ఆంధ్రప్రదేశ్‌

బాబుపై చెరిగిన ‘కరవు ముద్ర’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి ప్రత్యేక ప్రతినిధి
అమరావతి, అక్టోబర్ 11: కరవు-బాబు కవల పిల్లలు.. చంద్రబాబు పాలనలో వర్షాలు కురవవు.. ఇవీ గత కొనే్నళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విపక్షాలు చేస్తున్న విమర్శలు! వైఎస్ ఉన్నప్పుడయితే వరుణుడు మా పార్టీలోనే శాశ్వతంగా ఉంటారు. వర్షాలొచ్చినా బాబుకు ఏడుపేనని వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. కానీ గత కొద్దిరోజుల నుంచీ రాష్ట్రంలో విస్తారంగా కురుస్తోన్న భారీ వర్షాలు, నిండిపోతున్న చెరువులు, రిజర్వాయర్లు బాబుపై ఉన్న ఈ విమర్శలకు తెరదించాయి. ప్రధానంగా కరవుతో అల్లాడిపోతున్న రాయలసీమలో గతంలో ఎప్పుడూ లేనంత వర్షపాతం నమోదుకావడంతో విపక్షాల విమర్శలకు తెరపడినట్టయింది. దీనిపై ‘బాబు వస్తే వర్షాలు రావని చెప్పిందెవరం’టూ టిడిపి గ్రామీణ ప్రాంతాల్లో చేస్తున్న ‘ఎదురుదాడి సానుకూల ప్రచారం’ ఫలితాలిస్తోంది. దేశంలో రాజస్థాన్ తర్వాత అత్యంత కరవుప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఈసారి ఏకంగా వరదలు రావడం రైతాంగాన్ని సంతోషపరిచింది. గతంలో కర్నూలు జిల్లాలో కొన్ని సందర్భాల్లో వరదలు వచ్చిన దాఖలాలున్నప్పటికీ, అనంతపురంలో మాత్రం భారీ వర్షాలు వచ్చి, చెరువులు నిండిన వైనం లేకపోవడం గమనార్హం. గత నెల తొలి వారం వరకూ రాయలసీమలో 537.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, ఇంకా 216.7 మిల్లీమీటర్లు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అదే కోస్తాజిల్లాల్లో గత నెలలో 526.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదుకాగా, తాజాగా 688.13 మిల్లీ మీటర్లు నమోదయింది. అంటే 161.4 మిల్లీమీటర్లు ఎక్కువ వర్షపాతం నమోదయింది. గత నెల తొలివారంలో రాష్ట్రంలో మొత్తం 449.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, తాజాగా అది 180 మిల్లీమీటర్లు అదనంగా, అంటే 629.8 మిల్లీమీటర్లకు చేరింది. తాజాగా కురుస్తోన్న వర్షాల ప్రభావం భూగర్భజలాలపైనా పడుతోంది. ఇది నీరు లేక భూమివైపు తొంగి చూస్తున్న రైతులకు ఊరటగా మారింది. ప్రధానంగా రాయలసీమలో ఇంకిపోయిన భూగర్భజలాల మట్టాలు పైకి వస్తుండటం రైతులకు ఆనందం కలిగిస్తోంది. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో 19.66మీటర్ల లోతున్న భూగర్భజలాలు గత కొద్దిరోజుల నుంచి 4.60 మీటర్లకు పెరిగి, 14.97 మీటర్లకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 12.34 మీటర్ల లోతున్న భూగర్భజలాలు, తాజాగా 2.24 మీటర్లకు పెరిగి 10.1 మీటర్లకు చేరుకున్నాయి. నదుల అనుసంధానం ద్వారా పట్టిసీమ నుంచి ఇప్పటికి 71 టిఎంసీల నీటిని కృష్ణానదికి తీసుకురావడం ద్వారా రైతు పంటలు కాపాడగలిగారు. అనంత జిల్లా సింగనమలైలో వర్షాలతో చరిత్రలో ఎప్పుడూ లేనట్లు చెరువులు నిండాయి. వర్షాలు తక్కువగా ఉండే శ్రీకాకుళంలో కూడా కుంటలు, చెరువులు నిండాయి. ప్రధానంగా శ్రీశైలం డ్యాంలో లక్ష క్యూసెక్కుల నీరు రాగా, దీని ప్రవాహం గురువారానికి లక్షా ఐదువేల క్యూసెక్కులు ఉండవచ్చంటున్నారు. తాజా వర్షాలు, వరదలతో రైతాంగం ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకునేందుకు టిడిపి రంగంలోకి దిగింది. ఈ సందర్భంగా ‘బాబు వస్తే వర్షాలు రావని చెప్పిందెవరం’టూ విపక్షాలపై ఎదురుదాడికి దిగుతోంది. ఆమేరకు బాబు ఫొటోతో వర్షపాతం వివరాలు, ఆ ఫొటోలను వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలకు చేరవేస్తోంది. అందుకు గత నెలరోజుల్లో కురుస్తున్న భారీ వర్షాలు, కాంగ్రెస్ హయాంలో సీమలో ఎప్పుడూ నిండని కుంటలు, చెరువులు, రిజర్వాయర్లను తమ వాదనకు మద్దతుగా చూపిస్తోంది. దశాబ్దాల నుంచి వైఎస్ కుటుంబమే పెత్తనం చేస్తోన్న పులివెందులకూ తామే నీళ్లిచ్చామని, వర్షాలు పడి, రైతులు ఆనందంతో ఉంటే వైసీపీ బాధపడుతోందన్న ఎదురుదాడికి దిగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో నవంబర్ 2 నుంచి వైసీపీ అధినేత జగన్ చేయనున్న పాదయాత్రకు గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం నుంచి పెద్దగా స్పందన లభించదని టిడిపి వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత కొద్దిరోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల ఫలితంగా రైతులు పొలం పనులపైనే దృష్టి సారిస్తున్నారు. జనవరి వరకూ రైతులు పొలం పనులకు తప్ప మిగిలిన వ్యవహారాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరు. అందువల్ల జగన్ పాదయాత్రకు రైతుస్పందన అంతగా ఉండదని టిడిపి వర్గాలు అంచనా వేస్తున్నాయి.

