ఆంధ్రప్రదేశ్‌

హామీలు నెరవేర్చని బాబుపై పోలీసు స్టేషన్లలో కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను గత రెండేళ్లలో నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఆయనపై జూన్ 2వ తేదీన రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లలో చీటింగ్ కేసు నమోదు చేయనున్నట్లు వైకాపా ప్రకటించింది. ఆ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, జి.శ్రీకాంతరెడ్డి శనివారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ, చంద్రబాబు దుష్ట పరిపాలన సాగిస్తూ మాయమాటలతో రాష్ట్ర ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇందుకు నిరసనగా మండలాలు, నియోజకవర్గాల వారీగా ప్రదర్శనలు నిర్వహించి సభలు ఏర్పాటు చేస్తామన్నారు.
అన్ని పోలీసు స్టేషన్లలో చంద్రబాబుపై చీటింగ్ కేసును నమోదు చేస్తామని వారు చెప్పారు. చంద్రబాబు పంచభూతాలను కూడా వదిలిపెట్టడం లేదని, రైతులకు రుణాలను మాఫీ చేస్తామని, బాబు వస్తే జాబు వస్తుందని, యువతకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని, ఆంధ్రాకు ప్రత్యేక హోదా తెస్తానని, డ్వాక్రా మహిళా సంఘాలకు రుణాలు మాఫీ చేస్తామని హామీలిచ్చిన చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టాక అందరినీ మోసగించాడని వారు నిప్పులు చెరిగారు. అమరావతిలో అమరేశ్వరస్వామి దేవాలయ భూముల కొనుగోళ్లపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ భూముల క్రమ విక్రయాలను వెంటనే రద్దు చేయాలన్నారు. దేవుడి మాన్యాలను కూడా టిడిపి నేతలు వదిలిపెట్టకుండా దోచుకుంటున్నారన్నారు. ఇసుక మాఫియాను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందన్నారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో చెప్పుకునేందుకు ఏమీ లేదని, విదేశీ పర్యటనలతో ఆయన ప్రభుత్వ నిధులను దుబారా చేయడం ఖజనాకు భారంగా మారారన్నారు. హైదరాబాద్‌లో విలాసవంతమైన హోటల్‌కు బసను మార్చుకున్న చంద్రబాబు గత రెండేళ్లలో మూడు ఇళ్లను మార్చి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారన్నారు. విద్యార్థులకు ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌ను మెల్లగా అటకెక్కిస్తున్నారని, ఆరోగ్య శ్రీ అమలు కావడం లేదని, సంక్షేమ పథకాలకు తగిన నిధులు లేవన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించి కాంట్రాక్టర్లకు అదనంగా 22 శాతం నిధులను దోచిపెట్టారని, పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయన్నారు. కృష్ణా నదిపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను నిర్మిస్తుంటే చంద్రబాబు పట్టించుకోకుండా నోరు మూసుకుని కూర్చున్నారని, దీని వలన ఏపిలో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు రైతులు ఆందోళనకు గురవుతున్నారని వైకాపా నేతలు పేర్కొన్నారు.