ఆంధ్రప్రదేశ్‌

వచ్చే మార్చి నాటికి ఒడిఎఫ్ గ్రామాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 20: వచ్చే మార్చి నాటికి గ్రామాలనూ బహిరంగ మలమూత్ర విసర్జన రహితమైనవిగా ప్రకటించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఇందుకు విద్యార్థుల సేవలను వినియోగించుని, మార్కుల్లో వెయిటేజీ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన ‘స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్’పై మాట్లాడారు. ఈసందర్భంలో కేంద్ర పంచాయతీ, నీటి పారుదల శాఖ శాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిఎంతో మాట్లాడారు. పట్టణాలను బహిరంగ మలమూత్ర విసర్జన రహితం (ఒడిఎఫ్)గా చేసినప్పటికీ, ఇంకా గ్రామాల్లో పూర్తిస్థాయిలో జరుగలేదని చంద్రబాబు తెలిపారు. ఇంకా 23 లక్షల మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉందని తెలిపారు. 2018 అక్టోబర్ నాటికి గ్రామాలను ఒడిఎఫ్‌గా ప్రకటించాలని నిర్ణయించామన్నారు. కేంద్ర అధికారి విజ్ఞప్తి మేరకు మరింత ముందుగానే ప్రకటిస్తామని చెప్పారు. 2018 మార్చి నాటికి గ్రామాలను ఒడిఎఫ్‌గా ప్రకటిస్తామని తెలిపారు. అవసరమైన నిధులు సకాలంలో విడుదల చేసేందుకు కేంద్ర కార్యదర్శి హామీ ఇచ్చారు. అనంతరం అధికారులతో సిఎం మాట్లాడుతూ విద్యార్థుల సేవలను ఉపయోగించుకోవాలని, ఒక్కో విద్యార్థికి రెండు, మూడు ఇళ్ళను అప్పగించాలని ఆదేశించారు. వారికి 5 మార్కులు వెయిటేజ్ ఇవ్వాలని తెలిపారు. వచ్చే మార్చి నాటికి ఒడిఎఫ్‌కు సంబంధించి ఆడిట్ కూడా పూర్తి కావాలన్నారు. ఈ అక్టోబర్ 2 నాటికి ఇందుకు సంబంధించి ప్రణాళిక ప్రకటించాలని ఆదేశించారు.
ఎక్కడ విఫలవౌతున్నారు?
అభివృద్ధి, సంక్షేమ పనులకు సంబంధించి పూర్తిగా స్పష్టత ఇచ్చినా అమల్లో ఎందుకు విఫలం అవుతున్నారంటూ కొందరు అధికారుల తీరుపై సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పశుదాణా, తదితర అంశాలపై స్పష్టత ఇచ్చినప్పటికీ, అమలు చేయడంలో విఫలమవుతున్నారన్నారు. సృజనాత్మకతతో ఆలోచించాలన్నారు. ప్రణాళిక లేకుండా పనిచేస్తే ఫలితాలు వస్తాయా? అంటూ ప్రశ్నించారు.
ఆశకుపోతే మొత్తం నష్టపోతాం
రాష్ట్రంలో అక్వా సాగు తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రొయ్యల సాగులో ఎక్కువ మోతాదులో యాంటీబయాటిక్స్‌ను వినియోగించడం వల్ల గత ఏడాది 36 షిప్‌మెంట్లను తిరస్కరించారని, ఈ ఏడాది 13 షిప్‌మెంట్లను ఇప్పటికే తిరస్కరించాలని గుర్తుచేశారు. ఈవిధంగా రొయ్యల ఎగుమతులు తిరస్కరణకు గురైతే ప్రపంచంలోనే రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువ ఆదాయం వస్తుందని ఆశపడితే మొత్తానికే నష్టపోతామన్నారు. యాంటీబయాటిక్స్ వినియోగంపై దృష్టిసారించాలని, దాణా, తదితర అంశాలపై దృష్టి పెట్టి, తిరస్కరణకు మూల కారణాలను గుర్తించాలని ఆదేశించారు. ఈమేరకు ఇద్దరు మంత్రులు సహా ఐదుగురితో ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రొయ్యల ఎగుమతులు తిరస్కరణకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో తిరస్కరణకు గురైన కేసులకు సంబంధించి, కారణాలు తెలుసుకోవాలని, వారిని ముందుగా హెచ్చరించాన్నారు. అయినా మార్పు రాకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సముద్రంలోని సిలికాన్, చమురు కాకుండా ఇతర మినరల్స్‌ను వెలికి తీసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలన్నారు. సముద్రంలో చాలా సంపద ఉందని తెలిపారు.
సంతృప్తి స్థాయి పెంచాలి
పౌర సరఫరాలకు సంబంధించి ప్రజల సంతృప్తి స్థాయి 90 శాతానికి పెంచాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. 3300 రేషన్ దుకాణాల డీలర్ల పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల సకాలంలో తెరవడం లేదని, దీనిపై ప్రజల్లో విమర్శలు వినిపిస్తున్నాయని తెలిపారు. ఈ డీలర్ల పోస్టులను భర్తీ చేసేందుకు కలెకర్లు చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో ప్రస్తుతం ఉన్న 70 శాతం సంతృప్తిని 90 శాతానికి తీసుకువెళ్లాలన్నారు. ఒక నెల రోజుల్లో పరిస్థితిలో మార్పు రావాలని ఆదేశించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఉన్న నెంబర్ 1 స్థానాన్ని శాశ్వతం చేసుకోవాలన్నారు. వివిధ పారిశ్రామిక వేత్తలతో అధికారులు మాట్లాడి, వివాదాలు, అసంతృప్తి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులు దీనిపై దృష్టి సారించాలని చంద్రబాబు సూచించారు.

