ఆంధ్రప్రదేశ్‌

కాపుల్లో కనిపించని ‘ముద్ర’గడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 1: కాపు-బలిజ జాతికి నాయకుడిగా వ్యవహరిస్తూ వారిని బీసీల్లో చేర్చాలంటూ ఉద్యమిస్తోన్న మాజీ మంత్రి, కాపునాడు నేత ముద్రగడ పద్మనాభం ప్రభావం ప్రతిష్ఠాత్మకంగా జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో నామమాత్రంగా కూడా కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది. చివరకు సొంత జిల్లాలో జరిగిన ఎన్నికల్లో కూడా కాపులు తెలుగుదేశం పార్టీకి జైకొట్టడంతో ముద్రగడ పలుకుబడి పలచబడిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాపులు, వారిని వ్యతిరేకించే బీసీలు కూడా టిడిపికే జై కొట్టడం బట్టి, రెండు వర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆమోదిస్తున్నట్లు ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపిని ఓడించాలని, ఓడిస్తే తప్ప ఆయన కాపు, బలిజలను బీసీల్లో చేర్చే ప్రయత్నం చేయరంటూ ముద్రగడ తన జాతికి పిలుపునిచ్చారు. అందుకు తగినట్లే కాపు, బలిజ వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలంతా నంద్యాల ప్రచారంలో మోహరించారు. కాపులను బాబు మోసం చేశారని విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే 30 వేల వరకూ ఉన్న బలిజలు వాటిని ఖాతరు చేయకుండా టిడిపికి దన్నుగా నిలిచారు. తర్వాత కొద్దిరోజులకే జరిగిన కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లోనూ వైసీపీకి చెందిన కాపునేతలంతా ప్రచారం చేశారు. పోలింగుకు ముందువరకూ తన ఇంటి వద్దనే ఆందోళన నిర్వహిస్తూ వచ్చిన ముద్రగడ, హటాత్తుగా కొన్ని కిలోమీటర్లు నడిచి కాకినాడ ఎన్నికల్లో కాపుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. దీనితో కాపుల్లో వ్యతిరేకత వస్తుందని టిడిపి నాయకత్వం భయపడింది. ఆ పార్టీ కూడా కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలను డివిజన్ల వారీగా మోహరించింది. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 25 డివిజన్లలో కాపు వర్గ ప్రభావం తీవ్రంగా ఉంది. మొత్తం 18 మంది కాపులు ఈ ఎన్నికల్లో విజయం సాధించగా, అందులో 13 మంది టిడిపి కార్పొరేటర్లు, 5 గురు మాత్రమే వైసీపీ వారుండటం ప్రస్తావనార్హం. సొంత తూర్పు గోదావరి జిల్లా కేంద్రంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని కాపు, బలిజ, ఒంటరి వర్గాలకు నాయతక్వం వహిస్తోన్న ముద్రగడ కార్యక్రమాలకు, అన్ని జిల్లాల నుంచి ఆయా వర్గాలు హాజరవుతున్నారు. ఆ క్రమంలో రాయలసీమలో అధిక సంఖ్యలో ఉన్న బలిజలపై ముద్రగడ ప్రభావం ఉంటుందని, అందువల్ల సీమలో పెద్ద నియోజకవర్గమైన నంద్యాలలో జరిగిన ఉప ఎన్నికలో ముద్రగడ పిలుపు మేరకు బలిజలు టిడిపికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని భావించారు. కానీ అక్కడ ఆ వర్గం టిడిపికే దన్నుగా నిలిచింది. ముద్రగడ వ్యూహాన్ని పసిగట్టిన బాబు, కాపు, బలిజ వర్గాలకు చెందిన సొంత పార్టీ నేతలను పెద్ద సంఖ్యలో