ఆంధ్రప్రదేశ్‌

పార్టీ ప్రక్షాళనకు భయమేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 4: పార్టీకి చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు, తమ సొంత పార్టీ నేతలపై సాగిస్తున్న వేధింపులు చివరికి పార్టీ పుట్టిముంచే ప్రమాద దిశగా తీసుకువెళుతోందన్న ఆందోళన తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పార్టీని ప్రక్షాళన చేయాలన్న తలంపు ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలను చూసి బాబు భయపడుతున్నారని, పార్టీ ఎమ్మెల్యేలకు అధినేత అంటే భయం పోవడానికి అదే కారణమని పార్టీ సీనియర్లు విశే్లషిస్తున్నారు. మంగళవారం జరగనున్న టిడిపి వర్క్‌షాప్‌లో దీనికి సంబంధించి పార్టీ అధినేత దిశానిర్దేశం చేయడం ద్వారా తానెవరికీ భయపడటం లేదని, పార్టీ నేతలను వేధించే వారిపై కఠిన చర్యలకు వెనుకాడనన్న సంకేతాలివ్వాల్సి అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. మరో 15 నెలలలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు బాబు ఎంత కష్టపడుతున్నా, స్థానికంగా ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత బాబు కష్టాన్ని నీరుగార్చే ప్రమాదం ఉన్నందున, ముందు దానిపై దృష్టి సారించాలని పార్టీ సీనియర్లు సూచిస్తున్నారు. దాదాపు 60 శాతం మంది ఎమ్మెల్యేలపై విపరీతమైన ఆరోపణలున్నాయని, వీరిలో 30 శాతం మంది సొంత పార్టీ నాయకులనే వేధిస్తున్న పరిస్థితి నెలకొందని స్పష్టం చేస్తున్నారు. వీరిలో ఎక్కువగా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారని, తమ గోడు వెళ్లబోసుకునేందుకు చంద్రబాబు, లోకేష్ వద్దకు వెళితే వినే సమయం ఎవరికీ ఉండటం లేదంటున్నారు. ఇలాంటి సమస్యలు పరిష్కరించే పరిస్థితి లేకపోతే, గత ఎన్నికల్లో సొంత డబ్బు ఖర్చు పెట్టి అభ్యర్థిని గెలిపించిన వాళ్లే రేపు అదే డబ్బుతో ఓడించడం సహజం. ఈ లాజిక్‌ను మా నాయకత్వం ఎందుకు అర్థం చేసుకోలేకపోతోందో తెలియడం లేద’ని రాష్ట్ర పార్టీ నేత ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లాలో ఒక సీనియర్ మంత్రి అల్లుడు ఫ్యాక్టరీ పెట్టుకుంటే, దాన్ని మరో మంత్రి కుమారుడు అడ్డుకుని, సెటిల్‌మెంట్ చేసుకుంటే తప్ప ప్రారంభించలేని దుస్థితిలో ఉంటే, ఇక ద్వితీయ శ్రేణి నేతల సంగతి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవాలంటున్నారు. ప్రకాశం జిల్లాలో కొత్తగా ఎన్నికైన ఓ ఎమ్మెల్యే తీరుపై మండల, గ్రామ స్థాయి నేతలు విరుచుకుపడుతున్నారు. సదరు ఎమ్మెల్యేకి ఉన్న గ్రావెల్ క్వారీ తప్ప, పార్టీకి చెందిన వారి క్వారీలన్నీ గత మూడున్నరేళ్లుగా మూతపడి ఉన్నాయని, జిల్లా మైనింగ్ అధికారులు కూడా ఎమ్మెల్యే అనుమతి ఇవ్వమని చెబితే తప్ప ఇవ్వలేమని తమ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు నియోజకవర్గ నేతలు రాష్ట్ర కార్యాలయానికి రాగా, ఆ ఎమ్మెల్యేకి ఎవరు చెప్పినా వినరని నిస్సహాయత వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తీసుకువచ్చిన ఒక మాజీ సర్పంచిని, ఇదే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత, కేబుల్ వ్యవహారంలో వేధింపులకు గురిచేస్తూ ప్రత్యర్థిని ప్రోత్సహించిన వైనాన్ని మంత్రి, పార్లమెంటు ఇన్చార్జి పరిటాల సునీతకు తాజాగా ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. అనేక నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలైనా కప్పం కడితే తప్ప పనులయ్యే పరిస్థితి లేదని, వచ్చే సారి గెలుస్తామో లేదో, టికెట్ ఇస్తారో లేదోనన్న ముందుచూపుతో దోచుకుంటున్నారన్న ఆరోపణలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. ‘ఇప్పుడు ఇదే సిట్టింగు ఎమ్మెల్యేలతోనే ఎన్నికలకు వెళితే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 10 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. రేపు మా పార్టీలో ఈ ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఉన్న నాయకులే వాళ్లను ఓడించడం ఖాయమ’ని గుంటూరు జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత విశే్లషించారు. ఎమ్మెల్యేలపై తాము ఫిర్యాదు చేసేందుకు వెళుతుంటే బాబు, లోకేష్ సమయం ఇవ్వడం లేదని, జిల్లా ఇన్చార్జిలు ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు చేస్తుంటే వినేందుకే భయపడుతున్నారని, పార్టీ కార్యాలయ నేతలేమో చేతులెత్తేస్తుంటే ఇక తాము మీడియాకే చెప్పుకోవలసి వస్తోందని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా మంత్రులు జిల్లాలకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇస్తున్నారే తప్ప, గెలుపులో కీలకపాత్ర పోషించే మండల నాయకులను దగ్గరకు రానీయడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. చాలామంది ఎమ్మెల్యేలు, మరికొందరు మంత్రులు బాబు తమనేమీ చేయలేరని, తమను మార్చే ధైర్యం చేయరన్న ధీమాతో ఉన్నారంటే నాయకత్వం బలహీనంగా ఉందన్న సంకేతాలు వెళుతున్నాయంటున్నారు. ఈ పరిస్థితిని మారిస్తే తప్ప పార్టీకి భవిష్యత్తు లేదని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు.