ఆంధ్రప్రదేశ్‌

ప్రైవేట్ సైన్యం పహరాలో కత్తిగట్టిన పందెం కోళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 14: అది చక్కగా చదును చేసిన పది ఎకరాలకు పైగా ఉన్న సువిశాల స్థలం. ఇంటి ప్రహరీ మాదిరిగా చుట్టూ ఫెన్సింగ్. అందులో ఓ రెండొందల మంది ప్రైవేట్ సైన్యం. ఆ పది ఎకరాల స్థలంలోకి కార్లలో వెళ్లాలంటే దాని ఫీజు అక్షరాలా వంద రూపాయలు! జనం కిక్కు కోసం అక్కడే ఓ తాత్కాలిక వైన్ షాపు!! అక్కడ కొంచెం ఎక్కువ ధరతో చీప్ లిక్కర్ నుంచి కాస్ట్లీ స్కాచ్ వరకూ అందరికీ అందుబాటులో. ఆకలేస్తే కేవలం 150 రూపాయలకే బిర్యానీ కూడా రెడీ. ఇక అందర్-బాహర్, మూడుముక్కలాట, బొమ్మా-బొరుసు, రింగాట వంటి డబ్బాటలకు కొదువేలేదు. అభిమాన హీరోలు, నేతలు, చివరకు దేవుళ్ల ఫొటోలనూ వదలని జూదం. కృష్ణా జిల్లాలో జన్మించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహం సాక్షిగా, పోలీసుల నిస్సహాయతకు, రాజకీయ నేతల పెత్తనానికి నిదర్శనంగా అదే రాజధాని జిల్లాలో ఆదివారం దర్శనమిచ్చిన సంక్రాంతి జూదాల దృశ్యాలివి!
రాష్ట్ర రాజధాని నగరానికి కూతవేటు దూరంలోని ఈడ్పుగల్లు గ్రామ పొలాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి కోళ్ల పందాల్లో డబ్బు నీళ్లలా ప్రవహించింది. శనివారం సాయంత్రం నుంచి మొదలైన సంక్రాంతి కోళ్ల పందాలు ఆదివారం జూద సంస్కృతికి తెరలేపాయి. అనుమానాస్పద వ్యక్తులు లోపలికి రాకుండా బయటనే ఉన్న ప్రైవేట్ సైన్యం అడ్డుకుంది. కండలు తిరిగిన పహిల్వాన్లు అనుమానాస్పద వ్యక్తుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. ప్రధానంగా మీడియా ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్లను అడుగడుగునా అడ్డుకుని, లోపల ఫొటోలు తీస్తే ఆ తర్వాత ఏం జరిగినా మాకు సంబంధం లేదని గుడ్లురిమారు. కోడి పందాలు జరిగే బరి కాకుండా, పది ఎకరాల సువిశాల స్థలంలో జూద క్రీడలు జోరుగా సాగాయి. లోపల దాదాపు 100 టెంట్లు కనిపించాయి. అక్కడే ఏ ఆటకు ఆ ఆట కోసం ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేశారు. కోత ఆటగా పేరున్న పేకాటకు వెయ్యి రూపాయలు కనీస ధరగా నిర్ణయించారు. దానికోసం ఒక టెంటులో రూ. 5వేలు లోపు, మరో టెంటులో రూ. 5వేలకు పైన ఆడే వారికోసం ఏర్పాట్లు చేశారు. డబ్బులు లెక్కించేందుకు నాలుగైదు కౌంటింగ్ మిషన్లు కూడా అందుబాటులో ఉంచారు. ఇక్కడ ఒక రౌండ్‌కు 5 లక్షల రూపాయలు తక్కువ లేకుండా పందెం కాస్తున్నారు. పావు గంటకు ఒక రౌండు చొప్పున, ఉదయం నుంచి రాత్రి వరకూ పేకాట విజయవంతంగా కొనసాగుతోంది. దీనికోసం నిర్వహకులు ప్రత్యేకంగా కాయన్లు పంపిణీ చేస్తున్నారు. పందెం రాయుళ్లు నేరుగా డబ్బు కట్టే రిస్కు లేకుండా, కాయన్లు కొనుగోలు చేసి ఆడుతున్నారు. అవి ఉంటేనే టెంట్లలోకి