ఆంధ్రప్రదేశ్‌

మన్యంలో మళ్లీ మావోల అలజడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సీలేరు, అక్టోబర్ 12: సరిగ్గా సంవత్సరం కిందట అంటే గత ఏడాది అక్టోబర్ 24న ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన రామగుడలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 30 మంది మావోయిస్ట్‌లు హతమయ్యారు. మావోయిస్ట్ అగ్రనేతలే లక్ష్యంగా సాగిన ఈ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్ట్‌లు కోలుకోలేకపోయారు. ఈ ఎన్‌కౌంటర్ తరువాత ఏఓబిలో మావోయిస్ట్‌లు పూర్తిగా లేకుండాపోయారని పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు. వారు చెప్పినట్టే, గత సంవత్సర కాలంగా విశాఖ మన్యంలో మావోయిస్ట్‌ల కదలికలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో విశాఖ ఏజెన్సీపై పోలీసులు గట్టి పట్టు బిగించారు. గిరిజనులను మచ్చిక చేసుకునేందుకు అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. గిరిజనులకు విద్య, వైద్యం, తాగునీరు, పౌష్టికాహారం అందిస్తూ, పోలీసులు వారిని తమవైపుతిప్పుకున్నారు. ఇవన్నీ ఓపక్క సాగుతుండగా బుధవారం రాత్రి మావోయిస్ట్‌లు దారకొండ పిహెచ్‌సి దగ్గర సెల్ టవర్ పేల్చేసిన ఘటన పోలీసు వర్గాల్లో కలవరం సృష్టిస్తోంది. పైపెచ్చు ఈ ఘటనలో గుత్తికోయలు పాల్గొనడం మరింత సంచలనమైంది. ఈ ఘటనను విశే్లషిస్తే, అనేక కొత్త కథనాలు వెలుగు చూస్తున్నాయి.
సెల్ టవర్ పేల్చివేసిన ఘటనలో సుమారు 200 మంది గుత్తికోయలు, మిలీషియా సభ్యులు, సానుభూతిపరులు, మావోయిస్ట్‌లు పాల్గొన్నట్టు తెలుస్తోంది. వీరిలో 30 మంది సాయుధ మావోయిస్ట్‌లని, 30 మంది వరకూ గుత్తికోయలు ఉంటారని డిఎస్పీ అనిల్ పేర్కొనడం గమనార్హం. ఇందులో కొంతమంది నల్లటి కర్రలు పట్టుకుని వచ్చినట్టు స్థానికులు చెపుతున్నారు. మావోయిస్ట్‌ల వెంట వచ్చిన వారిలో 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసువారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ముందుగా మావోయిస్ట్‌లు దారకొండ గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. చింతపల్లి నుంచి ఎటువంటి వాహనాలు ఆవైపుగా రాకుండా గంగవరం జంక్షన్ వద్ద మావోయిస్ట్‌లు సెంట్రీలను ఏర్పాటు చేసి, రహదారిని దిబ్బంధం చేసినట్టు తెలుస్తోంది. మావోయిస్ట్‌లు ఇప్పటికే కొంతమందికి హెచ్చరికలు జారీ చేశారు. వారు తీరు మార్చుకోలేదన్న ఉద్దేశంతో ముందుగా వారిపై దాడికి దిగాలనుకున్నట్టు కథనం. మావోయిస్ట్‌లు బుధవారం విడుదల చేసిన లేఖల్లో వారి పేర్లు పేర్కొనడం గమనార్హం. మావోయిస్ట్‌ల రాక తెలుసుకుని, వారు ముందుగానే పరారైనట్టు విశ్వసనీయ కథనం. ఆ తరువాత దారకొండ పిహెచ్‌సి వద్దకు వచ్చి ఓ గంట వరకూ ఎవ్వరూ బయటకు రావద్దని చుట్టుపక్కల వారిని హెచ్చరించి, బిఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ను పేల్చి వేశారు. టిడిపి నాయకులైన లోకుల గాంధీ, మణికుమారి, నాగరాజు తదితరులు బాక్సైట్ తవ్వకాలపై తమ వైఖరిని తెలియచేయాలంటూ పోస్టర్లు అంటించారు. వాకపల్లి ఘటనపై తమ వైఖరిని తెలియచేయాలంటూ టిడిపి నాయకులను ప్రశ్నిస్తూ పోస్టర్లు అంటించారు. దీన్ని ఒక్కసారి పరిశీలిస్తే, మావోయిస్ట్‌లకు మళ్లీ గిరిజనులు సహకరిస్తున్నట్టు అర్థమవుతోంది. వారి సానుభూతిపరులను మళ్లీ మచ్చిక చేసుకుని, విధ్వంసాలకు పాల్పడేందుకు ప్రణాళిక రచిస్తున్నట్టు స్పష్టమవుతోంది. గత ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్ట్‌ల్లో గాలికొండ దళ నాయకుడు కుడుముల రవి ఉన్నాడు. గాలికొండ దళం నాయకత్వంతోపాటు, దళ సభ్యులను కూడా కోల్పోవడంతో మావోయిస్ట్‌ల కార్యకలా పాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇప్పుడు గాలికొండ దళానికి నవీన్ నాయకత్వం వహిస్తున్నట్టు సమాచారం. చత్తీస్‌గడ్ ప్రాంతంలో ఉండే గుత్తికోయలు చాలా కాలం తరువాత ఏఓబిలో కనిపించారు. ఏదైనా భారీ విధ్వంసానికి వెళ్లాలంటే, మావోయిస్ట్‌లు గుత్తికోయల సహకారం తీసుకుంటారు. గుత్తికోయలకు ఇచ్చిన లక్ష్యాన్ని చేధించడం ఒక్కటే తెలుసు. ఇప్పుడు గాలికొండ దళాన్ని మళ్లీ బలోపేతం చేసుకునేందుకు గుత్తికోయల సహకారం తీసుకుంటున్నారని తెలుస్తోంది.కాగా, బుధవారం పేల్చేసిన సెల్‌టవర్ వలన తమ కదలికలను పోలీసులు కనుగొంటున్నారని మావోయిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు. ఈ సెల్‌టవర్ ఆధారంగా దారకొండలో పోలీస్ ఔట్‌పోస్ట్ నిర్మించడానికి పోలీస్ అధికారులు కార్యాచరణ మొదలుపెట్టారు. దారకొండ-గుమ్మిరేవుల మధ్య రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సెల్‌టవర్, రోడ్డు ఉంటే తమ ఉనికికే నష్టం వాటిల్లుతుందని భావించిన మావోలు సెల్ టవర్‌ను ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. బుధవారం నాడు సెల్‌టవర్ పేల్చడానికి వచ్చిన మావోయిస్ట్‌లు రోడ్ కాంట్రాక్టర్‌ను, అక్కడి సిబ్బందిని కూడా రమ్మనమని హెచ్చరించినట్టు తెలుస్తోంది. వీటన్నింటినీ విశే్లషిస్తే, మావోయిస్ట్‌లు మళ్లీ విశాఖ మన్యంపై మళ్లీ పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పక తప్పదు. ఈ ఘటనలు పోలీసులు ఏవిధంగా తీసుకుంటారో కానీ, మావోయిస్ట్‌లు ఇకలేరన్న సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో జనాలతో వచ్చి ఒక ఘటనకు పాల్పడడాన్ని పోలీసులు విశే్లషించకుండా ఉంటారా?.