పవర్ లిఫ్టర్ రేవతికి రూ.5 లక్షల నజరానా

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 20: కామన్‌వెల్త్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఆన్ ఎక్విప్డ్ గోల్డ్ మెడల్ విజేత సాయిరేవతి విజయవాడలో బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు. ఈసందర్భంగా ఆయన సాయిరేవతిని అభినందించి రూ.5 లక్షలు నజరానా ప్రకటించారు. అంతర్జాతీయ పోటీలకు అవసరమైన శిక్షణ అందించాలని అధికారులకు సూచించారు. తెనాలి ఇండోర్ స్టేడియంలో అవసరమైన ఎక్విప్‌మెంట్ కోసం రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.

ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి సంతృప్తి

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 20: ఇసుక పాలసీలో లోపాలు సరిదిద్ది ప్రజలందరికీ ఉచితంగా ఇసుకను అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం నగరంలోని ఎ కనె్వన్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉచిత ఇసుక పంపిణీలో జరిగే లోపాలను నియంత్రించేలా పటిష్టమైన చర్యలు చేపట్టడం ద్వారా సమర్థవంతంగా ఇసుక అందించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా గనుల శాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. ట్రాక్టర్లు, లారీల ద్వారా ఏ ప్రాంతంలో ఏ సమయంలో ఇసుక రవాణా అవుతున్నదీ, వాటి నెంబర్లు సహా తెలుసుకునేలా టెక్నాలజీని వినియోగించి రియల్ టైమ్ గవర్నెన్స్ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. ఈ విధానం ద్వారా రాజకీయ నాయకులతో సహా ఎలాంటివారైనా ఇసుక అక్రమాలకు పాల్పడితే వారి వివరాలు తెలుసుకునే వీలుంటుందన్నారు. ఇసుక అక్రమాలకు పాల్పడేవారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఉచిత ఇసుక పంపిణీ విధానంలో 60 శాతం ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించడంలో భాగంగా ఉచిత ఇసుకను కూడా ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని చంద్రబాబు నాయుడు వివరించారు.