అనుమతిస్తున్నారు. ఇక లోపలికి వెళ్లాలంటే వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ ఫీజును అనధికారంగా ఏర్పాటు చేశారు. వీఐపీ కార్లకు వంద, మామూలు కార్లకు 50, ద్విచక్ర వాహనాలకు 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయినా లోపల స్థలం లేకపోవడంతో పందెం రాయుళ్లు బయట ఉన్న ప్రాంతాల్లో పార్కింగ్ చేసుకుంటున్నారంటే ఈ పందేలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ఊహించుకోవచ్చు. తాము వాటిని టెండరులో పాడుకున్నామని అక్కడి వ్యక్తులు చెప్పారు. పందెం రాయుళ్లు తిండి కోసం బయటకు వెళ్లనవసరం లేకుండా, లోపలే దాదాపు 50 ఫుడ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. బజ్జీల నుంచి బిర్యానీ వరకూ, వాటర్ ప్యాకెట్ నుంచి స్కాచ్ బాటిళ్ల వరకూ లోపల అందుబాటులో కనిపించాయి. టెంట్లలో పెద్దపెద్ద రిఫ్రిజరేటర్లతో తాత్కాలిక వైన్ షాపు వెలిసింది. మామూలు వైన్ షాపులో కూడా కనిపించనంత స్టాక్ అక్కడ దర్శనమిచ్చింది. ఎక్కువ డబ్బులు పెడితే చీప్ లిక్కర్ నుంచి, స్కాచ్ బాటిళ్ల వరకూ అందుబాటులో ఉంచారు. వైన్ షాపుగా మార్చిన టెంటు పక్కన కొండల్లా పేరుకున్న బాటిళ్లు వెక్కిరించాయి. ఒక్కరోజులో రూ. 20 లక్షల మేర అమ్మకాలు జరిగి ఉంటాయని ఓ అంచనా. ఇక కోడి పందెం, పొట్టేళ్ల పందెం, రకారకాల పేకాటలు, మద్యం అమ్మకాలు, స్టాళ్లలో ఏర్పాటు చేసిన ఇతర పందాలన్నీ కలిపితే సుమారు రూ. 3కోట్ల పైనే వ్యాపారం జరిగిందంటున్నారు. ఇది ఒక్క ఈడ్పుగల్లులోనే! ఇక జిల్లాలోని యనమలకుదురు, పోరంకి, గొడవర్రు, అంపాపురం, గుడివాడ, నందిగామ, నగరంలోకి భవానీపురం, తాడేపల్లిలో జరుగుతున్న కోడి పందాలన్నీ కలిపితే రోజుకు 50కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి కూడా పందెం రాయుళ్లు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడ కళ్లెదుటే ఇంత జరుగుతున్నా పోలీసులు రాజకీయ నేతల ముందు నిస్సహాయులుగా నిలిచిపోయారు. లోపల ఉన్న నిర్వాహకులను పిలిపించి పందాలు కాయవద్దని చెప్పి వెళ్లిపోయారు. కళ్లెదుటే స్టాళ్లలో పేకాట, ఇతర జూదాలు జరుగుతున్నా పోలీసులు అటు వెళ్లకుండా కాసేపు హడావుడి చేసి వెళ్లిపోయారు. ‘ఇదంతా ఇక్కడ ‘మామూలే’! వాళ్లు రావడం, వచ్చి హడావుడి చేయడం, తర్వాత లీడర్లు వచ్చి మాట్లాడి పంపించడం కొత్తేమీ కాదు. మీరు ఇప్పుడొచ్చి చూస్తున్నారు కాబట్టి కొత్తగా అనిపించవచ్చు. ఈ పోటీల్లో ఎవరి వాటాలు వాళ్లకు వెళతాయి. మీ మీడియా వాళ్లూ వచ్చిపోతున్నారు’ అని ఓ టెంటు నిర్వాహకుడు అసలు విషయం వివరించారు.

భారీగా హాజరైన పందెంరాయుళ్లు. పెద్దసంఖ్యలో చేరిన కార్లు, బైక్‌లు
రాజధాని నగరం విజయవాడకు సమీపంలోని ఈడ్పుగల్లు బరిలో రక్తం చిందిస్తున్న పందెం కోళ్లు