ఆంధ్రప్రదేశ్‌

సానుభూతి, అభివృద్ధే మంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 28: కర్నూలు జిల్లా నంద్యాల శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించడానికి ప్రధాన కారణాలు సానుభూతి, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలేనని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నంద్యాల పట్టణంలో పక్కాగృహాలు లేని పేదలకు ఇళ్లు నిర్మించాలని, ఇరుకుగా ఉన్న రహదారులను విస్తరించి ప్రజలకు సౌకర్యం కల్పించాలని తలపెట్టారు. అయితే ప్రతిపక్ష పార్టీలో ఉండడంతో ఆయనకు ప్రభుత్వం నుంచి సహకారం లభించలేదు. దీంతో తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం పార్టీ మారాల్సి వస్తోందంటూ ప్రకటించి వైకాపా నుంచి టిడిపిలో చేరారు. ఏడాదికాలం ఆ పార్టీలో ఉండి రహదారుల విస్తరణ, పక్కా గృహాల మంజూరుకు కృషి చేశారు. ఈ క్రమంలో మార్చి 12న గుండెపోటుతో మరణించారు. దాంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. భూమా మరణం తరువాత ఆయన కుమార్తె, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఈ సందర్భంగా భూమానాగిరెడ్డి చివరి కోరిక అయిన నంద్యాల పట్టణాభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాలు అందించడానికి తీవ్రంగా కృషి చేస్తానని అఖిలప్రియ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆమె నంద్యాల నియోజకవర్గానికి 13 వేలకు పైగా పక్కాగృహాలను మంజూరు చేయించడంతోపాటు పెన్షన్ లేని ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పించగలిగారు. అంతేకాకుండా రహదారుల విస్తరణ కోసం పక్కా ప్రణాళికలు రూపొందించి ఆ పనులను ప్రారంభింపచేయగలిగారు. ఈలోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టిడిపి తరుపున ఐదుగురు మంత్రులు నంద్యాలలో ఉండిపోయ అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించగా సుమారు 15 మంది ఎమ్మెల్యేలు ఎన్నికల కార్యక్రమాన్ని సమీక్షించారు. దివంగత నేతలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిని గుర్తు చేస్తూ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, మంత్రి అఖిలప్రియ, ఆమె సోదరి వౌనిక, సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డిలు విరామం లేకుండా నియోజకవర్గంలో పర్యటించారు.
తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చడం కోసమే తాము రాజకీయాల్లో కొనసాగుతున్నామని, ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్య పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.1500 కోట్లు మంజూరు చేశారని ప్రచారంలో పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ప్రతి ఓటరును కలిసి తల్లిదండ్రులు లేని తమను ఆశీర్వదించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం తల్లిదండ్రులు లేని పిల్లలపై కక్షసాధింపు చర్యలు సరైనవి కావంటూ వైకాపాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోవైపు టిడిపి శ్రేణులు ఓటర్ల వద్దకు వెళ్లినప్పుడు తమ పార్టీని గెలిపిస్తే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయని, ప్రభుత్వం నిర్ణయించినట్లుగా 18 నెలల్లో సొంత ఇంటి కల నెరవేరుస్తామని ప్రజలకు తెలిపారు. ఒకవేళ టిడిపి ఓడిపోతే అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వద్ద మాట్లాడలేని పరిస్థితి ఎదురవుతుందని వారు పేర్కొంటూ ఓట్లు వేసి గెలిపించాలని ప్రచారం చేశారు. మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, అమరనాధరెడ్డి సుమారు 20 రోజుల పాటు నంద్యాలలోనే మకాం వేసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి తోడు ఓటర్ల వ్యక్తిగత కోరికలు సైతం తీర్చడంతో టిడిపి అభ్యర్థి భారీ మెజార్టీ సాధించడానికి మార్గం సుగమం అయిందని విశే్లషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఓటర్లు తమ మనసులో భావాన్ని బయటకు వ్యక్తీకరించకుండా ఓటు ద్వారా మనోభిష్టాన్ని చెప్పారని వారు అంటున్నారు. టిడిపి విజయంతో ఆ పార్టీ శ్రేణులు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో విజయోత్సవాలను భారీ ఎత్తున నిర్వహించాయి.