యుద్ధప్రాతిపదికన మొక్కలు నాటాలి * సిఎం చంద్రబాబు

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో గరిష్ఠ స్థాయిలో మొక్కలు నాటాలని, కొన్ని దేశాల్లో పనికిరానివి కాకుండా పండ్ల మొక్కల పెంపకం పెద్దఎత్తున చేపట్టి 4,5 ఏళ్లలో పచ్చదనం పెంచారని, అలాంటి ఉత్తమ పద్ధతులను ఇక్కడా ప్రవేశపెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. విజయవాడలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ పనితీరును సమీక్షిస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన వాతావరణానికి సరిపోయే పండ్ల మొక్కలను పెంచాలని, అటవీ సంరక్షణ జరగాలన్నారు. నీరు-చెట్టు కింద అడవుల్లో కూడా వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చే పని ప్రారంభించాలన్నారు. వీలైనన్ని చెక్‌డ్యామ్‌లు కట్టాలని, అడవుల చుట్టూ కాంటూర్ కందకాలు తవ్వాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలను పెద్దఎత్తున తీసుకోవడం వల్ల అటవీ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ఈ పనులకు ఇదే సరైన సమయమని, భూగర్భ జలాలు పెరిగితే చెట్లు బాగా పెరుగుతాయన్నారు. రెండు నెలల్లో యుద్ధ ప్రాతిపదికపై ఈ పనులు పూర్తిచేయాలని, వనం-మనం 4, 5 మాసాలు పెద్దఎత్తున నిర్వహించి చివర్లో ఘనంగా వన భోజనాలు నిర్వహించాలన్నారు. ప్రకృతితో మమేకమయ్యే ఇలాంటి పండుగల వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నారు. వనం-మనం , జలసిరికి హారతి, ఏరువాక, వన సమారాధన, పల్లెల్లో సంక్రాంతి పండుగలను ప్రభుత్వం తరఫున అభికారికంగా నిర్వహించాలన్నారు. రాష్ట్ర పండుగలు ఐదింటినీ ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు సూచించారు.

