ఆంధ్రప్రదేశ్‌

పాలకుల చేతిలో మోసపోయాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, అక్టోబర్ 10: పాలకుల చేతిలో మనం మోసపోయామని వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఇప్పటికే ఎన్నో మార్పులు చూసి ఉండేవారమన్నారు. పరిశ్రమలు ఏర్పాటయ్యేవి, లక్షల ఉద్యోగాలు వచ్చేవి, నిరుద్యోగ సమస్య తీరేదన్నారు. కానీ పాలకులు మనలను మోసం చేశారన్నారు. అందుకే హోదా కోసం చివరి వరకు పోరాటం సాగిస్తామన్నారు. అవసరమైతే తమ ఎంపిలతో రాజీనామా చేయిస్తానని జగన్ అన్నారు. అనంతపురం నగరంలో మంగళవారం నిర్వహించిన యువభేరి సభలో జగన్ విద్యార్థినీ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. విభజన అనంతరం జరిగిన నష్టాన్ని ప్రత్యేక హోదా మాత్రమే పూడ్చేదని జగన్ అన్నారు. ప్రత్యేకహోదాతో పాటు విభజన హమీల అమలు, వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ సాధన కోసం గత మూడేన్నరేళ్లుగా వైకాపా అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. హోదా కోసం మంగళగిరిలో రెండు రోజుల నిరాహారదీక్ష చేశామన్నారు. గుంటూరులో 7 రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేస్తే రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోదీ వస్తున్నాడంటూ పోలీసులను ఉపయోగించి బలప్రయోగం ద్వారా దీక్షను అడ్డుకున్నారన్నారు. రాష్ట్రానికి వచ్చిన ప్రధానితో ప్రత్యేకహోదాతో పాటు విభజన హామీల గురించి ఒక్కమాట కూడా మాట్లాడని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. హోదా సాధన కోసం అసెంబ్లీ, పార్లమెంట్ సాక్షిగా వైకాపా పోరాటం సాగిస్తోందన్నారు. హోదా సంజీవని కాదంటున్న ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీ కేంద్రం ఇస్తుందంటూ కళ్లబొల్లికబుర్లు చెబుతున్నారన్నారు. ముఖ్యమంత్రి లేదా ప్రతిపక్షనేతను చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టరన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు నెలకొల్పటానికి ముందుకు వచ్చి ఉండే వారన్నారు. హోదా మూలంగా ఇన్‌కంటాక్స్, జిఎస్‌టి లాంటి వాటి నుంచి మినహయింపులు లభించేవన్నారు. రాష్ట్రానికి 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని నాడు కోరిన ముఖ్యమంత్రి నేడు అదే నోటితో అదేమైనా సంజీవినా అంటూ వ్యాఖ్యానించడం విచారకరమన్నారు. విభజన నేపధ్యంలో ఉపాధి అవకాశాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున తరలిపోతోందన్నారు. గతంలో హైదరాబాద్ ఉద్యోగులకు కల్పతరువుగా ఉండేదన్నారు. విభజన అనంతరం యువతకు ఉపాధి, ఉద్యోగాఅవకాశాలు మృగ్యమయ్యాయన్నారు. రాష్ట్రాలకు కేంద్రం అందజేసే నిధుల్లో ఓ ఫార్ములా లేకుండా పోయిందన్నారు.హోదా ముగిసిన అధ్యాయం అని అంటున్నారని, మరి అలాంటప్పుడు రాష్ట్రాలకు నిధులిచ్చే సమయంలో తేడా ఎందుకని జగన్ ప్రశ్నించారు. ఇటీవల జిఎస్‌టి తెచ్చారని, అందులోనూ హోదా కలిగిన రాష్ట్రాలకు భారీ మినహాయింపులు కేటాయించారన్నారు. ప్రధాని సౌభాగ్య యోజన(కరెంటు లేని ఇళ్లకు కనెక్షన్లు) పథకంలోనూ హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ఇదంతా వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నారన్నారు. చంద్రబాబు తన వద్ద మీడియాతో హోదా వల్ల ప్రయోజనం లేదని చెప్పిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు, పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

చిత్రం.. అనంతపురంలో మంగళవారం జరిగిన యువభేరిలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి