ఆంధ్రప్రదేశ్‌

కన్నతండ్రే కాలయముడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రపురం, అక్టోబర్ 20: రామచంద్రపురం పట్టణంలో సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ నేత నందుల సూర్యనారాయణ అలియాస్ రాజు కుమార్తె జయదీపిక హత్య కేసులో తండ్రే హంతకుడని పోలీసులు నిర్ధారించారు. ఈ నెల 16వ తేదీ రాత్రి చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనలో తన కుమారుడే ఈ హత్యచేసి ఉండవచ్చని రాజు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. అయితే పోలీసులు జరిపిన దర్యాప్తులో ఇది అవాస్తవమని, ఫిర్యాదుచేసిన రాజు ఈ హత్యకు పాల్పడినట్టు వెలుగుచూసింది. రామచంద్రపురం డిఎస్పీ జయంతి వాసవీ సంతోష్ శుక్రవారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇంజనీరింగ్ విద్యార్థిని అయిన జయదీపిక అదే సామాజికవర్గానికి చెందిన కూనపరెడ్డి మణికంఠ అనే మణితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన ఆమె సోదరుడు జయప్రకాష్ నాయుడు (నాని) తండ్రి రాజుకు తెలిపాడు. దీనితో మణికంఠతో సన్నిహితంగా ఉండవద్దని జయదీపికను రాజు హెచ్చరించాడు. అయితే ఈహెచ్చరికలను ఖాతరుచేయని ఆమె మణికంఠతో మరింత సన్నిహితంగా మెలగడం ప్రారంభించింది. కాగా ఈ నెల 16వ తేదీ రాత్రి రాజు ఈ అంశంపై కుమార్తెను మందలించాడు. అయితే ఆమె తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆవేశానికి లోనైన రాజు పక్కనే ఉన్న చెక్క పీటతో ఆమె తలపై కొట్టాడు. దీంతో జయదీపిక తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించిన సమయంలో అప్పటికే మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారని డిఎస్పీ సంతోష్ వివరించారు. అయితే జయదీపిక హత్యలో తన కుమారుడు జయప్రకాష్ నాయుడుపై రాజు అనుమానం వ్యక్తంచేశాడు. ఆ కోణంలో దర్యాప్తు జరపగా, హత్య జరిగిన సమయంలో నాయుడు తన సొంత బార్ అండ్ రెస్టారెంట్‌లో ఉన్నట్టు స్పష్టమయ్యిందన్నారు. దీనితో మరింత లోతుగా జరిపిన దర్యాప్తులో తండ్రి రాజు హంతకుడని తేలిందన్నారు. తానే హత్యకు పాల్పడినట్లు రాజుకూడా అంగీకరించడాన్నారు. నిందితుడు నందుల సూర్యనారాయణ అలియాస్ రాజును అదుపులోకి తీసుకున్నామన్నారు. సమావేశంలో పలువురు విలేఖరులు నందుల రాజు గతంలో సమీప బంధువులు ఇరువురిని హత్య చేసినట్లు ఆరోపణలున్నాయని ప్రస్తావించగా ఇంతవరకు ఆ విషయం తమ దృష్టికి రాలేదని, ఎవరైనా ఫిర్యాదుచేస్తే ఆ అంశంపై కూడా దర్యాప్తు చేపడతామని డిఎస్పీ సంతోష్ స్పష్టంచేశారు. ఈ హత్యకు ఆస్తి వివాదం కూడా కారణంగా ఉందా అని విలేఖరులు ప్రశ్నించగా, తమ దర్యాప్తులో కేవలం ప్రేమ వ్యవహారమే కారణమని తేలిందన్నారు. విలేఖరుల సమావేశంలో రామచంద్రపురం సిఐ కొమ్ముల శ్రీ్ధర్‌కుమార్ పాల్గొన్నారు.
తప్పుచేసిన వారికి శిక్ష తప్పదు: ఎమ్మెల్యే తోట
తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షకు గురికావాల్సిందేనని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు స్పష్టంచేశారు. ఈ కేసులో టిడిపి పట్టణ అధ్యక్షుడు నందుల రాజు నిందితునిగా పోలీసులు గుర్తించిన నేపథ్యంలవో శుక్రవారం సాయంత్రం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. నందుల జయదీపిక హత్య కేసు దర్యాప్తును నిష్పాక్షికంగా జరిపి, అసలు నిందితులను గుర్తించి, శిక్షించాలని పోలీసులను తాను కోరానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మీడియాలో విభిన్న కథనాల నేపథ్యంలో కేసు దర్యాప్తు ముమ్మరంచేసి, మిస్టరీని చేధించాలని పోలీసు అధికారులను తాను కోరానన్నారు. ఈ కేసులో నిందితునిగా తేలిన పట్టణ టిడిపి అధ్యక్షుడు నందుల సూర్యనారాయణ అనే రాజు పార్టీకి రాజీనామాచేశారని, రాజీనామాను వెంటనే ఆమోదించాలని పార్టీ నాయకులకు కోరానని, ఆ మేరకు ఆమోదించారని ఎమ్మెల్యే త్రిమూర్తులు స్పష్టం చేశారు.
చిత్రం..కేసు వివరాలు చెబుతున్న డిఎస్పీ జయంతి వాసవీ సంతోష్