ఆంధ్రప్రదేశ్‌

ఏపీ జేఏసీ ధర్మయుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 12: నూతన పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఉద్యోగుల సంఘం, ఏపీ జేఏసీ అమరావతి, ఉపాధ్యాయ సంఘాల జేఏసీల పిలుపు మేరకు ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు పెద్ద సంఖ్యలో నిరసన వెళ్లగక్కుతూ కదం తొక్కారు. ధర్మయుద్ధం పేరిట గొల్లపూడిలోని రాష్ట్ర ఖజానా శాఖ డైరక్టర్ కార్యాలయం, అలాగే 13 జిల్లాల ట్రెజరీ కార్యాలయాల ఎదుట పెద్దఎత్తున ధర్నాలు నిర్వహించి ఆయా కార్యాలయాలను ముట్టడించారు. ఎన్నో పోరాటాల ద్వారా దేశంలోనే తొలిసారిగా గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ల కోసం 107, 121 జీవోలు జారీ అయి ఆరు మాసాలు దాటుతున్నప్పటికీ ఇంతవరకు అమలుకు నోచుకోకపోవడం పట్ల ఏపీ జెఏసీ అమరావతి చైర్మన్ మరియు రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు నిప్పులు చెరిగారు. భారత ప్రభుత్వం నూతన పింఛను విధానాన్ని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయుటకు మాత్రమే ప్రవేశపెట్టారని రాష్ట్రాలు నిర్భందంగా అమలుచేయవలసిందిగా ఆదేశించలేదని అందుకు ఉదాహరణ త్రిపుర మరియు పశ్చిమబెంగాల్ ఇప్పటికీ పాత పెన్షన్ విధానంలో కొనసాగుతున్నాయని చెప్పారు. ఆనాడు 2004లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానం నుండి నూతన పెన్షన్ విధానంలోకి తీసుకురావడం, వారి నాయకత్వంలోనే 2009లో కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు చేసినప్పటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు 2009లో జారీ చేసినట్టే చేసి తిరిగి వెంటనే 2010లో ఎందుకు రద్దుచేశారో కూడా తెలియదని ఇది శోచనీయమని తెలిపారు. నాడు సీపీఎస్ ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉండటం, నాటి ఉద్యోగుల నాయకత్వం తీవ్రంగా వ్యతిరేకించకపోవడం తదితర కారణాల వల్ల రాష్ట్రంలో సీపీఎస్ విధానం అమలవుతోందన్నారు. క్రమేణా సీపీఎస్ ఉద్యోగుల సంఖ్య పెరిగి వారే ఏపీ సీపీఎస్ ఎంప్లారుూస్ అసోసియేషన్‌గా ఏర్పడి ఉద్యమాలు చేపట్టి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని బొప్పరాజు అన్నారు. 107, 121 జీవోలు మంజూరు చేసి ఆరు మాసాలు దాటినప్పటికీ ఇప్పటివరకు అమలుకు నోచుకోకపోవడం, ఉద్యోగులు చెల్లించిన పెన్షన్ చందాల మిస్సింగ్ క్రెడిట్స్, మిస్ మ్యాచెస్ రీకాన్సిలేషన్ తదితర సమస్యల వల్ల సమస్య సమస్యగానే ఉందన్నారు.గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యోగేశ్వరరెడ్డి మాట్లాడుతూ చందా పింఛన్ విధానం నుండి పాత పింఛన్ విధానానికి మారడానికి ప్రస్తుతం రాష్టస్థ్రాయిలో నిర్ణయం తీసుకోవచ్చునని అన్నారు. జాక్టో ఉపాధ్యాయ సంఘ నాయకుడు, తెలుగునాడు టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ సీపీఎస్ రాష్ట్రంలో రద్దుచేసే వరకు పోరాటం చేయాలన్నారు. జేఏసీ అమరావతి సెక్రటరీ జనరల్ టివి ఫణి పేర్రాజు మాట్లాడుతూ చనిపోయిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చే గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ల విషయంలో ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం శాపంగా పరిణమించిందన్నారు. కార్యక్రమంలో పేర్రాజు, ఏపీ సీపీఎస్‌ఈఏ కృష్ణాజిల్లా ప్రెసిడెంట్ మాగుంట శ్రీనివాస్, ఏపీ జాక్టో నుండి టీఎన్‌టీయు జనరల్ సెక్రటరీ కృష్ణమోహన్, వివిధ ఉపాధ్యాయ సంఘ నాయకులు, రిటైర్డు ఎంప్లారుూస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ కె.ఆల్ఫ్రెడ్, కృష్ణాజిల్లా జేఏసీ చైర్మన్ డి.ఈశ్వర్, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.అంజిప్రసాదరావు, ఏపీ హంసా స్టేట్ ప్రెసిడెంట్, గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యోగేశ్వరరెడ్డి, కార్మికశాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘ ప్రెసిడెంట్ రాజేష్, జాయింట్ సెక్రటరీ బిందు, రెవిన్యూ సంఘ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, చనిపోయిన కుటుంబాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.