వ్యవసాయం, అనుబంధ రంగాలదే అగ్రస్థానం

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 20: రాష్ట్ర ఆదాయానికి అదనపు విలువ జోడింపులో (జివిఎ) వ్యవసాయం, అనుబంధ రంగాలు అగ్రస్థానంలో నిలిచాయి. 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్ర జివిఎ సాధనలో ప్రాథమిక రంగం 31.1 శాతంతో ముఖ్యపాత్ర పోషించింది. మంగళవారం విజయవాడలో ప్రారంభమైన రాష్ట్ర 13వ కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2017-18 త్రైమాసిక ఆర్థిక ఫలితాల పుస్తకాలను ఆవిష్కరించారు. 2015-16 ఆర్థిక సంవత్సరం జివిఎలో వ్యవసాయ రంగంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం మొదటి స్థానం సాధించింది. అదే జిల్లాకు చెందిన కలిదిండి మండలం రెండో స్థానంలో నిలిచింది. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం 10వ స్థానం దక్కించుకుంది. ఇక 2015-16 ఆర్థిక సంవత్సరానికి జీవిఎలో పారిశ్రామిక రంగాన విశాఖ జిల్లా గాజువాక మండలం అగ్రగామిగా నిలిచింది. విశాఖ జిల్లా విశాఖ అర్బన్ మండలం రెండో స్థానంలో నిలువగా, విశాఖ జిల్లా పరవాడ 10వ స్థానంలో ఉంది. సేవా రంగంలో జివిఎ పరంగా విశాఖ అర్బన్ మండలం మొదటి స్థానం సాధించింది. రెండవ స్థానంలో విజయవాడ అర్బన్, కర్నూలు మండలం పదో స్థానంలో ఉన్నాయి. కీ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్‌లో కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాలు ఎ-ప్లస్ రేటింగ్ సాధించాయి. చిత్తూరు, కర్నూలు, తూర్పుగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఎ-ప్లస్ రేటింగ్ సాధించగా, కడప, విశాఖ, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలు ఎ-గ్రేడ్‌లో నిలిచాయి. ఇదిలావుండగా 2015-16 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జివిఎలో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగం వాటా 31.1గా నమోదైంది. రాష్ట్ర జివిఎలో ప్రాథమిక రంగం నుంచే అధిక వాటా వచ్చింది. రాష్ట్రంలోని మొదటి 10 నియోజకవర్గాలు వ్యవసాయ జివిఎలో 14.8 శాతం జోడించాయి. మరోవైపు రాష్ట్రంలో 2015-16 గణాంకాల ఆధారంగా జివిఎకు 10.5 శాతం జోడించిన మొదటి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖ జిల్లా గాజువాక నెంబర్-1 స్థానం సాధించింది. ర్యాంకులు దక్కిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖ జిల్లా నుంచే 4 నియోజకవర్గాలు ఉండటం విశేషం. గాజువాక 1వ ర్యాంకు, విశాఖ దక్షిణం 3వ ర్యాంకు, యలమంచిలి 5వ ర్యాంకు, విశాఖపట్నం ఉత్తరం 6వ ర్యాంకు సాధించాయి. రాష్ట్ర మొత్తం జివిఎలో గాజువాక జోడించిన స్థూల విలువ రూ.8842 కోట్లు. మరోవైపు పారిశ్రామిక రంగంలో సైతం జివిఎలో గాజువాక అగ్రస్థానంలో నిలిచింది. తలసరి ఆదాయం రూ.2,13,963గా నమోదైంది. విశాఖలో ప్రధాన పరిశ్రమలైన విశాఖ ఉక్కు కర్మాగారం, బిహెచ్‌పివి, జింక్‌లు పారిశ్రామిక రంగాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. పట్టణీకరణ కారణంగా విశాఖ జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు రాష్ట్ర మొత్తం జివిఎలో ర్యాంకులు దక్కాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం సేవా రంగంలో ప్రతిభ చూపి మూడో స్థానం దక్కించుకుంది. రాష్ట్ర జివిఎలో కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గానికి 10వ ర్యాంకు వచ్చింది. వ్యవసాయం, అనుబంధ రంగాల ద్వారా ఈ ఘనత సాధించింది. మత్స్యరంగం ప్రధాన ఆదాయ వనరుగా నిలిచింది. వ్యవసాయ రంగంలో మొదటి పది ర్యాంకులు దక్కించుకున్న అసెంబ్లీ నియోజకవర్గాలు 14.8 శాతం ఆదాయాన్ని జోడించాయి.

న్యూజిలాండ్-ఎ జట్టుతో టెస్ట్ మ్యాచ్‌లకు సర్వం సిద్ధం

విజయవాడ (స్పోర్ట్స్), సెప్టెంబర్ 20: ఇండియా-ఎ, న్యూజిలాండ్-ఎ జట్ల మధ్య ఈ నెల 23 నుంచి విజయవాడకు సమీపంలోని మూలపాడు క్రికెట్ గ్రౌండ్‌లో ఇరిగే రెండు టెస్ట్ (నాలుగు రోజులు) మ్యాచ్‌లలో ఆడేందుకు ఇరుజట్లు నగరానికి చేరుకున్నాయి. ఇరుజట్లకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు స్వాగతం పలికారు. ఇండియా-ఎ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్‌కు ఏసిఎ ప్రధాన కార్యదర్శి సిహెచ్ అరుణ్‌కుమార్, సెంట్రల్ జోన్ కార్యదర్శి కోకా రమేష్, మీడియా మేనేజర్ సిఆర్ మోహన్ స్వాగతం పలికారు. ఇండియా-ఎ జట్టు మంగళవారం రాత్రి చేరుకోగా న్యూజిలాండ్ జట్టు బుధవారం చేరుకున్నాయి.
ఇరుజట్లకు హోటల్ గేట్‌వేలో బస ఏర్పాటు చేశారు. మొదటి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 23 నుంచి 26 వరకు, రెండో టెస్ట్ ఈ నెల 30 నుంచి అక్టోబర్ 3 వరకు జరగనున్నాయి. ఇండియా-ఎ జట్టుకు ఆంధ్ర రంజీ కెప్టెన్ హనుమ విహారి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇరుజట్లు గురువారం ఉదయం మూలపాడు గ్రౌండ్‌లో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొననున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12 గంటలకు వరకు న్యూజిలాండ్-ఎ, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఇండియా-ఎ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొననున్నాయి.

