ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వానికి చేరని లెవీ బియ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి (జలదంకి), సెప్టెంబర్ 16: నెల్లూరు జిల్లాలో కస్టమ్స్ మిల్ల్‌డ్‌రైస్(సిఎంఆర్) బియ్యం ప్రభుత్వానికి అప్పగించే విషయంలో రైస్‌మిల్లర్ల వ్యవహారం అనుమానాస్పదంగా ఉంది. కావలి పరిధిలో ఏడు రైస్ మిల్లుల నుంచి ప్రభుత్వానికి సుమారు 5,250 మెట్రిక్ టన్నుల బియ్యం బకాయి ఉన్నప్పటికీ సంబంధిత యంత్రాంగం వారి నుంచి బియ్యాన్ని రాబట్టడంలో విఫలవౌతోంది. ప్రభుత్వానికి బియ్యం బకాయిలు ఉన్న రైస్‌మిల్లర్లకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తులు గుర్తించి వాటిని ఆర్‌ఆర్ చట్టం కింద సీజ్ చేయాల్సిందిగా జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. గత సంవత్సరం మార్చి నుంచి సెప్టెంబర్ వరకు అత్యధిక స్థాయిలో జిల్లాలో ధాన్యం దిగుబడులు రావడంతో ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్‌మిల్లర్లకు అప్పగించింది. అయితే ఈ ధాన్యానికి సంబంధించి బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించడంలో రైస్‌మిల్లర్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అప్పట్లోనే ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో సొమ్ము చేసుకుని ఇతర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టుకున్నట్లు రైస్ మిల్లర్లపై ఆరోపణలున్నాయి. కావలి పరిధిలోని రైస్‌మిల్లర్ల నుంచి 5250 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి రావల్సి ఉండగా అందులో సగభాగం కేవలం ఒకేఒక్క రైస్ మిల్లు నుంచి రావల్సి ఉంది. అయితే సదరు రైస్‌మిల్లు యజమాని తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తుండటంతో యజమానిని ఒత్తిడి చేసే విషయంలో అధికారులు వెనుకంజ వేస్తున్నారని, ఈ వ్యవహారంలో యజమానికి ఓ ముఖ్యనేత ఆశీస్సులు ఉన్నట్లు అందుకే అధికారులు ఏమీచేయలేకున్నారని ఆరోపణలున్నాయి. మరోవైపు సిఎంఆర్ బియ్యం బకాయి ఉండగానే ఇతరత్ర వ్యాపార లావాదేవీలు నడుపుతున్న కారణంగా ఇటీవల పట్టణంలోని ఒక రైస్‌మిల్లుపై అధికారులు దాడులు చేసి కేసు నమోదు చేయడంతో స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కోట్ల రూపాయల బకాయి ఉన్నవారిని వదిలేసి స్వల్ప బకాయి ఉన్న రైస్‌మిల్లుపై కేసు నమోదు చేయడం వెనుక కచ్చితంగా రాజకీయం ఉందని అన్నారు. రైస్ మిల్లర్లు ధాన్యాన్ని పక్కదారి పట్టించినప్పుడే కఠినంగా వ్యవహరించకుండా ఇప్పుడు వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటనలు చేయడం తప్ప అధికారులు ఏమీ చేయలేని స్థితిలో సతమతవౌతున్నట్లు కనిపిస్తోంది. బకాయిలు ఉన్న మేరకు జాయింట్ కలెక్టర్ సూచించినట్లు కనీసం రైస్‌మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీలను సైతం అధికారులు రాబట్టలేకపోయారు. మిల్లర్ల నుంచి బియ్యాన్ని రాబట్టడంలో అధికారులు ఏమీచేయలేక నిస్సహాయంగా ఉండిపోవడాన్ని ఆసరా చేసుకున్న మిల్లర్లు మళ్లీ ధాన్యం దిగుబడులు వచ్చినప్పుడు బకాయిపడ్డ బియ్యాన్ని సరఫరా చేద్దామనే ఉద్దేశ్యంతో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వాటిని బియ్యంగా మార్చేందుకు మిల్లర్లకు అందజేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే సీజన్‌లో మరికొంతమంది మిల్లర్లు కూడా ఇలాగే వ్యవహరించే ప్రమాదం ఉంది.