రాష్ట్రీయం

నోరుజారి.. ఇరుకునపడి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: సమస్యలను కూడా అవకాశంగా తీసుకుని ముందుకు వెళ్లే అధినేత ఆలోచనా శక్తి రానురాను మందగిస్తోందా? సమస్యలను పరిష్కరించుకోవలసిన కాలంలో అధినాయకత్వం కొత్త సమస్యలు సృష్టించుకుంటోందా? సాక్షి చానెల్ ప్రసారాలను తామే నిలిపివేయించామన్న మంత్రుల ప్రకటనపై తెలుగుదేశం నేతల అభిప్రాయమిది.
తెలుగుదేశం పార్టీకి-మీడియాకు ఉన్న అనుబంధం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. మీడియాకు దగ్గరగా ఉంటూ, స్నేహపూర్వక వైఖరి ప్రదర్శించే టిడిపి నాయకత్వం, ఇటీవలి కాలంలో పక్క రాష్ట్రాల నుంచి అరువు ఆలోచనలు తెచ్చుకుని, కోరి తలనొప్పులు తెచ్చిపెట్టుకుంటోందన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తాజాగా ముద్రగడ దీక్ష నేపథ్యంలో దానికి సంబంధించి వైసీపీ అధినేత జగన్‌కు చెందిన సాక్షి చానెల్ ప్రసారాలను నిలిపివేయడం చర్చనీయాంశమైంది. దీనిని జగన్ కూడా ఖండించారు. వైఎస్ హయాంలో కొన్ని పత్రికలు, చానెళ్లు తమకు వ్యతిరేకంగా రాసినా, ఈ విధంగా ఎప్పుడూ వ్యవహరించలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వమే ప్రసారాలు నిలిపివేయడం దారుణమని జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అయితే, ప్రసారాల నిలిపివేతకు తమకు సంబంధం లేదని, అది ఎంఎస్‌ఓలు తీసుకునే నిర్ణయాలని తమ పార్టీ నేతలు ఖండిస్తారని ఆశించిన పార్టీ వర్గాలకు.. మంత్రులు చినరాజప్ప, గంటా చేసిన ప్రకటన విస్మయం కలిగించింది. ముద్రగడ దీక్ష నేపథ్యంలో, శాంతిభద్రతలు అదుపుతప్పే ప్రమాదం ఉందని, కావాలని రెచ్చగొడుతున్నందుకే ఆ చానెల్ ప్రసారాలు నిలిపివేశామని, ముద్రగడ దీక్ష ముగిసే వరకూ నిలిపివేత కొనసాగుతుందని మీడియా ముఖంగానే చెప్పడంతో తమంత తాముగా అధికార పార్టీని, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. ఈ విషయంలో తమ పార్టీ వ్యూహాత్మక తప్పిదం చేసిందని పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో కనీసం కేసీఆర్‌ను చూసి కూడా పాఠాలు నేర్చుకోకపోతే ఎలా అని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో ఏబీఎన్, టీవీ 9 చానెళ్లను నిషేధించిన సమయంలో టిడిపి ఆందోళనలు నిర్వహించింది. పత్రికాస్వేచ్ఛను కేసీఆర్ మంటకలుపుతున్నారంటూ ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ నేతలు దుయ్యబట్టారు. అయితే, వాటితో తమకు సంబంధం లేదని, అది ఎంఎస్‌ఓలు తీసుకున్న నిర్ణయమని, దానికి తామెలా కారణమవుతామని తెలంగాణ మంత్రులు ఎదురుదాడి చేసిన విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.
ఇప్పుడు సాక్షి చానెల్ వ్యవహారంలో తమ పార్టీ నాయకత్వం కూడా అదే విధానం అనుసరిస్తుందని ఆశించామని, అయితే అందుకు విరుద్ధంగా తామే నిలిపివేయించామని చెప్పడం, తమను ప్రజల ముందు ముద్దాయిగా నిలబెట్టినట్టయిందని వారు వాపోతున్నారు. తాము కూడా కేసీఆర్ బాటలో పయనిస్తే సరిపోయేదని, అలా కాకుండా తామే నిలిపివేశామంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను ఖండించే హక్కు తమకు ఎలా ఉంటుందని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
తాజా పరిణామాలు ప్రతిపక్షాలకు కొత్త అస్త్రాలు ఇచ్చేవేనని దేశం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ దీక్ష ముగిసేవరకూ, ప్రసారాల నిలిపివేత కొనసాగుతుందన్న హోంమంత్రి ప్రకటనపై కోర్టుకు వెళితే, తమకు ప్రతికూలత తప్పదంటున్నారు. ప్రతిదానిని నిశితంగా పరిశీలించే టిడిపి అధినేత, ఇలాంటి సున్నిత అంశంలో ఎందుకు తప్పులో కాలేశారో అర్థం కావడం లేదని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో రెండు చానెళ్ల ప్రసారాల నిషేధాన్ని తూర్పారపట్టిన తాము, ఆంధ్రలో అదే పనిచేస్తే ప్రజల్లో గౌరవం ఎలా ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.