రాజధాని డిజైన్లపై
చంద్రబాబు-రాజవౌళి భేటీ

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, సెప్టెంబర్ 20: బాహుబలి సినిమాతో జగద్విఖ్యాత దర్శకుల జాబితాలో చేరిన కోడూరి శ్రీశైలశ్రీ రాజవౌళి అమరావతి నిర్మాణంలో భాగస్వామి కానున్నారు. ఇప్పటికే అమరావతి నగర నిర్మాణాలకు డిజైన్లు ఇచ్చిన నార్మన్ ఫోస్టర్ సంస్థకు బాహ్య నిర్మాణ ఆకృతులపై రాజవౌళి తన సలహా, సూచనలు ఇవ్వనున్నారు. ఈమేరకు ఆయన బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇక్కడ మూడుసార్లు భేటీ అయ్యారు. కలెక్టర్ల సదస్సులో బిజీగా ఉన్నప్పటికీ బాబు ఆయనతో చర్చించారు. తర్వాత రాజవౌళి ఉదయం మంత్రి నారాయణతో కలసి రాజధాని ప్రాంతాన్ని, నిర్మాణాలు చేపట్టనున్న ప్రదేశాలను పరిశీలించారు. ఐకానిక్ భవనాలకు లోకల్ ఫ్లేవర్ ఉండాలని, బాహుబలిలో అద్భుత ఆకృతులు రూపొందించిన తరహాలో బాహ్య ఆకృతి ఉండాలని బాబు భావిస్తున్నందున రాజవౌళి సహాయం కోరామని నారాయణ చెప్పారు. ఈ క్రమంలో బాబు-రాజవౌళి మధ్య మూడుసార్లు చర్చలు జరిగాయి. దేశ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా డిజైన్లు ఉండాలని సీఎం కోరారు. వచ్చేనెలలో మంత్రి నారాయణ, అధికారుల బృందంతో లండన్ వెళ్లి వారికి సలహాలివ్వాలని రాజవౌళిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే, తనకు నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లు అందించిన తర్వాతనే తన అభిప్రాయం వెల్లడిస్తానని రాజవౌళి చెప్పారు. జిల్లా కలెక్టర్ల సదస్సు తొలిరోజు సమావేశం ముగిసిన తరువాత సిఎంతో రాజవౌళి మరోసారి సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరకు పైగా రాజధాని డిజైన్లపై చర్చించారు. అనంతరం ఆ భేటీ వివరాలను మీడియాకు మంత్రి నారాయణ వెల్లడించారు. డిజైన్లకు సంబంధించి కానె్సప్ట్ గురించి రాజవౌళి అడిగారన్నారు. ఏ కానె్సప్ట్ ఆధారంగా నార్మన్ సంస్థ డిజైన్ చేసిందో తెలుసుకున్నారన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ భవనాలను అమరావతిలో ఉండేలా సిఎం చూస్తున్నారని, ఆ విషయం ఆయనకు తెలిపారన్నారు. వివిధ దేశాలను సందర్శించిన అనుభవంతో కీలక భవనాల డిజైన్‌కు సహకరించాలని కోరినట్లు తెలిపారు. అక్టోబర్ 11న నార్మన్ ఫోస్టర్ సంస్థతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారని, అనంతరం తమతో కలిసి రాజవౌళి లండన్ వస్తారని మంత్రి నారాయణ వివరించారు.

బాబు జోరు.. అధికారుల బేజారు!

శసీఎం స్పీడు అందుకోలేకపోతున్న ఐఏఎస్‌లు
శసీఎంవో నుంచి మంత్రుల వరకూ అదే తీరు
శగత సీఎంవోనే బెటరంటున్న నాయకులు
శసీఎంను మెప్పించేందుకు కొందరి ‘అతి’తెలివి!

