ఆంధ్రప్రదేశ్‌

అదే జోరు కొనసాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 7: నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో ఘన విజయం సాధించి జోరుమీదున్న తెలుగుదేశం పార్టీ ఇక కాపు సామాజికవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. తూర్పు గోదావరి జిల్లాలో కాపులందరి మద్దతు తెలుగుదేశానికే ఉందని, ఆ దిశగా విస్తృత ప్రచారం చేయాలని ఈ ప్రాంత నేతలకు పార్టీ అధిష్ఠానం నుండి స్పష్టమైన ఆదేశాలందాయి. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సహా ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ లక్ష్యంగా ఈ ప్రచారాన్ని అధికార పార్టీ నేతలు ప్రారంభించారు. ముఖ్యంగా ముద్రగడ వెంట ఉన్న కాపులను వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు చెందిన కాపులుగా భావించాలని, ఈ ప్రచారాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని టిడిపి నేతలు యోచిస్తున్నారు. ముద్రగడ పాదయాత్రను విరమించుకోవడం కూడా తమ ఘనతగానే చెప్పుకుంటున్న టిడిపి నేతలు ఇక కాపు సామాజికవర్గంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించినట్టుగా కనిపిస్తోంది. కాపులు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నట్టు జరిగిన ప్రచారం తాజా ఎన్నికల ఫలితాలతో తేటతెల్లమయ్యిందని, టిడిపికే అనుకూలంగా ఉన్నట్టు స్పష్టమైందని జిల్లాకు చెందిన టిడిపి కాపు నేతలు ప్రచారం చేస్తున్నారు. ముద్రగడతో కాపులెవరూ లేరని జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అవకాశం దొరికిన ప్రతిసారీ చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కాపులకు అనుకూల నిర్ణయం తీసుకోవడం ద్వారా ముద్రగడకు చెక్ పెట్టేయోచనలోనూ టిడిపి ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో కాపులను బిసిల్లో చేర్చేందుకు నిర్ణయిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్టు ఇక్కడి నేతలు చెబుతున్నారు. రాజకీయ రిజర్వేషన్లు మినహా కాపులకు విద్య, ఉద్యోగ, పదోన్నతుల్లో రిజర్వేషన్లకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని పేర్కొంటున్నారు. అయితే కాపులకు ప్రభుత్వం చేసిన మేలుకు సంబంధించిన క్రెడిట్ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభానికి దక్కకుండా, ఆ ఘనత అంతా ప్రభుత్వానికే లభించే వ్యూహంతో సాగుతున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకే రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాలు సాధించుకున్నట్టు బయటి ప్రపంచానికి సంకేతాలు వెళ్ళేలా చూడాలని ముఖ్యమంత్రి పార్టీ నేతలకు, మంత్రులకు సూచించినట్టు సమాచారం. ఇటీవల కాకినాడ, నంద్యాల ఎన్నికల్లో తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించినందున కాపులకు అనుకూలంగా ఏ నిర్ణయం తీసుకున్నా అది టిడిపికే లాభిస్తుందని పార్టీ నేతలు ఆశిస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని కాపులు ముద్రగడ వెంటే ఉన్నారంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు ఇంతకాలం వ్యాఖ్యానిస్తూవచ్చారు. తాజా ఎన్నికల ఫలితాలతో వారికి భ్రమలు తొలగిపోయాయని టిడిపి నేతలు పేర్కొంటున్నారు. ముద్రగడ వెంట కాపులెవరూ లేరన్న విషయం తాజా ఎన్నికలతో రుజువైందని, ఆయన వెంట కేవలం వైసిపి కాపులే ఉన్నారని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వ్యాఖ్యానిస్తున్నారు. మంజునాథ్ కమిషన్ నివేదిక వచ్చిన అనంతరం రిజర్వేషన్లు కల్పించడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని కాపులకు చినరాజప్ప హామీ ఇస్తున్నారు.