ఆంధ్రప్రదేశ్‌

గోదారమ్మకు గర్భశోకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 20: ఇసుక మాఫియా గోదావరి నదికి తూట్లు పెడుతోంది. ఎక్కడబడితే అక్కడ యంత్రాలతో విచక్షణారహితంగా తవ్వేస్తుండటంతో నది గర్భశోకంతో విలవిల్లాడుతోంది. ఇసుక దిబ్బల్లో మాఫియా భారీస్థాయిలో చెరువుల మాదిరిగా తవ్వకాలు సాగించడంవల్ల నదీ గమన దిశలు మారిపోయే స్థితిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అఖండ గోదావరి నది కాటన్ బ్యారేజి ఎగువ, దిగువన ఇసుక మాఫియా ఉచిత ఇసుక విధానం మాటున కోట్ల ఇసుక వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తోంది. గోదావరి ఇసుక అత్యంత నాణ్యత కలిగింది కావడంతో నిర్మాణ రంగంలో అత్యధిక డిమాండు వుంది. భారీ లారీలు, టిప్పర్లపై విశాఖ, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాలకు రాత్రి సమయాల్లో భారీ స్థాయిలో రవాణా జరుగుతోంది. రోజుకు దాదాపు వంద లారీల వరకు గుట్టుచప్పుడు కాకుండా రవాణా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గోదావరి నదికి వరద కాలం కావడంతో ఇసుకకు మరింత డిమాండ్ ఉంది. నిర్మాణదారులు స్వేచ్ఛగా ఇసుకను పొందాలని ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలుచేస్తోంది. కానీ వినియోగదారుడికి ఎక్కడా ఉచితంగా ఇసుక అందడంలేదు. ఈ విధానం మాఫియాకు అనుకూలంగా మారింది. ఉచితం మాటున భారీ వ్యాపారాన్ని సాగిస్తోంది. లారీ ఇసుక దూర ప్రాంతాలకు రూ .30 వేల వరకు అమ్మకాలు సాగిస్తోంది.
టెండర్ల విధానంలో ఇసుక ర్యాంపులు కేటాయించేటపుడు ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు రూ.1500 కోట్ల వరకు ఆదాయం లభించేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత సుమారు 800 కోట్ల వరకు ఆదాయం లభించేది. రకరకాల ప్రయోగాల అనంతరం చివరకు ఉచిత విధానాన్ని ప్రభుత్వం కొనసాగిస్తోంది. మిషనరీ వినియోగించకుండా కేవలం మానవవనరులను వినియోగించి ఇసుకను నదీ గర్భం నుంచి తీసి నావలపై తెచ్చేవిధంగా ఏర్పాట్లుచేశారు. అయితే ఈ విధానం ఎక్కడా అమలుకావడం లేదు. బోగస్ నావలు, బినామీ సొసైటీల ద్వారా ఇసుక ర్యాంపులను మాఫియా తమ చెప్పు చేతల్లో పెట్టుకున్నాయని తెలుస్తోంది. అఖండ గోదావరి కుడి, ఎడమ గట్ల వైపు మాఫియా పెద్ద ఎత్తున ఇసుకను మిషనరీ ద్వారా తవ్వేసి తూట్లుపొడిచారు. ప్రభుత్వాదాయానికి భారీ గండి కొట్టారు. టెండర్ల విధానంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పక్కదారి పట్టింది. దాదాపు రూ.1500 కోట్ల ఇసుక వ్యాపారం మాఫియా చేతుల్లో నడుస్తోంది. ఉచిత ఇసుక విధానం ఇటు ప్రజలకు ఉపయోగపడ్డం లేదు..అటు ప్రభుత్వానికి మంచి పేరు రావడం లేదు.
గోదావరి నదిలో మొత్తం 34 చోట్ల నుంచి ఇసుక తీసుకోవచ్చని గుర్తించారు. పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించకుండా, నదీ గర్భానికి భంగకరం కాకుండా ఇసుకను తవ్వాల్సివుంది. నదిలో ఇసుకను దేవుతూవుంటే, మరింత ఇసుక అక్కడకు వచ్చి చేరుతుంటుంది.. ఈ విధానంలో ఇసుకను తీయాల్సి వుంది. కానీ ఎక్కడా అలా జరగడం లేదు. కుడిగట్టు వైపు పోలవరం మొదలు కొని ఇటు కొవ్వూరు వరకు విచక్షణా రహితంగా నదీ గర్భానికి తూట్లుపెట్టారు. ఎడమ గట్టు వైపు రాజమహేంద్రవరం రూరల్ మండలం పరిధిలో ఇటు నాల్గవ వంతెన నుంచి అటు బ్యారేజి వరకు పెద్ద ఎత్తున అక్రమ విధానంలో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నా పట్టించుకునే నాథుడు కన్పించడంలేదు. ఇసుక తీసేవారే అమ్మకాలు సాగిస్తే వినియోగదారుడికి కేవలం రవాణా చార్జీలు, నావల కార్మికులు తీసినందుకయ్యే ఖర్చు చెల్లిస్తే సుమారు రూ.2000 లోపే రెండు యూనిట్ల ఇసుక లభించేది. కానీ ఇపుడు మాఫియా వల్ల రెండు యూనిట్లు రూ.20వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జొన్నాడ, రావులపాలెం, మందపల్లి, అంకంపాలెం, ఆత్రేయపురం, గోపాలపురం, మందపల్లి, ఊబలంక తదితర ప్రాంతాల్లో భారీ యంత్రాలతో తీసిన ఇసుక టిప్పర్లతో రాజమహేంద్రవరం కేతావారిలంక ర్యాంపు, గాయత్రి ర్యాంపు వద్ద దిగుమతిచేసి ఇక్కడ నుంచి నావలపై తీసిన ఇసుక మాదిరిగా విక్రయాలు సాగించే విధానం కూడా మాఫియా నిర్వహిస్తోంది. ఏదేమైనప్పటికీ మాఫియా చేతిలో ఇసుక బంగారం కురిపిస్తోంది. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలు నష్టపోవడమేకాక, విచ్చలవిడి తవ్వకాలవల్ల గోదావరి జిల్లాలకు ప్రమాదకరంగా పరిణమిస్తోంది.

వంగలపూడి వద్ద నదీ గర్భంలో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక తవ్వకాలు (ఫైల్ ఫొటో)