ప్రచారానికి దింపి, ఫలితాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధించారు. అయితే, ముద్రగడ సొంత జిల్లాలో జరుగుతున్న కాకినాడ ఎన్నికల్లో 25 డివిజన్లను శాసించే స్థాయిలో ఉన్న కాపులపై ఆయన ప్రభావం ఉంటుందని భావించగా, చివరకు అక్కడా ముద్రగడ పలుకుబడి పలచబడినట్లు ఫలితాలు చాటాయి. దీన్నిబట్టి కాపులపై ఆయన ప్రభావం పనిచేయడం లేదని, ముద్రగడ కార్యకలాపాలకు సొంత సామాజికవర్గంలో మద్దతులేదన్న విషయం స్పష్టమయిందని రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు. నిరాహారదీక్షలు, పాదయాత్రలు, డైడ్‌లైన్లు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, వైసీపీ అనుకూల వైఖరిపై అసంతృప్తితో ఉన్న కాపులు ముద్రగడ పిలుపును పట్టించుకోలేదని ఫలితాలు స్పష్టం చేశాయంటున్నారు. ఆయన ఎవరితో చర్చించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని, చివరకు పాదయాత్ర విరమణ వ్యవహారంపైనా ముద్రగడ తమతో సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పట్టించుకోని సీమ బలిజలు
కాగా, కొన్ని నెలల నుంచి ముద్రగడ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తోన్న రాయలసీమ బలిజలు.. నంద్యాల ఎన్నికలో ఆయన పిలుపును పట్టించుకోలేదని వచ్చిన భారీ మెజారిటీ స్పష్టం చేసింది. కాపులకే ప్రాధాన్యం ఇస్తున్న ముద్రగడ వైఖరికి అసంతృప్తి వ్యక్తం చేసిన సీమ బలిజలు, తమకు కాపులతో ఎలాంటి సంబంధం లేదని, కాపు కార్పొరేషన్‌ను విభజించి బలిజ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని చాలాకాలం నుంచీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నంద్యాల ఉప ఎన్నికలో టిడిపిని ఓడించాలన్న ముద్రగడ పిలుపును పట్టించుకోకుండా బలిజలు టిడిపికే పట్టం కట్టారు. ‘ముద్రగడ ఏకపక్ష తీరు వల్లే కాపులు, బలిజలు ఎటూ కాకుండా పోతున్నారు. గతంలో చిరంజీవి పార్టీ వల్ల ఒకసారి ఈ దుస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ ప్రమాదం కనిపించినా రాయలసీమ బలిజలు, కోస్తాలో కాపులు ఎన్నికల్లో సరైన ఫలితం ఇచ్చి ముద్రగడ నుంచి జాతిని రక్షించుకున్నారు. నంద్యాలలో మా బలిజలు ఆయన పిలుపును ఖాతరు చేయలేదు. రాయలసీమలో బలిజలు కొన్ని దశాబ్దాల నుంచి ఒక వర్గం ఆధిపత్యానికి బలయిపోయారు. ఆ వర్గానికి నాయకత్వం వహిస్తోన్న వైసీపీని పరోక్షంగా గెలిపించాలనే ఆయన టిడిపిని ఓడించాలని చెప్పారు. అంటే మమ్మల్ని అణగదొక్కుతున్న వర్గం కింద పనిచేయాలని ముద్రగడ చెప్పకనే చెప్పారు. ఆయన సొంత జిల్లాలో జరిగిన ఎన్నికల్లో చివరకు కాపులే ఆయనను లెక్కచేయలేదు. నిజంగా ముద్రగడ ప్రభావం కాపులపై ఉంటే 18 వార్డుల్లో టిడిపి ఓడిపోవాలి కదా? గెలిచిన 15 మంది కాపులు టిడిపి వాళ్లే కదా? అంటే కాపులు కూడా టిడిపినే గెలిపించినట్లే కదా? ఇకనైనా ముద్రగడ తన ముసుగు తొలగించి తాను కోరుకుంటున్న పార్టీలో చేరితే బాగుంటుంది. దానివల్ల కాపు-బలిజల్లో ఉన్న గందరగోళానికీ తెరపడుతుంద’ని రాష్ట్ర బలిజనాడు అధ్యక్షుడు బి.శివశంకర్ వ్యాఖ్యానించారు.