ఆంధ్రప్రదేశ్‌

ఏపి ఫిరాయింపులకు ‘తమిళ’ సంకటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 18: అన్నాడిఎంకెకు చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై వేటు వేస్తూ తమిళనాడు స్పీకర్ తీసుకున్న తాజా నిర్ణయ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపైనా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ ధిక్కరణ అంశంపై అనర్హత చట్టం కిందే తమిళనాడు స్పీకర్ నిర్ణయం తీసుకున్నందున, అదే విధానాన్ని తమ పార్టీకి చెందిన 20 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలోనూ అమలుచేయాలన్న డిమాండును ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ మళ్లీ తెరపైకి తీసుకురావాలని నిర్ణయించింది. తమ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి ఫిరాయించిన వైనంపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తున్న వైసీపీ నాయకత్వానికి, తమిళనాడు స్పీకర్ తీసుకున్న నిర్ణయం న్యాయపరంగా బోలెడంత ఉత్సాహం ఇచ్చినట్టయింది. దేశవ్యాప్తంగా శాసనసభలకు సంబంధించి స్పీకర్లు తీసుకునే నిర్ణయాలు చట్టం ప్రకారమే కొనసాగుతున్నందున, ఏపిలో జరిగిన ఫిరాయింపులపైనా శాసనసభ స్పీకర్ కోడెల .. తమిళనాడు శాసనసభాపతి ధన్‌పాల్‌ను ఆదర్శంగా తీసుకోవాలన్న డిమాండుకు వైసీపీ పదునుపెట్టనుంది. తమిళనాడులో సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు, మరొక వర్గానికి చెందిన సీఎంకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పి ధిక్కరించినందుకే, పార్టీ ధిక్కరణ కింద స్పీకర్ ఆ 18 మంది ఎమ్మెల్యేలపై వేటు వేసిన వైనంపై వైసీపీ కసరత్తు ప్రారంభించింది. అక్కడి ఎమ్మెల్యేలు కేవలం సీఎంకు ఓటు వేయమని చెప్పినందుకే ధిక్కరణ కింద అనర్హత వేటు వేస్తే, ఇక్కడ 20 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడో టిడిపిలో చేరి, బహిరంగంగా కండువాలు కప్పుకోవడంతోపాటు, క్యాబినెట్‌లో చేరినా అనర్హత వేటు వేయని వైనాన్ని.. తమిళ స్పీకర్ నిర్ణయాన్ని ఆధారంగా చేసుకుని మరొక సారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేయాలని వైసీపీ నిర్ణయించింది. కాగా, అనర్హతపై తక్షణం స్పందించి తమిళనాడు స్పీకర్ తీసుకున్న నిర్ణయానే్న ఏపిలోనూ అమలుచేసి, పార్టీ మారిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వైసీపీ మరోసారి తాజాగా న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ‘తమిళనాడు స్పీకర్ తక్షణమే స్పందించి పార్టీ ధిక్కరణ కింద 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే, ఇక్కడ మాత్రం స్పీకర్ నెలల తరబడి ఆ కేసును నాన్చుతున్నారు. అనర్హత వేటు వేయాలంటే విప్ జారీ చేయాల్సిన పనిలేదు. ఒక పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధి మరో పార్టీ జెండా కప్పుకున్నా అనర్హుడేనన్న సుప్రీంకోర్టు తీర్పును ఏపి స్పీకర్ పాటించకపోవడం విచారకరం. తమిళనాడు స్పీకర్ నిర్ణయాన్ని చూసైనా ఏపి స్పీకర్ స్పందిస్తే ప్రజాస్వామ్యం ఇంకా బతికుందని ప్రజలు విశ్వసిస్తారు. తమిళనాడు స్పీకర్ నిర్ణయాన్ని తమ వాదనకు మద్దతుగా ఎవరైనా కోర్టుకు వెళ్లి, ఏపిలోనూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు వేయవచ్చు. ఇలాంటి కేసులకు సంబంధించి ఏ కోర్టయినా వివిధ అసెంబ్లీ స్పీకర్లు ఇచ్చిన ఆదేశాలు, గతంలో తామిచ్చిన ఆదేశాలను పరిశీలిస్తుంది. వెంకయ్యనాయుడు ఉప రాష్టప్రతి అయిన తర్వాత బిజెపికి, అంతకుముందు సోమనాధ్‌చటర్జీ లోక్‌సభ స్పీకర్ అయన తర్వాత సీపీఎంకు రాజీనామా చేసిన సంప్రదాయాన్ని ఏపి స్పీకర్ కూడా పాటిస్తే హుందాగా ఉంటుంది. ఎక్కడైనా స్పీకర్ రంగులన్నీ పక్కకుబెట్టి, అందరికీ రక్షకుడిగా ఉండాలే తప్ప, ఎవరికీ గార్డియన్‌గా ఉండకూడదు’ అని ప్రముఖ న్యాయవాది పి.సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
కాగా, తమిళనాడు స్పీకర్ తీసుకున్న నిర్ణయంతో ఏపి స్పీకర్‌కు కనువిప్పు కావాలని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. సొంత పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు సీఎంకు వ్యతిరేకంగా ఓటు వేస్తామంటేనే అక్కడి స్పీకర్ పార్టీ ధిక్కరణ కింద అనర్హత వేటు వేస్తే, మరి ఇక్కడ పార్టీలు మారి మంత్రులు కూడా అయిన ఫిరాయింపుదారులపై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? దీన్ని న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటా’మని స్పష్టం చేశారు.