ఆంధ్రప్రదేశ్‌

చెన్నంపల్లె దశ తిరగనుందా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 12: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లె కోటలో గుప్తనిధుల కోసం చేపట్టిన తవ్వకాలు సత్ఫలితాలు ఇవ్వకపోయినా విలువైన ఖనిజ సంపద ఉన్నట్లు తెలుస్తోంది. ఖనిజ సంపద ఉన్న విషయం వాస్తవమైతే చెన్నంపల్లె గ్రామంతో పాటు ఆ పరిసర ప్రాంతాల దశ తిరగడం ఖాయమని అధికారుల వెల్లడిస్తున్నారు. ఈ విషయాన్ని ఆదోని ఆర్డీవో ఓబులేసు గురువారం స్పష్టం చేశారు. గత 20 రోజులకు పైగా రెవెన్యూ, పురావస్తు, గనులశాఖ అధికారులు చెన్నంపల్లె కోటలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన విషయం విదితమే. చెన్నంపల్లె కోటలో పెద్దమొత్తంలో గుప్తనిధులు ఉన్నాయని, వాటిని తవ్వి తీస్తే రాష్ట్రం అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయని ప్రభుత్వానికి అందిన నివేదిక మేరకు తవ్వకాలు చేపట్టారు. గత 20 రోజుల్లో కూలీలు తవ్విన ప్రాంతంలో ఏనుగు దంతాలు, కొన్ని జంతువుల ఎముకలు, ఇనుప వస్తువులు బయటపడ్డాయి. అంతకు మించి గుప్తనిధుల ఆనవాళ్లు లభ్యం కాకపోవడంతో పురావస్తు, గనుల శాఖలకు చెందిన అధికారులు అత్యాధునిక స్కానర్లు, యంత్రాలతో కోటలోని పలు ప్రదేశాల్లో చేపట్టిన పరిశీలనలో ఖనిజ సంపద ఉన్నట్లు గుర్తించారు. దీంతో కోటకు సమీపంలోని దర్గా ప్రాంతంలో భూగర్భం నుంచి మట్టి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. అక్కడి నుంచి వచ్చిన నివేదిక ప్రకారం చెన్నంపల్లె కోట ప్రాంతంలో విలువైన క్వార్ట్జ్ ఖనిజం ఉన్నట్లు స్పష్టమైనట్లు తెలుస్తోంది. క్వార్ట్జ్ ఖనిజాన్ని ఉపయోగించి కంప్యూటర్ చిప్స్, గడియారాలు, రేడియోలు, వైర్‌లెస్ సెట్లకు అవసరమైన పరికరాలను తయారు చేస్తారు. క్వార్ట్జ్ ఖనిజం కోట ప్రాంతంలో ఎంత విస్తీర్ణంలో ఉందన్నది తదుపరి పరీక్షల్లో తేలుతుందని అధికారులు పేర్కొంటున్నారు. క్వార్ట్జ్ ఖనిజానికి విదేశాల్లో భారీ గిరాకీ ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వమే ఖనిజాన్ని వినియోగించి ఉత్పత్తి చేయగలిగితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రానికి ఆర్థిక లబ్ది భారీగా చేకూరుతుందని వారు స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు గుప్తనిధుల కోసం తవ్వకాలు కొనసాగించడం, మరోవైపు ఖనిజ సంపద ఏ మేర ఉందన్నది పరీక్షలు నిర్వహించడం ఒకే దఫా జరుగుతాయని పేర్కొంటున్నారు. ఏదేమైనా చెన్నంపల్లె కోట ద్వారా ప్రభుత్వానికి ఆర్థిక లబ్ది చేకూరడం ఖాయమన్న భావన అధికారుల్లో నెలకొంది.