ఆంధ్రప్రదేశ్‌

ఇసుక తవ్వకాలు నిలిపివేస్తేనే నదుల పరిరక్షణ సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 14: విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక తవ్వకాలను తక్షణం నిలిపివేస్తేనే నదుల పరిరక్షణ సాధ్యమని వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ అన్నారు. నదుల పరిరక్షణకోసం విజయవాడ నగరంలో బుధవారం జరిగిన సభలో పాల్గొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిజ్ఞను అందరూ గౌరవించాల్సిందేనని, అయితే ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చర్యలు చేపట్టడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం చంద్రబాబు ఇప్పటినుంచయినా చేసిన ప్రతిజ్ఞకు చంద్రబాబునాయుడు కట్టుబడి ఉండాలని విజయవాడలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాజేంద్రసింగ్ అన్నారు. ఇటీవల తాను 15 రోజులపాటు కృష్ణానదీ తీరం వెంబడి పర్యటించగా ప్రతి చోట కూడా నదీ తీరంలోనే కాదు, నదీ గర్భం నుంచి చట్ట విరుద్ధంగా యంత్రాలతో విశృంఖలంగా ఇసుక తవ్వకాలు జరుగుతుండటాన్ని గమనించామన్నారు. చంద్రబాబు నివసిస్తున్న ప్రాంతంలోనే కృష్ణానదికి ఎంతటి విఘాతం కలుగుతున్నదో ఆయనకు అవగాహన ఉందనేది తన నమ్మకమన్నారు. ఇప్పటికైనా వరద ముంపు ప్రాంతాల పరిరక్షణ, నదీతీరంలో పచ్చదనం పెంచడం తన బాధ్యతగా చంద్రబాబు గుర్తించాలన్నారు. పర్యావరణ, జీవావరణ కొనసాగింపునకు ఇసుక అత్యావశ్యకమని, నదికి ఉండే విలువైన ఆస్తి ఇసుక అని, వర్షం, వరదల నుంచి నీటిని గ్రహించి శుభ్రపరిచి దానిని భద్రంగా నిల్వ ఉంచుతుందని, ఉపరితల నీటి పరిమాణం తగ్గితే నది పొర్లు ప్రాంతం నుంచి సేకరించి అందిస్తుందన్నారు. అందుకే ఇసుక తవ్వకమంటే నది ఆస్తులను కొల్లగొట్టి దాన్ని ధ్వంసం చేయడమే కాగలదన్నారు. నది తన పరిసరాల్లో ఉన్న జీవన చక్రంలో భాగంగా పారడం దాని సహజగుణమన్నారు. ఇక వరద ముంపు ప్రాంతాలను గ్రీన్‌జోన్‌గా పరిగణించి అందులో ఎలాంటి నిర్మాణాలను అనుమతించరాదన్నారు.
నది ఆరోగ్యాన్ని బాగు చేయాలంటే నగరాలు, పల్లెల నుంచి నదీ గర్భంలోకి వచ్చి చేరే పారిశ్రామిక గృహ వినియోగ కాలుష్యపూరిత వ్యర్థాలను పూర్తిగా నివారించాలన్నారు. వరద ముంపు నదీ పరీవాహక ప్రాంతాల్లో రసాయన ఎరువుల వినియోగాన్ని నిషేధించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. నదీ పరీవాహక ప్రాంతాల్లోని అటవీ ప్రాంతాలను కాపాడుతూ ఆయా ప్రదేశాల నుంచి వర్షపు నీరు నదిలోకి చేరేందుకు అవకాశం కల్పించాలని కోరారు. నదుల పరిరక్షణలో పాలకులు, ప్రజలు, సాధువులు, మత పెద్దలు భాగస్వాములు కావాలని, ప్రభుత్వాలు తప్పు చేసేటప్పుడు మిగిలిన వారంతా కల్సి సరిదిద్ది సరైన మార్గ నిర్దేశనం చేయాల్సి ఉందన్నారు.