ఆంధ్రప్రదేశ్‌

అమరావతికి 13 వైద్య కళాశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 5: రాజధాని అమరావతిలో సమీప భవిష్యత్తులో 13 వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయవాడ ఎ ప్లస్ కనె్వన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని 31 మంది ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలను సత్కరించారు. రాష్ట్రాన్ని నాలెడ్జి సొసైటీగా, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేనన్ని యూనివర్సిటీలు అమరావతికి వచ్చే అవకాశాలున్నాయని, ఇప్పటికే శ్రీరామస్వామి మెమోరియల్ (ఎస్‌ఆర్‌ఎం) ప్రారంభమైందని, వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) తరగతులు ప్రారంభించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. అమృత్ వచ్చిందని, ఇండో యుకె ఆధారిత కింగ్స్ కళాశాల వైద్యశాల అమరావతికి వచ్చిందని చెప్పారు. దుబాయ్‌కు చెందిన బిఆర్ షెట్టి ఆధ్వర్యంలో వేయి పడకలతో కూడిన వైద్యశాల రానున్నదని వివరించారు. దేశంలో మరే రాష్ట్ర రాజధానిలో కూడా ఒకేచోట ఇన్ని మెడికల్ కాలేజీలు లేవన్నారు. భారతీయులే గూగుల్, మైక్రోసాఫ్ట్ సిఈఓలు అయ్యారని చెప్పారు. ప్రపంచాన్ని శాసించే శక్తి భారత్‌కు ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో మహిళల పట్ల వివక్ష ఉండేదని, వారికి ఉద్యోగాల్లో, కాలేజీ సీట్లలో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చింది తానేనని చంద్రబాబు గుర్తుచేశారు. ఆనాడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తానిచ్చిన జీవోతోనే అనేకమంది ఉపాధ్యాయులయ్యారని, అనేక రంగాల్లో ఉద్యోగాలు పొందారని ముఖ్యమంత్రి తెలిపారు. బదిలీల్లో కౌనె్సలింగ్ విధానం తీసుకొచ్చి ఉపాధ్యాయుల ఆత్మగౌరవం కాపాడిన ఘనత తమకే దక్కుతుందన్నారు. పిల్లల్లో పట్టుదల, సృజనాత్మకత, ఆసక్తి ఉన్నాయని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. పివి సింధు ఒలింపిక్స్ పతకం సాధించిందని, ప్రోత్సాహం అందించడం వల్లే సింధు అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఎదిగి చరిత్ర సృష్టించిందన్నారు. రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించామని, వాటిని సజావుగా నిర్వహించడానికి కేంద్రాన్ని మరిన్ని నిధులు అడిగిన విషయాన్ని గుర్తుచేశారు. విద్య అంటే కేవలం తరగతి గదికే పరిమితం కారాదని, సామాజిక స్పృహ కలిగిన విద్యార్థులుగా తీర్చిదిద్దాల్సి ఉందన్నారు. పాఠశాలల్లో వౌలిక సదుపాయాల కోసం రూ.5వేల కోట్లను వార్షిక చెల్లింపుల ప్రాతిపదికన తెచ్చామన్నారు. ఎవరైతే రుణమిచ్చారో వారికి పదేళ్లలోగా తిరిగి రుణం చెల్లిస్తానని ఒప్పించినట్లు గుర్తుచేశారు. ప్రతి పాఠశాలలో తరగతి గదిని వాస్తవిక తరగతి గదిగా (వర్చువల్ క్లాసు రూమ్) మారుస్తామని, ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ విజ్ఞానాన్ని తీసుకొస్తామని, దృశ్యశ్రవణ పద్ధతిలో విద్యా విషయక సమాచారం ఒక అర్ధగంట ప్రదర్శిస్తామన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల సమన్వయంతో చక్కగా నేర్చుకునే వ్యవస్థను ఏర్పరుస్తామని చంద్రబాబు తెలిపారు. ఎంత సమాచార సాంకేతిక విప్లవం వచ్చినా, ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడేనని స్పష్టం చేశారు. విశాఖ నగరం మధురవాడలో ఉత్తమ పురస్కారం పొందిన చంద్రంపాడు పాఠశాల విద్యార్థుల సంఖ్య 3,300 ఉందని గుర్తుచేశారు. మదనపల్లి జడ్‌పిఎస్‌ఎస్‌లో 2,400 మంది ఉన్నారని, మరో పాఠశాలలో 3,300 మంది ఉన్నారన్నారు. తాను అధికారులకు ఇచ్చిన విజన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ వైజ్ఞానిక రాష్ట్రంగా రూపుదిద్దుకోవాలని, విద్యా కేంద్రంగా మారాలని పిలుపునిచ్చారు. ప్రపంచ దేశాల విద్యార్థులంతా మన రాష్ట్రానికి వచ్చి చదువుకునే రోజు రావాలని, అందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులంతా సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తితో రాష్ట్రాన్ని వైజ్ఞానిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కోరుతూ అధ్యాపకులతో ప్రతిజ్ఞ చేయించారు. విశాఖ నగర పరిధిలోని మధురవాడ దగ్గర చంద్రంపాడు పాఠశాల ఉపాధ్యాయిని లక్ష్మిని ముఖ్యమంత్రి ప్రశంసించారు. తనకు సత్కారం లభంచిందని సంతృప్తిపడకుండా ఆమె తమ పాఠశాలకు భవనాలు నిర్మించి ఇవ్వాలని కోరారని అభినందించారు. కోరినన్ని తరగతి గదులు నిర్మించి ఇస్తామని, అధికారులతో సమన్వయం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఆమెను కోరారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలను సత్కరించారు.

చిత్రం..ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లికి నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి