ఆంధ్రప్రదేశ్‌

‘ప్రవాస పోరాటం’ ఇంకెన్నాళ్లు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 8: నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి కోసం పోరాడాల్సిన రాజకీయ పార్టీలు ‘ప్రవాస ప్రతిపక్షం’ ముద్రతో స్వపక్షంలోనే విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ప్రజాసమస్యల పరిష్కారం కోసం రెండు ప్రతిపక్షపార్టీలు చేస్తున్న ‘ప్రవాస పోరాటాలు’ ఫలితాలివ్వకపోవడంపై సొంత పార్టీల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. రాష్ట్రం విడిపోయి నాలుగేళ్లవుతున్నా, ఇప్పటివరకూ రాష్ట్ర రాజధాని విజయవాడ కాకుండా హైదరాబాద్ నగరానికే రాజకీయ కార్యకలాపాలు పరిమితవడాన్ని వైసీపీ, జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, నెల్లూరు జిల్లాలకు చెందిన రెండు పార్టీల నాయకులకు హైదరాబాద్ వెళ్లిరావటం భారంగా పరిణమించింది. జనసేన ప్రస్తుతానికి లెటర్‌హెడ్ పార్టీగా పత్రికా ప్రకటనలు, అప్పుడప్పుడు పవన్ పర్యటనలు, ఎక్కువగా ట్వీట్లతోనే కాలక్షేపం చేస్తున్నందున జనసేన శ్రేణులకు అంతపెద్ద సమస్య కనిపించడం లేదు. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ నేతలకే ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోజువారీ జగన్ నివాసమైన హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోనే విలేఖరుల సమావేశాలు, పార్టీ నాయకుల సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం విడిపోయి, సొంత రాష్ట్రం, రాజధాని ఏర్పడినా తమకు హైదరాబాద్‌కు వెళ్లిరావటం తప్పడం లేదని వైసీపీ సీనియర్లు వాపోతున్నారు. లోటస్‌పాండ్‌లో జగన్ నివాసానికి పార్టీ ఆఫీసు వాతావరణం అబ్బలేదని మరికొందరు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.‘కేవలం లోటస్‌పాండ్‌లో మీడియా సమావేశాలకే మేమంతా ఏపి నుంచి రావలసి వస్తోంది. పోనీ తమ వార్తలేమైనా మిగిలిన మీడియాలో వస్తున్నాయా అంటే అదీ లేదు. ఒక్క తమ పార్టీ మీడియాలో వచ్చేందుకే తాము హైదరాబాద్ రావలసిన పనిలేదు. అదేదో మా నియోజకవర్గాల్లోనే ఏర్పాటుచేసుకుంటాము కదా’ అని మరో సీనియర్ నేత వ్యాఖ్యానించారు. నెల్లూరు, కడప, ఉత్తరాంధ్ర నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగించడం ఎంత కష్టమో జగన్ ఆలోచించడం లేదని, అదే విజయవాడలోనే ఆఫీసు ఏర్పాటుచేసి, తమ నాయకుడు ఇక్కడే అందుబాటులో ఉంటే ఈ సమస్యలు వచ్చేవి కావని విజయనగరం జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తాము విజయవాడలో ఇంతవరకూ పార్టీ ఆఫీసు ఏర్పాటు చేసుకోకపోవడం అవమానకరమేనని అంగీకరిస్తున్నారు. ఈరకంగా ప్రవాస పోరాటం చేస్తూ ప్రవాస ప్రతిపక్షంగా ముద్ర వేయించుకోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ విజయవాడకు మకాం మారుస్తే, పార్టీ శ్రేణులకు నైతిక స్థైర్యంతోపాటు టిడిపి నాయకత్వంలో కూడా ఆందోళన మొదలవుతుందన్న విషయాన్ని జగన్ ఎందుకు అర్థం చేసుకోవడంలేదో తెలియడం లేదంటున్నారు. గతంలో గుంటూరులో పార్టీ ఆఫీసు చూడాలని జిల్లా నేతలకు చెప్పిన జగన్.. దానికి కావలసిన డబ్బుల గురించి మాత్రం ప్రస్తావించలేదు. ఆ భారం తమ నెత్తిన ఎక్కడ పడుతుందోనని జిల్లా నేతలు కూడా ఆ ప్రస్తావన తీసుకురావడం మానేశారు. విజయవాడలోని ఆర్ అండ్ బి గెస్ట్‌హౌస్‌ను తమకు కేటాయించాలని లేఖ రాసిన నాయకత్వం, మళ్లీ దాని గురించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం మర్చిపోయిందని నేతలు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ఉంటూ ఆంధ్ర రాష్ట్ర సమస్యలపై పోరాడటం తమకే చిన్నతనంగా ఉందంటున్నారు. బాబు హైదరాబాద్‌లో ఉండి పాలించినప్పుడు, ప్రవాస ప్రభుత్వం అని నిందించిన తామే ఇప్పుడు ప్రవాస ప్రతిపక్షంగా మారాల్సివచ్చిందని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తమ కంటే ఎంతో మేలని వ్యాఖ్యానిస్తున్నారు. విభజన తర్వాత కాంగ్రెస్ వెంటనే తన ఆఫీసును విజయవాడకు మార్చుకుందని గుర్తు చేస్తున్నారు. విజయవాడకు వచ్చేందుకు తమ పార్టీ భయపడుతోందన్న ప్రచారం జగన్ ఇంకా గుర్తించకపోవడం విచారకమంటున్నారు. ఇక త్వరలో ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌గా వస్తానంటున్న పవన్ కూడా ప్రవాస పోరాటమే చేస్తున్నారు. తాను గందరగోళంలో ఉన్నానని ఆయన ప్రకటనలు చెప్పకనే చెబుతున్నాయి. ‘హైదరాబాద్‌లో కూర్చుని ట్విట్టర్లు, ప్రెస్‌నోట్ల ద్వారా రాష్ట్ర సమస్యలపై పోరాడితే ఎవరు విశ్వసిస్తారు.. గుర్తువచ్చినప్పుడు వచ్చి ఏదో మాట్లాడిపోతే నమ్మేదెవరు.. జనం దగ్గరకు లీడరు వెళ్లాలే తప్ప లీడర్ దగ్గరకు జనం ఎన్నాళ్లు వస్తారు.. ఇక్కడి ప్రజలతో ఉంటూ, వాళ్ల కష్టాల్లో పాలుపంచుకుంటేనే కదా గుర్తింపు.. రాష్ట్రంలో రెండు పార్టీలూ ప్రవాస ప్రతిపక్షాలుగా మారడం తెలుగుదేశం వాళ్లకే ఉపయోగం. మొన్నామధ్య పవన్ బెజవాడ వచ్చినప్పుడు ఆయన చుట్టూ బౌన్సర్లే ఎక్కువగా ఉన్నారు. మీతో సమావేశం ఏర్పాటుచేసినప్పుడు వాళ్లంతా అడ్డుగా ఉంటే ఎన్ని సమస్యలు వచ్చాయో చూశారు కదా.. అసలు పబ్లిక్‌లో ఉండే లీడరుకు బౌన్సర్లు ఎందుకు.. ఇలాగైతే ఆయన జనంలోకి ఎలా స్వేచ్ఛగా వెళతార’ని జనసేన నేత ఒకరు వాస్తవ పరిస్థితిని విశే్లషించారు.