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
అమరావతి, సెప్టెంబర్ 20: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పీడును అధికారులు, మంత్రులు అందుకోలేకపోతున్నారు. ఆరుపదుల వయసు దాటిన బాబు ఇప్పటికీ గంటల పాటు సమీక్షలు నిర్వహిస్తుంటే, జిల్లాస్థాయిలో చాలామంది కలెక్టర్లు, కమిషనరేట్ స్థాయి అధికారులు వెనుకబడిపోతున్నారు. చివరకు సీఎంవో కార్యాలయం కూడా బాబు ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడంలో విఫలమవుతోందన్న విమర్శలు అటు అధికారులు, ఇటు అధికార పార్టీ నుంచీ వినిపిస్తున్నాయి. ఈవిషయంలో బాబు తొలిసారి సీఎంగా ఉన్నప్పటి పేషీనే బెటరని, ఆ తరహా ఆలోచనా విధానం ఉన్న అధికారులు ఇప్పటి పేషీలో కనిపించడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఏపికి వచ్చిన అధికారుల్లో సమర్థత శాతం తక్కువ ఉన్నవారు రాగా, సీనియర్ల కొరత కారణంగా చాలామంది జూనియర్లే ఉండటంతో పాలన బాబు ఆశించినంత వేగంగా జరగడం లేదంటున్నారు. ‘ఇప్పుడున్న చాలామంది అధికారులు జూనియర్లు. వాళ్లతోనే పనిచేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. చాలామందికి ఫైళ్లు ప్రిపేర్ చేయడం, రన్ చేయించడం తెలియదు. పెన్‌పవర్ ఉన్నవాళ్లు లేరు. కొందరు సీనియర్లు హైదరాబాద్ వాతావరణానికి అలవాటుపడి, తెలంగాణకు వెళ్లిపోయారు. ఇక్కడి అధికారుల్లో 50 శాతం మంది ఇంకా హైదరాబాద్‌లోనే కాపురాలు ఉండటంతో వాళ్లు శని, ఆదివారాలు అక్కడికి వెళ్లి వస్తున్నారు. కొంతమంది మంత్రులదీ అదే పరిస్థితి. అలాంటప్పుడు వారి నుంచి మెరుగైన పనితీరు ఆశించడం అత్యాశ అవుతుంది కదా’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు. అయితే సీఎం సమీక్షలు ఎక్కువగా ఉండటం, అవి గంటలపాటు సాగుతుండటం, గంటలపాటు టెలీకాన్ఫరెన్సుల వల్ల అధికారులు అసహనానికి గురవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. సీఎంఓ ముఖ్య కార్యదర్శి, కార్యదర్శులు, సీఎస్, డిజిపి, ఇంటెలిజన్స్ చీఫ్, సమాచారశాఖ కమిషనర్ వంటి కీలక విభాగాలకు చెందిన అధికారులకు పార్టీ-ప్రభుత్వ ప్రయోజన కోణం ఉంటేనే సీఎంలు సక్సెస్ అవుతారని, అలాంటి పరిస్థితి బాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఉండేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, గతంలో మాదిరిగా సరైన టీమ్ లేకపోవడం వల్లే బాబు ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో బాబు వద్ద పనిచేసిన ఐఏఎస్‌లు తమ సీనియర్లను గౌరవించేవారని, బాబు ఇచ్చిన సందేశం జాగ్రత్తగా, సదరు అధికారి మనసు గాయపడకుండా లౌక్యంగా చెప్పే వారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదంటున్నారు. ప్రస్తుతం సీఎంఓలో పనిచేసే ఓ కార్యదర్శి అందరినీ పరుష పదజాలంతో దూషిస్తున్న వైనం బాధకలిగిస్తోందని వివరిస్తున్నారు.