విభజన నష్టాలు గవర్నర్ దృష్టికి

సామర్లకోట, అక్టోబర్ 11: రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లో సుమారు 400 ఎకరాల్లో నిర్మించిన ఆచార్య ఎన్జీ రంగా యూనివర్శిటీ సముదాయంలో అనేక కమ్యూనిటీ నిర్మాణాలు కోల్పోయామని, ఆర్టికల్ 9, 10 ప్రకారం పరిశీలించి న్యాయం చేయమని పలుమార్లు రాష్ట్ర గవర్నర్‌ను కలిసి విన్నవించామని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట విస్తరణ శిక్షణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన భవనాల్లో ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ , సర్వే అకాడమీని బుధవారం ఉప ముఖ్యమంత్రులు కెఇ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా కెఇ మాట్లాడుతూ రాష్ట్ర విభజనవల్ల ప్రభుత్వ భవనాలకు కూడా నష్టం ఏర్పడిందన్నారు. చివరికి ఎన్జీ రంగా యూనివర్శిటీ పేరును కూడా ప్రొఫెసర్ జయశంకర్ వర్శిటీగా మార్పు చేశారన్నారు. 2014 నుండి రాష్ట్ర విభజన సమస్యలతో రాష్ట్రానికి రెవిన్యూ, సర్వే శిక్షణ అకాడమీ లేకుండా పోయిందన్నారు. ఈ కేంద్రం ఏర్పాటుకు అసెంబ్లీలో చర్చించి ప్రత్యేక తీర్మానం చేయించామన్నారు. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సూచనతో సామర్లకోటలో ఈ శిక్షణ కేంద్రంను ఏర్పాటుచేశామన్నారు. అన్నీ కలిసివస్తే ఇక్కడే శాశ్వతంగా అకాడమీ కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హర్షద్వానాల మధ్య ప్రకటించారు. రాష్ట్రంలో నూతనంగా ఎనిమిది ఆర్డీవో కార్యాలయాలకు, 105 తహసీల్దారు కార్యాలయాలకు నూతన భవనాలు మంజూరు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి కృష్ణమూర్తి చెప్పారు. తహసీల్దార్లకు ప్రోటోకాల్ నిధులు కూడా పెంచామని, వారికి వాహనాలు కూడా సమకూర్చామన్నారు.

