ఆంధ్రప్రదేశ్‌

జర్నలిస్టులకు త్వరలోనే ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 24: జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. పాత్రికేయులకు ఇళ్లు, ఆరోగ్య పథకం, పెన్షన్లు త్వరలో అందేలా ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ పాత్రికేయులు, ఫొటో జర్నలిస్ట్‌లకు 2008, 2009, 2010 సంవత్సరాలకు గాను ప్రకటించిన అవార్డులను విజయవాడలో ఆదివారం ఆయన అందజేశారు. దాదాపు 14 ఏళ్లు తానుకూడా జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నానని, వారి సాదకబాధకాలు తనకూ తెలుసునని శ్రీనివాసులు అన్నారు. జర్నలిస్ట్‌లకు సొంతిల్లు ఉండాలనేదే తన మొదటి ప్రాధాన్యత అని, తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన వెంటనే పాత్రికేయులకు ఈ విషయమే చెప్పానన్నారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఇటీవలే జర్నలిస్ట్‌లకు ఇళ్ల మంజూరు అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రకటన చేశారని గుర్తుచేశారు. ఇందుకు తగిన విధివిధానాలు త్వరలోనే రూపొందిస్తామన్నారు. జర్నలిస్ట్‌ల హెల్త్‌కార్డుల విషయంలో ఉన్న ఇబ్బందులను త్వరలోనే తొలగిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో కూడా హెల్త్‌కార్డు వినియోగించుకునేలా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. కనీసం 20ఏళ్ల సర్వీస్ కలిగిన విశ్రాంత జర్నలిస్ట్‌లకు రూ.3వేలు పెన్షన్ ఇచ్చేలా ముఖ్యమంత్రితో చర్చించి త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తామని శ్రీనివాసులు ప్రకటించారు. కొన్ని ఇతర రాష్ట్రాలు జర్నలిస్టుల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను పరిశీలించామని, వయోవృద్ధులైన సీనియర్ జర్నలిస్టులకు ప్రతినెలా ఆర్థిక అందించే ఆలోచన ఉందని వెల్లడించారు. జర్నలిస్టులపై దాడుల నిరోధానికీ తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై త్వరలోనే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. అకాలంగా మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రతినెలా కనీసం రూ. 3వేలు పెన్షన్ ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచనగా తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, సమస్యలపై ఈ నెల 26న జర్నలిస్టు సంఘాలు, సీనియర్ జర్నలిస్టులతో సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. ‘జర్నలిస్టులను ప్రభుత్వాన్ని వెనకేసుకురమ్మని చెప్పనుకానీ ఇచ్చే వార్తలు సహేతుకంగా ఉండేలా చూడాలి. విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడానికి మీరే వారధులు’ అని మంత్రి కాలవ శ్రీనివాసులు సూచించారు. నార్ల వెంకటేశ్వరరావు జీవిత సాఫల్య అవార్డును అందుకున్న పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ తన ఏడు దశాబ్దాల జర్నలిస్ట్ జీవితంలో అనేక పరిణామాలు చూశానని అంటూ, మంచి వృత్తినైపుణ్యం సాధించాలని యువ జర్నలిస్టులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ వాసుదేవ దీక్షితులు మాట్లాడుతూ విభజన తర్వాత రాష్ట్రంలో ఇవి తొలిసారిగా ఇస్తున్న అవార్డులని అన్నారు. రాష్ట్ర విభజన పరిణామాల వల్ల జర్నలిస్ట్‌లకు, ఫొటో జర్నలిస్టులకు అవార్డులు ఇవ్వడంలో కొంత జాప్యం జరిగిందన్నారు. విజయవాడకు ఇటీవల తరలివచ్చిన రాష్ట్ర ప్రెస్ అకాడమీ జర్నలిస్టుల సంక్షేమానికి త్వరలోనే పలు కార్యక్రమాలు చేపడుతుందని ఆయన వెల్లడించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్ వెంకటేశ్వర్ అవార్డుల పొందిన వారి వివరాలు ప్రకటించారు. అదనపు డైరక్టర్ మల్లాది కృష్ణానంద్ సభకు స్వాగతం పలికారు. అంతకుముందు అవార్డులకు ఎంపికైన ఛాయాచిత్రాలను మంత్రి కాలవ శ్రీనివాసులు పరిశీలించారు. వివిధ పథకాలపై నిర్వహించిన ఛాయాచిత్ర పోటీల విజేతలకు కూడా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.