‘బాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు మంచి టీమ్ ఉండేది. విజయం బాబుది-అపజయం తమది అన్నంత డెడికేషన్‌తో పనిచేసేవాళ్లు. ఎస్వీ ప్రసాద్, సాంబశివరావు, లక్ష్మీనారాయణ, బాలసుబ్రహ్మణ్యం, ఉమామహేశ్వరరావు, నాగరాజునాయుడు వంటి వాళ్లు పేషీ లోపల, బయట తమ బాధ్యతలు డెడికేషన్‌తో నిర్వర్తించేవారు. ఎమ్మెల్యేలు, మంత్రులను గౌరవించేవాళ్లు. అప్పట్లో కూడా ఇప్పటిమాదిరిగానే ఒక కులం వారి హడావిడి ఉన్నప్పటికీ పేషీ అధికారులు వడపోత పోసి వారికి రేటింగ్ ఇచ్చి సీఎం వద్దకు పంపేవాళ్లు. బాబుకు మిత్రుడైన లక్ష్మీనారాయణ సామాజికవర్గ వ్యవహారాలు చూస్తే, మీడియా మేనేజ్‌మెంట్ వ్యవహారాలు సమాచారశాఖ కమిషనర్లు చూసుకునేవాళ్లు. సీఎం కూడా ఎస్వీ ప్రసాద్‌తో మాట్లాడిన తర్వాతనే నిర్ణయాలు తీసుకునేవారు. సాంబశివరావు ఎమ్మెల్యేలు, నేతల అవసరాలను కనిపెట్టుకునేవారు. ఇంటలిజన్స్ చీఫ్, సమాచారశాఖ కమిషనర్ సూచనలను బాబు గౌరవించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. సమాచారశాఖ కమిషనర్‌కు అధికారాలు, స్వేచ్ఛ లేదు. ఇంటలిజన్స్ చీఫ్‌కూ బాబుగారే సూచనలిస్తారు. మరి ఇద్దరూ సమర్ధులే. అయినా అదీ వాళ్ల పరిస్థితి. సతీష్‌చంద్రలో అప్పుడున్నంత చురుకుదనం ఇప్పుడు కనిపించడం లేదు. పైగా బోలెడన్ని విమర్శలు. నచ్చిన వారికే పోస్టింగులిస్తున్నారని, ముఖ్యంగా ప్రమోటీ ఐఏఎస్‌లకు ప్రాధాన్యం లేని పోస్టింగులు ఇస్తున్నారని, అందులో కూడా నచ్చిన వారికి, గతంలో తన దగ్గర పనిచేసిన వారికి మంచి పోస్టింగులు ఇప్పిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆయన పనితీరు వల్ల బాబుకు పెద్దగా మైలేజీ రావడం లేదు. కానీ ఇప్పుడున్న వారిలో ఆయన తప్ప మరొక అధికారి కనిపించడం లేదు. సాయిప్రసాద్ దగ్గరకు వెళ్లాలంటే చాలా ధైర్యం కావాలి. చెవులు మూసుకుని లోపలికి వెళ్లాలి. గిరిజాశంకర్ తనపని తాను చేసుకువెళతారు. పేషీలో ఓఎస్డీ రాజవౌళి, బాబు వ్యక్తిగత కార్యదర్శులు శ్రీనివాస్, రాజగోపాల్ అందరికంటే మెరుగ్గా పనిచేస్తున్నారు. కొందరు అధికారులు బాబును మెప్పించడానికి అతి తెలివి ప్రదర్శిస్తూ హడావిడి చేస్తున్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే ఇప్పటి బాబు టీమ్ అప్పటిలా సమర్ధవంతంగా లేదన్నది నిజం’ అని గతంలో బాబు సీఎంగా పనిచేసినప్పటి ఒక ఐఏఎస్ అధికారి వివరించారు. బాబు పరిపాలనలో బాగా పండిపోవడం, ఇప్పటి అధికారులు జూనియర్లు అయిపోవడంతో మునుపటికి భిన్నంగా పాలన జరుగుతోందంటున్నారు. ఆయనకు చెప్పే స్థాయి అనుభవం ఉన్న అధికారులు లేకపోవడంతో, ఆయన చెప్పినవే చేయాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఆ స్థాయి నైపుణ్యం పెంచుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. దీనితో కొన్ని వాస్తవ పరిస్థితులను సీఎం దృష్టికి తీసుకువచ్చినా అవి బాబును మెప్పించలేపోతున్నాయని అంటున్నారు.