ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ.. ‘టార్గెట్ పులివెందుల’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 16: వైసీపీ అధినేత జగన్‌ను సొంత నియోజకవర్గంలో దెబ్బతీసేందుకు తెలుగుదేశం పార్టీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. దశాబ్దాల నుంచి తిరుగులేకుండా గెలుస్తూ వస్తోన్న వైఎస్ కుటుంబ విజయపరంపరకు ఇటీవల జరిగిన కడప జిల్లా కౌన్సిల్ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించటం ద్వారా నైతికస్థైర్యం సాధించిన టీడీపీ ఇప్పుడు పులివెందుల అసెంబ్లీ సీటుపై కనే్నసింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ కుటుంబాన్ని ఓడించేందుకు ఉన్న మార్గాలను ఎంచుకున్న టీడీపీ నాయకత్వం, ఆ మేరకు తనదగ్గర ఉన్న ప్రణాళికను కడప జిల్లా నేతలకు అందించింది. ఇటీవలి కాలంలో వరసగా జరుగుతున్న సమన్వయ కమిటీ, వ్యూహకమిటీ సమావేశాల్లో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పులివెందులపై తరచూ మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ విజయం సాధిస్తేనే మీ పనితనమేమిటో బయటపడుతుందని చురకలు వేస్తూ వస్తున్నారు. గత కౌన్సిల్ ఎన్నికల్లో జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డిని ఓడించేందుకు కలసి పనిచేసిన స్ఫూర్తినే, జగన్ విషయంలోనూ పాటించాలని బాబు ఆదేశించారు. దానితోపాటు, వారికి ఓ ప్రణాళికాబద్ధమైన కార్యక్రమాల జాబితా కూడా అందించారు. దానిని నేతలు ఏవిధంగా అమలుచేస్తున్నారో తాను ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని హెచ్చరించారు. చాలాకాలం నుంచి కడప జిల్లా నేతలు, ముఖ్యంగా పులివెందుల నేతలు అడిగిన ప్రతి పనీ చేస్తున్నా అక్కడ ఫలితాలు రావడం లేదని బాబు, లోకేష్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో, పార్టీ ఇచ్చిన ప్రణాళికను అమలుచేస్తామని బాబుకు నేతలు హామీ ఇచ్చారు. వైఎస్ సీఎంగా ఆరేళ్లు పనిచేసినప్పటికీ పులివెందుల ఏరియా ఆసుపత్రిలో సీటీ స్కానింగ్ ఇవ్వని విషయాన్ని గుర్తించిన బాబు, దానిని మంజూరు చేశారు. దానివల్ల రెండు నియోజకవర్గాలకు ప్రయోజనం జరుగుతున్నందున, అదే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఆ ప్రణాళిక ప్రకారం.. పులివెందుల నియోజకవర్గానికి చరిత్రలో తొలిసారి కృష్ణా జలాలు ఇస్తుండటంతో ఆనందంగా ఉన్న రైతాంగం వద్దకు టీడీపీ నేతలు వెళ్లనున్నారు. దశాబ్దాల నుంచి పులివెందులను వైఎస్ కుటుంబానికి అప్పగిస్తున్నా, నీరు తెప్పించలేకపోయిన వైనాన్ని గ్రామాల్లో పర్యటించి రైతులకు వివరించనున్నారు. చిత్రావతి, పైడిపాలెం రిజర్వాయర్ల పరిధిలోని రైతులకే దీనివల్ల ఎక్కువ ప్రయోజనం చేకూరుత్నునందున వారిపైనే ఎక్కువ దృష్టి సారించనున్నారు. కాగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చిత్రావతి రిజర్వాయరుకు గండికోట నీటి పంపిణీని ఒక ఉత్సవంగా నిర్వహించేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. దానికి చంద్రబాబును ఆహ్వానించడంతోపాటు, అన్ని మండలాల ప్రజలను సమీకరించి భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. ఆ సందర్భంగా పులివెందులను పసుపుతోరణంగా మార్చనున్నారు. ప్రతి గ్రామంలో సభలు నిర్వహించి, కృష్ణానీటి జలాలను గుర్తు చేయడంతోపాటు, ఆ నీటిని ఇవ్వడంలో వైఎస్ కుటుంబ వైఫల్యాన్ని ప్రస్తావించడం ద్వారా జగన్ బలాన్ని నిర్వీర్యం చేయడమే టీడీపీ నాయకత్వ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. చిత్రావతి రిజర్వాయరుకు గండికోట నీటి పంపిణీని చరిత్రలో అద్భుతంగా అభివర్ణిస్తూ, ప్రతి గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. దానితోపాటు పులివెందులకు వైఎస్ చేసిన కార్యక్రమాలు, బాబు హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు, సినిమా హాళ్లలో స్లైడ్లతో తటస్థులను ఆకర్షించే ప్రయోగం చేయనుంది. ముఖ్యంగా కృష్ణా నీటి వల్ల లబ్ధిపొందుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఏ పార్టీకి చెందని తటస్థులు, గ్రామ ప్రముఖులను పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. చిత్రావతి రిజర్వాయరు నీటి పంపిణీ కార్యక్రమం సందర్భంగా, ఏర్పాటుచేసే బహిరంగసభలో అలాంటి తటస్థులను బాబు సమక్షంలో పార్టీలో చేర్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.