడదన్నదే నిబంధన. అయితే నంద్యాల ఎన్నికల్లో మాత్రం అవన్నీ గాలికి కొట్టుకుపోయాయి. బహిరంగంగా మతాలు, కులాల సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. రెండు పార్టీలు నిర్వహించిన సమావేశాలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్య ప్రకాశరెడ్డి, జెడీ శీలంలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే తాము ఫిర్యాదు చేసినా అనుకూల స్పందన కనిపించకపోవడం అభ్యంతరకరమని వారు పేర్కొన్నారు. చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో ఒక రోజు రోడ్‌షోలకు, మరోరోజు కులాలు, మతాల పెద్దలతో మాట్లాడటానికి సమయం కేటాయించగా జగన్ 10 రోజులు రోడ్ షోలకు, ఆ తరువాత వరుసగా కుల, మత సమావేశాలు నిర్వహించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని కోట్ల సూర్య ప్రకాశరెడ్డి ఆరోపించారు. కాగా ఈ సమావేశాలు భవిష్యత్తులో ప్రజలు కులాలు, మతాల వారీగా విడిపోయి ఘర్షణలకు దిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలు కులాలు, మతాలకు అతీతంగా స్వేచ్చగా జరగాల్సి ఉండగా టిడిపి, వైకాపాలు వాటినే ఆధారంగా చేసుకుని ఓట్లడగడం సరైన చర్య కాదని ఆయన విమర్శించారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

చిత్రం..ఆత్మీయ సమావేశంలో చంద్రబాబును గజమాలతో సన్మానిస్తున్న ముస్లింలు