ఆంధ్రప్రదేశ్‌

ఏఓబిలో ఎనిమిది వేల ఎకరాల్లో సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 18: ఆంధ్ర, ఒడిశా సరిహద్దు (ఏఓబి)లో గంజాయి స్మగ్లింగ్ పెద్ద ఎత్తున సాగుతోంది. ఏఓబి కేంద్రంగా గంజాయి రాకెట్ మాఫియా యథేచ్ఛగా నడిపిస్తోంది. తమిళనాడుకు చెందిన గంజాయి స్మగ్లర్లు ఒడిశాలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని గిరిజనుల సహకారంతో ఇక్కడ గంజాయి పండించి, దేశంలోని వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. రిస్క్ తీసుకుని గంజాయి పండిస్తున్న గిరిజనులకు వేలల్లో డబ్బులు ముట్టచెప్పి, స్మగ్లర్లు కోట్లలో ఆర్జిస్తున్నారు. చివరకు గంజాయి రవాణా చేస్తూ దొరికిపోయి, కేసులో ఇరుక్కుంటున్నది అమాయకులైన గిరిజనులే.
20 సంవత్సరాల కిందట ఏఓబిలో అంతంతమాత్రంగా ఉన్న గంజాయి పంట, గడచిన ఐదు సంవత్సరాలుగా ఊపందుకుంది. అపరాలు తదితర పంటలను కూడా గిరిజనులు పూర్తిగా పక్కన పెట్టి, కేవలం గంజాయి సాగుపైనే దృష్టి పెట్టారంటే వ్యాపారం ఎంత పెద్దఎత్తున సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఏఓబిలో పప్పులూరు, కురమనూరు, కప్పతొట్టి, నాగులూరు తదితర ప్రాంతాల్లో గంజాయి పంటను విస్తృతంగా పండిస్తున్నారు. ఐదు సంవత్సరాల కిందట ఒడిశా ప్రభుత్వం గంజాయి పంటపై ఉక్కుపాదం మోపడంతో గంజాయి రవాణా చాలా వరకూ స్తంభించింది. దీంతో గిరిజనులు ఒడిశా ప్రభుత్వంపై ఎదురు తిరిగారు. గిరిజనులను ప్రభుత్వంపై ఉసిగొలిపింది కూడా గంజాయి స్మగ్లర్లే. గిరిజనుల వత్తిడితో ఒడిశా ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఎప్పుడైతే ఒడిశా ప్రభుత్వం గంజాయి సాగుపై ఆంక్షలు తొలగించిందో, పంట విస్తీర్ణం భారీగా పెరిగిపోయింది. గతంలో రోడ్డుకు సుమారు ఏడు, ఎనిమిది కిలో మీటర్ల దూరంలో ఈ పంటను పండించేవారు. ఇప్పుడు ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో రోడ్డుపక్కనే గంజాయి సాగు చేస్తున్నారు. విశాఖ ఏజెన్సీలోని గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలో గంజాయి సాగు అధికంగా జరుగుతోంది. కాగా ఏఓబిలో గంజాయి సాగు అంతా తమిళ వ్యాపారుల కనుసన్నలలోనే జరుగుతోంది. వీళ్లు ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకుని, ఏఓబిలో సాగును పర్యవేక్షిస్తుంటారు. గంజాయి సాగులో మెళకువలు, పంటకు కావల్సిన పెట్టుబడి వగైరాలన్నీ వీళ్లే చూసుకుంటారు. పండిన పంటను కోసే బాధ్యత కూడా గిరిజనులదే. ఇలా కోసిన పంటను బస్తాలకెక్కించి గిరిజనులతోనే అర్థరాత్రి కాలి నడకన కొన్ని రహస్య ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఈ గంజాయిని అక్కడ అచ్చులుగా తయారు చేస్తారు. ఏఓబిలో గంజాయిని నర్సీపట్నం, రంపచోడవరం, అడ్డతీగల, గోకవరం, విశాఖ, పాడేరు తదితర ప్రాంతాల మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. ఇక్కడ పండిన గంజాయి ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లకు రవాణా అవుతోంది. ట్యాంకర్లలో సగ భాగాన్ని గంజాయితో నింపుతారు. దాన్ని ఇనుప రేకులతో సీల్ చేసి, పైన పెట్రోలు, డీజిల్ నింపి సునాయాసంగా జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారు. అలాగే సాధారణ లారీలో గంజాయి అచ్చులు ఉంచి, దానిపై కూరగాయలు, చేపలు వేసి రవాణా చేస్తున్నారు.
లెక్కలేనంత ఆదాయం
ఏఓబిలో పండే శీలావతి రకం గంజాయికి ఇతర రాష్ట్రాల్లో భారీగా ధర పలుకుతోంది. ఎకరాకు 200 గంజాయి మొక్కలు వేస్తారు. పంట పూర్తిగా చేతికందిన తరువాత అక్కడికక్కడే విక్రయిస్తే, ఎకరా పంటకు 50 వేల రూపాయలు వస్తుంది. ఇదే పంట మైదాన ప్రాంతానికి వెళితే, ఐదు లక్షల రూపాయల వరకూ పలుకుతోంది. ఇది రాష్ట్రాలు దాటితే, ధర రెండు, మూడు రెట్లు అధికంగా పలుకుతుంది. కేవలం ఏఓబిలో ఎనిమిది వేల ఎకరాల్లో పంట సాగవుతోంది. ఇక, ఛత్తీస్‌గడ్ తదితర ప్రాంతాల్లో కూడా పంట విస్తీర్ణాన్ని కలుపుకొంటే, స్మగ్లర్లు లెక్కనేనంత ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.