ఆంధ్రప్రదేశ్‌

బాబుకు అందని తెలుగు సభల ప్రారంభ ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 13: హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈనెల 15 నుంచి నిర్వహిస్తోన్న ప్రపంచ తెలుగు మహాసభలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆకర్షిస్తున్నాయి. ఆ సభల విజయవంతం కోసం భాషాభిమాని అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్వయంగా సమీక్షలు నిర్వహిస్తూ, తెలుగు భాషకు పట్టం కట్టిన కవులు, రచయితల పేర్లను వివిధ ప్రాంగణాలకు పెట్టడంలో వ్యక్తిగత శ్రద్ధ వహిస్తున్నారు. లాల్ బహుదూర్ స్టేడియంలో నిర్వహించే ఈ మహాసభలకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, తెలుగుభాషా పిపాసులు హాజరుకానున్నారు. అయితే, మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రారంభ వేడుకకు ఆహ్వానిస్తారా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల మంత్రి కడియం శ్రీహరి విలేఖరులతో మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడునూ ఆహ్వానిస్తామని వెల్లడించారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రపంచ తెలుగు మహాసభల తొలిరోజు వేడుక ప్రారంభోత్సవ ఆహ్వానపత్రికలో మాత్రం, ఎక్కడా చంద్రబాబునాయుడు పేరు కనిపించకపోవడం చర్చనీయాంశమయింది. ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, విశిష్ట అతిథులుగా గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు, సభాధ్యక్షులుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యవహరిస్తారని అందులో పేర్కొన్నారు. ఇటు ఏపీ సీఎంఓ అధికారులు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకెలాంటి ఆహ్వానం రాలేదని చెప్పారు. దీన్నిబట్టి, ఏపీ సీఎం చంద్రబాబుకు మహాసభల తొలిరోజు పండుగకు ఆహ్వానం లేదని స్పష్టమవుతోంది. కాగా, మహాసభల తొలిరోజు వేడుకకు బాబునూ ఆహ్వానించాలని తొలుత భావించినప్పటికీ, తర్వాత ప్రభుత్వం మనసు మార్చుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ముఖ్యుడొకరు వెల్లడించారు. ‘తొలిరోజు వేడుకకు పిలవాలని ముందు అనుకున్నమాట నిజమే. ఆ మేరకు చర్చ జరిగింది. తర్వాత ఎందుకో వద్దనుకున్నార’ని చెప్పారు. రెండు వారాల క్రితం హైదరాబాద్ మెట్రోరైల్ ప్రారంభోత్సవానికీ బాబుకు ఆహ్వానంపైనా చర్చ జరిగిన విషయం తెలిసిందే. చివరకు ఆయనకు ఆహ్వానం పంపించకుండా, ప్రధానికే పరిమితం చేశారు. మెట్రోతో ఏపీకి సంబంధం లేనందున, ఏపీ సీఎంను ఆహ్వానించనవసరం లేదని నిర్ణయించారు. దానికితోడు బాబు హాజరైతే, మెట్రోకు తన హయాంలోనే అనుమతులు వచ్చాయని చెబితే అది మరొక రకమైన సంకేతాలకు దారితీసే అవకాశాలున్నందున, అసలు ఆహ్వానించకపోవడమే మంచిదని భావించారు. ఇదిలాఉండగా, గత కొద్ది కాలం నుంచీ ఏపీకి చెందిన టీడీపీ నేతలు, మంత్రులు తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు హాజరుకావాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. అటు టీఆర్‌ఎస్ ఎంపీలు, మంత్రులు కూడా విజయవాడ వచ్చి తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు హాజరుకావాలని బాబును ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఎంపి వివేక్ విజయవాడ వచ్చి బాబుకు పెళ్లికార్డులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ప్రకారంగా ఇద్దరూ వివాహ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత తనయుడి పెళ్లికి కేసీఆర్ హాజరుకావడమే కాకుండా, దివంగత నేత పరిటాల సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ను పక్కకుతీసుకువెళ్లి ఏకాంతంగా మాట్లాడిన వైనం రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది. తర్వాత పయ్యావుల కేశవ్ తన ఇంట్లో జరిగిన పెళ్లి వేడుకకు హాజరుకావాలని కోరుతూ కేసీఆర్‌ను స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఓటుకునోటు కేసు పరిణామాలు చల్లబడిన తర్వాత, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత నెలకొంది. సమస్యలు చాలావరకూ పరిష్కారమయి, సుహృద్భావ వాతావరణం ఏర్పడింది. తర్వాత అమరావతి నగర శంకుస్థాపనకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించడంతో ఆయన హాజరయి, అమరావతి నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. బాబు కూడా కేసీఆర్‌ను సాదరంగా ఆహ్వానించి, వీడ్కోలు పలికారు. ఆ తర్వాత కొద్దినెలలకు కేసీఆర్ స్వయంగా చంద్రబాబునాయుడు నివాసానికి వచ్చి, తాను నిర్వహించనున్న యాగానికి హాజరుకావాలని కోరారు. అక్కడి నుంచీ ఇద్దరు ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు సజావుగానే సాగుతున్నాయి. అటు ఏపీ, తెలంగాణ టీడీపీ నేతలు కేసీఆర్‌తో పాటు, టీఆర్‌ఎస్ నేతలతో తమకున్న పాత బంధంతో ఇప్పటికీ వ్యక్తిగత సంబంధాలు నెరుపుతున్నారు. కానీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబును మాత్రం ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాలకు కేసీఆర్ ప్రభుత్వం ఆహ్వానించకపోవడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ముగింపు వేడుకకు ఆహ్వానం?
ఇదిలాఉండగా, మహాసభల ముగింపు వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయించినట్లు సమాచారం. ‘ఏపీ సీఎం గారు ముగింపు సభలకు హాజరుకావచ్చు. ఇప్పటికి ఉన్న సమాచారం ఇదీ’ అని తెలంగాణ ప్రభుత్వ ముఖ్య అధికారి ఒకరు సూచనప్రాయంగా చెప్పారు.
ఆరోజు భారత రాష్టప్రతి కూడా హాజరయ్యే అవకాశం ఉన్నందున, కేసీఆర్-బాబు కలసి ఆయనను ఆహ్వానించే అవకాశం ఉంది. అంటే చివరిరోజు కొసమెరుపు చంద్రబాబునాయుడేనన్నమాట!