ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో ‘అద్దె’ బతుకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 23: ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఖజానాకు భారీగా గండి పడబోతోంది. కొన్ని తొందరపాటు నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని శరవేగంగా నిర్మించాలన్న ఆతృతతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ను వదిలి బయటకు రావడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర విభజన చట్టం రెండు తెలుగు రాష్ట్రాలకు పదేళ్ల పాటు హైదరాబాద్ రాజధాని అని స్పష్టంగా పేర్కొంది. అయితే చంద్రబాబు నాయుడు, కె చంద్రశేఖరరావు మధ్య విభేదాలు రోజుకో మలుపు తిరుగుతుండటంతో చంద్రబాబు హైదరాబాద్ విడిచి వచ్చేశారు.
హైదరాబాద్‌పై మనకున్న హక్కును కేంద్రంతో మాట్లాడి మరి కొనే్నళ్లపాటు కొనసాగేలా చూసుకుని ఉంటే బాగుండేదనే సూచనలు కూడా వినిపిస్తున్నాయి. కనీసం ఐదేళ్ల పాటు చంద్రబాబు హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు సాగించి ఉంటే ఆయన అనుకున్న రీతిలో రాజధానిని నిర్మించి, నింపాదిగా ఉద్యోగులను తరలించి, ఎపి నుంచి సాఫీగా పాలన సాగించేవారు. కానీ తొందరపడి హైదరాబాద్‌ను విడిచి రావడం వల్ల అనేక సమస్యలతో పాటు ఖజానాపై కోట్ల రూపాయల భారం పడబోతోంది.
‘తాత్కాలిక’ భారమే ఎక్కువ!
ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే.. కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ఇంటిని సుమారు 20 నుంచి 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆధునీకరించారు. విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని 20 కోట్ల రూపాయలు ఖర్చుచేసి ఆధునీకరించారు.
తాత్కాలిక సచివాలయం పేరిట సుమారు 740 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఆయన ఉత్తరాంధ్ర, లేదా విజయవాడ చుట్టుపక్కల జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు రెగ్యులర్ విమానంలో వచ్చేవారు. ఇప్పుడు ప్రత్యేక విమానాన్ని విరివిగా వినియోగించడం వల్ల వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయనే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే, ఉద్యోగులను వచ్చే నెల 27 నాటికి అమరావతికి తరలించాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. ఎపికి చెందిన సెక్రటేరియట్ ఉద్యోగులను పూర్తిస్థాయిలో తరలించడానికి కావాల్సిన వసతులు తాత్కాలిక సెక్రటేరియట్‌లో ఎక్కడా కనిపించడం లేదు. జూన్‌లో హెచ్‌ఓడిలను కూడా ఇక్కడికి రప్పిస్తున్నారు. వారి కార్యాలయాలను సెక్రటేరియట్‌లో కాకుండా గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని ప్రైవేటు భవనాల్లో ఉంచాలనుకుంటున్నారు. సుమారు 8 లక్షల చదరపు అడుగుల భవనాలను అద్దెకు తీసుకోవాలని భావిస్తున్నారు. దీనికి సంవత్సరానికి 10 నుంచి 12 కోట్ల రూపాయలు ఖర్చు కాబోతోంది. అలాగే మంత్రులకు క్వార్టర్లు ఇస్తామని ప్రకటించారు.
కానీ ఇప్పటివరకూ వారికి క్వార్టర్లు అప్పగించలేదు. గతంలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర కొన్ని విల్లాస్‌ను లీజుకు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. కానీ అక్కడ ఉండటానికి మంత్రులు ఇష్టపడలేదని సమాచారం. దీంతో వీరికి విజయవాడలో భారీగా అద్దెలు చెల్లించి భవనాలు తీసుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వం ఏడాదికి అద్దెలు చెల్లించడానికే వంద కోట్ల రూపాయల వరకూ ఖర్చుచేయాల్సి వస్తుందని తెలుస్తోంది.ఆగస్ట్‌లో అసెంబ్లీ సమావేశాలు అమరావతిలోనే జరగనున్నాయి. అప్పుడు నగరానికి వచ్చే 175 మంది ఎమ్మెల్యేలకు ఎక్కడ వసతి సౌకర్యం కల్పించాలో తెలియక అధికారులు ఇప్పటికే తలలు పట్టుకుంటున్నారు. ఇక అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి, అలాగే అమరావతి నగర రూపకల్పనకు సంబంధించి విదేశీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ సమావేశమవుతున్నారు. ఈ సమావేశాలన్నీ స్టార్ హోటళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇదిలావుండగా, తాత్కాలిక సెక్రటేరియట్ పూర్తిస్థాయిలో తయారైనప్పటికీ హైదరాబాద్ నుంచి పూర్తిస్థాయిలో ఉద్యోగులను ఇక్కడికి తరలించడం సాధ్యం కాదని భావిస్తున్నారు. వారందరికీ కావాల్సిన వసతులు లేకపోవడమే ఇందుకు కారణం. అలాగే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా సెక్రటేరియట్‌కు తరలిస్తారా? లేదా? అనే అనుమానాలున్నాయి. ముఖ్యమంత్రిని కలిసేందుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. వారిని తాత్కాలిక రాజధానికి తీసుకెళ్లడం చంద్రబాబుకు ఇష్టం లేదని, వారికోసం కొంతకాలం ఆయన నగరంలోని కార్యాలయంలో కొనసాగుతారని చెపుతున్నారు.