ఆంధ్రప్రదేశ్‌

నలిగిన ‘నాలుగు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: నాలుగో అభ్యర్థి బరిలో ఉంటారా? లేరా? ఒకవేళ ఉంటే క్యాంపుల్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలతో ఎలా ఓట్లు వేయిస్తారు? ఇదీ మంగళవారం ఉదయం వరకూ టిడిపి, వైసీపీ నేతలను ఉత్కంఠ పరిచిన అంశం. రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్థి పోటీపై టిడిపి నాయకత్వం సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకూ ఉత్కంఠను కొనసాగించి, చివరకు ముగ్గురితోనే కథ ముగించింది.
వైసీపీ అభ్యర్ధి విజయసాయిరెడ్డిని ఎట్టి పరిస్థితిలోనూ రాజ్యసభకు పంపకూడదని గత కొంతకాలం నుంచి వ్యూహరచన చేస్తున్న టిడిపి నాయకత్వం ఆఖరి నిమిషం వరకూ దాని సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేసింది. ఆ మేరకు నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ నేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని నామినేషన్లతో సిద్ధం చేసింది.
వేమిరెడ్డి కూడా అన్నీ సిద్ధం చేసుకుని బాబు గ్రీన్‌సిగ్నల్ కోసం వేచి చూశారు. అయితే, మంగళవారం నామినేషన్ల సందర్భంగా టిడిపి నుంచి సుజనా చౌదరి, టిజి వెంకటేష్ మాత్రమే నామినేషన్లు దాఖలు చేయటంతో నాలుగో అభ్యర్థి బరిలో ఉండబోవడం లేదని తేలిపోయింది.
అంతకుముందు.. సోమవారం అర్ధరాత్రి వరకూ నాలుగో అభ్యర్థిని పోటీలో దించే విషయమై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీ సీనియర్లు, వైసీపీ నుంచి చేరిన ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా కసరత్తు చేశారు. నాలుగో అభ్యర్థి గెలవాలంటే మరో 17 మంది అవసరం ఉందని లెక్క తేల్చారు. వైసీపీ ఎమ్మెల్యేలంతా దాదాపు క్యాంపులకు వెళ్లిపోయి, సెల్‌ఫోన్లు కూడా స్విచ్ఛ్ఫా చేసుకోవడంతో ఇప్పటికిప్పుడు వారితో ఓట్లు వేయించడం సాధ్యమా? అన్న చర్చ జరిగింది.
అయితే, వారితో తాము ఓట్లు వేయిస్తామని, అంతకుముందే తాము వారితో మాట్లాడి ఒప్పించడం జరిగిందని టిడిపిలో చేరిన వైసీపీ నేతలు బాబుకు చెప్పారు. భూమా నాగిరెడ్డి, జలీల్‌ఖాన్, సుజయకృష్ణరంగారావు వంటి ఎమ్మెల్యేలంతా పోటీ పెడితే కచ్చితంగా గెలుస్తామని, విజయసాయిరెడ్డి ఎంపిక ఆ పార్టీ ఎమ్మెల్యేలకే ఇష్టం లేదని బాబును ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే బాబు మాత్రం మరోసారి చర్చించి నిర్ణయిద్దామని చెప్పి, వారిని పంపించారు.
ఆ తర్వాత బాబు పార్టీ సీనియర్లతో భేటీ అయ్యారు. వారిలో ఎక్కువ మంది నాలుగో అభ్యర్థిని పోటీలో ఉంచటాన్ని వ్యతిరేకించినట్లు సమాచారం. కావలసిన సంఖ్య రాక ఓడిపోతే అప్రతిష్ఠపాలవుతామని, అదీగాక, ఇటీవల జరిగిన తెలంగాణ కౌన్సిల్ ఎన్నికలు, అంతకుముందు వైఎస్ ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో అదనపు అభ్యర్థిని నిలబెట్టినప్పుడు, తామ ఆ విధానాన్ని వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రత్యర్థి పార్టీలు దానిని ప్రశ్నిస్తే, పార్టీకి ఉన్న మంచిపేరు పోతుందని బాబుకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అదీగాక, విజయసాయిరెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేల ఆర్థిక అవసరాలు తీర్చారని, ఎమ్మెల్యేలు కూడా ఆ మేరకు ఆయనకు మాట ఇచ్చినందున, నాలుగవ అభ్యర్థి గెలవడం కష్టమని అభిప్రాయపడ్డారు. పోటీ పెట్టకపోతే హుందాగా ఉంటుదని సూచించారు. దానితో అంగీకరించిన బాబు, మీ ఇష్టం. మీరు చెప్పేది బాగానే ఉందని చెప్పి, రేపు ఉదయం నిర్ణయం తీసుకుందామన్నట్లు సమాచారం.
అయితే, మంగళవారం నామినేషన్లు ముగిసే చివరి నిమిషం వరకూ నాలుగో అభ్యర్థి పోటీపై, టిడిపి నాయకత్వం వ్యూహాత్మకంగానే ఉత్కంఠను కొనసాగించి, వైసీపీలో ఆందోళన పెంచింది. నామినేషన్ల సమయం గడువు ముగిసి, నాలుగో అభ్యర్థి ఎవరూ నామినేషన్ వేయలేదని తెలియడంతో వైసీపీ నేతల్లో ఆందోళన పోయింది.
ఇదిలాఉండగా, నాలుగో అభ్యర్థిగా వేమిరెడ్డిని బరిలోకి దింపక పోవడానికి మరికొన్ని కారణాలున్నాయని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. ‘వేమిరెడ్డి కోసం మేం ఇంత కష్టపడినా, రేపు ఆయన గెలిచి మళ్లీ విధేయత మార్చరన్న గ్యారంటీ ఏమిటి? అప్పుడు పార్టీ ఇంకా అప్రతిష్ఠపాలవుతుంది. ఒక వ్యక్తికోసం ఇంత రిస్కు తీసుకోవలసిన పనిలేదు.’ అని ఆ సీనియర్ నేత విశే్లషించారు.

చిత్రం నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న టిడిపి అభ్యర్థి సుజనా చౌదరి