‘బోధి ధర్మం గురించి
అవగాహన కల్పించాలి’
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 11: అతి పురాతనమైన, చారిత్రాత్మకమైన బోధి ధర్మం గురించి విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. బెంగుళూరుకు చెందిన ఆచార్య రఘు 17 ఏళ్లుగా విస్తృతంగా పరిశోధన చేసి వెలుగులోకి తెచ్చిన ఈ పరంపరకు సంబంధించి ‘బోధి ధర్మ - రీటోల్డ్’ అనే గ్రంధాన్ని వెలగపూడి సచివాలయంలో బుధవారం ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. బోధి ధర్మానికి ఉండే ప్రాశస్త్యాన్ని, చారిత్రక అంశాలను ఆచార్య రఘు ముఖ్యమంత్రికి వివరించారు. 372 ఏడి కాలంలో నివహించిన బోధి ధర్ముడు ఈ ధర్మాన్ని సమాజానికి అందించారని ఆయన తెలిపారు. ఐతే.. భారతదేశంలో కన్నా చైనా, జపాన్ దేశాలలో బోధి ధర్మం విస్తృతంగా వ్యాప్తి చెందిందని వివరించారు. బోధి ధర్ముడు పల్నాడు రాజ్యానికి యువరాజుగా ఉన్నకాలంలోనే ఈ ధర్మాన్ని వెల్లడించారు. ఐతే ఆంధ్రప్రదేశ్‌లో ఈ ధర్మం అంతగా ప్రచార్యం పొందలేదని రఘు ముఖ్యమంత్రికి వివరించారు. బోధిధర్ముడు ప్రవచించిన ‘జెన్ ఆలోచనవిధానాన్ని’ చైనా, జపాన్ అందిపుచ్చుకున్నాయని రఘు తెలిపారు. బౌద్ధ మతానికి పుట్టినిల్లయిన భారతదేశంలో ఇది ఇంకా విస్తృతంగా ప్రాచుర్యం పొందాలని, ముఖ్యంగా రాష్ట్రంలో దీని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

వసతితో పాటు మా సంక్షేమానికి
వంద కోట్లు ఇవ్వండి
సిఎంకు హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ వినతి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 11: అమరావతిలో హైకోర్టు ఏర్పాటు కాబోతున్న నేపథ్యంలో ఇక్కడకు తరలిస్తున్న హైకోర్టు న్యాయవాదులకు వసతితో పాటు అడ్వకేట్ల సంక్షేమ నిధికి రూ.100 కోట్లు కేటాయించాలని ఎపి హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ కోరింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో సిఎం చంద్రబాబు నాయుడిని కలిసి హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందించారు. 2013 నుంచి నేటి వరకు మ్యాచింగ్ గ్రాంట్ చెల్లించడం లేదన్నారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు మ్యాచింగ్ గ్రాంట్ పెంచుతూ, బకాయిలు కూడా చెల్లించాలని ఆ వినతిపత్రంలో హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. తమ సమస్యల పరిష్కారానికి సిఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించినట్లు ఎపి హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు చల్లా ధనుంజయ, కె.జ్యోతి ప్రసాద్, హనుమంతురావు బచ్చన ఆ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపి హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి.ఆనందశేషు, జాయింట్ సెక్రటరీ ఏ రూపేష్‌కుమార్ రెడ్డి, ట్రెజరీ పి.చంద్రశేఖర రెడ్డితో పాటలు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.