ఆంధ్రప్రదేశ్‌

ఇక రేయింబవళ్లూ పోలవరం పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 4: కేంద్ర మంత్రివర్గంలో జరిగిన మార్పులు రాష్ట్ర ప్రయోజనాలకు సానుకూలంగా ఉన్నాయన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యక్తం చేశారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, నదుల అనుసంధానం, అంతర్గత జల రవాణా మార్గాల ఏర్పాటు వంటి కీలక అంశాలకు ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలు ఉంటే త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర జలవనరులు, నదుల అభివృద్ధి, నౌకాయానం శాఖలను, రహదారులు, రవాణాశాఖకు అనుసంధానం చేసి నితిన్ గడ్కరీకి అప్పగించడం అనుకూలాంశమని అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై ఆయనతో ఆదివారం మాట్లాడానన్నారు. సోమవారం రాత్రి పోలవరం, ప్రాధాన్య ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పోలవరం పనుల పరిశీలన కోసం అవసరమైతే కేంద్రమంత్రిని రాష్ట్రానికి ఆహ్వానిద్దామన్నారు. ఇప్పటివరకు 27 శాతం పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సోమవారం రాత్రి నుంచి రాత్రింబవళ్లూ మట్టి తవ్వకం చేస్తున్నామని, అలా చేయడం ద్వారా 18వేల క్యూబిక్ మీటర్ల మేర పని పూర్తిచేయగలమని తెలిపారు. స్పిల్ ఛానల్ కాంక్రీట్ పనులు ఈ నెలాఖరులోగా పూర్తిచేస్తామని వెల్లడించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం మూడవ పంపు బిగింపు పనులు పూర్తిచేశామని, 4వ పంపును సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నిర్ణీత సమయంలోగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పనులు పూర్తికాకపోవడానికి మోటార్లు అందించాల్సిన బిహెచ్‌ఈఎల్ సంస్థ నిర్లక్ష్యవైఖరే కారణమని చెప్పారు. రేడియల్ గేట్లు, ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం వంటి అన్ని పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాల్సి ఉందని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఈనెల 7,8,9 తేదీల్లో ఎగువ కృష్ణా పరివాహక ప్రాంతంలో వర్షాలు విస్తృతంగా కురియవచ్చని షార్ అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. రాయలసీమ జిల్లాల్లో వచ్చేవారం 30 నుంచి 40 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదు కావచ్చునని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న జలవనరులను వాస్తవ సమయంలో వివరించేందుకు వెబ్ పోర్టల్‌ను సిద్ధం చేశామని అధికారులు చెప్పారు. జియో పోర్టల్ ఇంటరాక్టివ్ మ్యాప్‌ను అందిస్తుందని, సూక్ష్మ మధ్యతరహా సాగునీటి వనరులు సహా రాష్ట్రంలో ఉన్న అన్ని సాగునీటి వనరుల సమగ్ర వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 923.81 టిఎంసిల మేర జలవనరుల లభ్యత ఉన్నట్టు చెప్పారు. ఈనెల 6,7,8 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ‘జలసిరికి హారతి’ కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక పండుగ వాతావరణంలో ప్రజల మధ్య ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.