ఆంధ్రప్రదేశ్‌

సొంత గూటికి మాజీ సీఎం కిరణ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 9: మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరిగి సొంతగూటికి చేరనున్నట్లు సమాచారం. విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్రం చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన సొంత పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన సంగతి తెలిసిందే. మూడేళ్ల తరువాత ఆయన తిరిగి సొంత గూటికి చేరనున్నారు. రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని రద్దు చేసి మరో పార్టీలో చేరాలని ఆలోచిస్తున్న బైరెడ్డి రాజశేఖరరెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్‌రెడ్డితో చర్చల ప్రక్రియ ముగిసిందని త్వరలో ఆయన పార్టీలో చేరనున్నట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. బైరెడ్డికి సంబంధించి ఇంకా చర్చల ప్రక్రియ ప్రారంభం కాలేదని, అయితే ఆయన అంగీకరిస్తే పార్టీలో చేర్చుకుంటామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో ఇద్దరికి పార్టీ సభ్యత్వం అందిస్తామంటున్నారు. రాహుల్ రాష్ట్రానికి వచ్చే తేదీలను బట్టి కిరణ్‌కుమార్‌రెడ్డి చేరిక తేదీ, వేదిక నిర్ణయం కానున్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాహుల్ సభను తిరుపతి లేదా విజయవాడలో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా 2010 నుంచి 2013 వరకూ పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డి విభజనకు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించిన సంగతి తెలిసిందే. అధిష్ఠానం ఆదేశించినా ఆయన స్పందించకుండా విభజనకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఎన్నికల సమయంలో జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి అధ్యక్షుడి హోదాలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులను పోటీలో పెట్టారు. అయితే ఎక్కడా ఆయన పార్టీకి ఆదరణ లభించలేదు. ఆ తరువాత వౌనం వహించిన కిరణ్ తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సొంతగూటికి చేరి పార్టీని మరోమారు బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కిరణ్ ఈనెల 12వ తేదీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. అయితే రాహుల్ పర్యటన తేదీలు ఖరారు కానందున ఆరోజు చేరే అవకాశం లేదని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఈ నెలాఖరులోపు కిరణ్ పార్టీలో చేరుతారని అదే రోజు ఆయనను ఏఐసిసి కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అవుతాయని కాంగ్రెస్ నేతలు వెల్లడిస్తున్నారు.