ఆంధ్రప్రదేశ్‌

జల విద్యుత్ ఉత్పత్తి దిశగా అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 18: బహుళార్ధ సాధక ప్రాజెక్టు పోలవరం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. పవర్ హౌస్ నిర్మాణ ప్రక్రియ మట్టి పనుల దశ నుంచి, పునాది పనుల దశకు చేరుకుంటోంది. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం అంగుళూరు గ్రామం వద్ద పోలవరం ప్రాజెక్టు పవర్ హౌస్ నిర్మాణం జరగనుంది. పవర్ హౌస్ నిర్మాణ పనులు ఎపి జెన్కో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది.
ఇందుకు సంబంధించి ఇప్పటికే పిలిచిన గ్లోబల్ టెండర్ల ప్రక్రియ ఈ నెలాఖరుతో పూర్తయి నిర్మాణ సంస్థకు పనులు అప్పగించనున్నారు. టెండర్ల టెక్నికల్ బిడ్‌లో అతి తక్కువకు కోట్‌చేసి, ఎల్-1గా నిలిచిన నవయుగ సంస్థకు నిర్మాణ కాంట్రాక్టు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. రూ.5000 కోట్ల అంచనాతో పనులు చేపట్టడానికి ఎపి జెన్కో టెండర్లు పిలవగా నవయుగ సంస్థ రూ.3,657.21 కోట్లతో నిర్మించడానికి ముందుకొచ్చింది. టెండర్ల టెక్నికల్ బిడ్‌లో నవయువ, మేఘా, టాటా పవర్ సంస్థలు అర్హత సాధించి ప్రైస్ బిడ్‌లో నిలిచాయి. ఇందులో నవయుగ సంస్థ సివిల్ పనుల్లో దిట్ట. ఆల్‌స్ట్రామ్ ఎలక్ట్రికల్స్ కంపెనీతో కలసి పోలవరం పవర్ హౌస్‌ను నిర్మించనుంది. అదేవిధంగా మేఘా సంస్థ బిహెచ్‌సిఎల్‌తో కలిసి, టాటా పవర్ సంస్థలు పనులు చేపట్టడానికి ముందుకు వచ్చాయి. టెండర్లలో నవయుగ సంస్థ రూ.3,657.21 కోట్లతో నిర్మించడానికి బిడ్ దాఖలుచేస్తే, మేఘా ఇంజనీరింగ్ సంస్థ రూ.4,119.6 కోట్లు, టాటా పవర్ సంస్థ రూ.4,303 కోట్లతో నిర్మించడానికి ముందుకొచ్చాయి. అయితే ఇందులో తక్కువకు కోట్ చేసిన నవయుగకే పోలవరం విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులుదక్కినట్టే. ఎపి జెన్కో దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సివుంది. ఈ నెలాఖరుకు ఈ నిర్ణయం ఖరారు కానుందని తెలుస్తోంది.
పనులు నవంబర్ నెలాఖరులో మొదలు పెట్టేందుకు ఇప్పటికే నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది. మట్టి పనులు నవంబర్ నెలాఖరుకు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనావేస్తున్నారు.
పోలవరం పవర్‌హౌస్‌లో మొత్తం 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తారు. ఒక్కోటి 80 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 12 టర్బైన్లతో 12 యూనిట్లు నిర్మిస్తారు. కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ మొదటి 40 నెలల్లో మూడు యూనిట్ల నిర్మాణం పూర్తిచేయాల్సి వుంది. తర్వాత దశలో మిగిలిన తొమ్మిది యూనిట్లను రెండు నెలలకు ఒక్కోటి చొప్పున నిర్మించే విధంగా ఎపి జెన్కో టెండరు నియమ నిబంధనల్లో పొందుపర్చింది.
అయితే పోలవరం పవర్‌హౌస్‌లో మట్టి పనులు బాగా ఆలస్యమయ్యాయి. డ్యాం ప్యాకేజీలో నిర్వహిస్తోన్న మట్టి తవ్వకం పనులు పూర్తయిన వెంటనే సివిల్ పనులు చేపట్టనున్నారు. పవర్ హౌస్‌కు సంబంధించి మొత్తం 1.18 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాల్సివుంది. ఇప్పటికి 80 శాతం మట్టి తవ్వకం పూర్తయింది. ప్రధానంగా కొండను తొలగించాల్సి వుంది. ఈ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పోలవరం ప్రాజెక్టు ద్వారా నీరు తీసుకుని విద్యుత్ ఉత్పత్తి అనంతరం గోదావరి నదిలోకి (కాటన్ బ్యారేజి వైపు) నీరు విడిచిపెడతారు. దీనివల్ల పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచే కాకుండా విద్యుత్ కేంద్రం నుంచి కూడా నిరంతరం నీరు కాటన్ బ్యారేజికి చేరుతుంది. ఈ విద్యుత్ ప్రాజెక్టు పూర్తయితే ఎపికి అతి తక్కువ ధరకే విద్యుత్ లభ్యమవ్వడంతో పాటు రాష్ట్రానికే తలమానికంగా నిలవనుంది.