ఆంధ్రప్రదేశ్‌

మాకో గవర్నర్ కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి/విశాఖపట్నం, జనవరి 16: ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను మార్చాలన్న డిమాండ్ భారతీయ జనతా పార్టీలో ఊపందుకుంటోంది. తాజాగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ను నియమించాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి రాజనాథ్‌సింగ్‌కు రాసిన లేఖలో కోరారు. అదే సమయంలో రాష్ట్ర హైకోర్టు కోసం ప్రభుత్వం భవనాలను అనే్వషిస్తోందని, రాష్ట్ర ప్రజల మనోభావాలు గమనించి హైకోర్టు ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు. ఇప్పటివరకూ గవర్నర్ పనితీరుపై బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్‌రాజు ఒక్కరే నిరసన గళం వినిపిస్తున్నారు. గవర్నర్ ఇప్పటివరకూ రాష్ట్రంలో పట్టుమని పదిరోజులు కూడా ఉండలేదని, ఆయన తెలంగాణ రాష్ట్రం వైపే ఉన్నారంటూ బహిరంగ విమర్శలు చేశారు. నాలా చట్టం ఆమోదంపై గవర్నర్ వైఖరి రాష్ట్రాన్ని అవమానించేలా ఉందన్న విష్ణుకుమార్‌రాజు.. తక్షణం ఆయనను గవర్నర్ పదవి నుంచి తప్పించాలని, ఆమేరకు ఎంపీలంతా ఢిల్లీపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేసి సంచలనం సృష్టించారు. అయితే, తాజాగా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కూడా గవర్నర్‌ను తొలగించాలని చెప్పకుండా, కొత్త రాష్ట్రానికి గవర్నర్‌ను నియమించాలంటూ లౌక్యంగా లేఖ రాయడం ప్రస్తావనార్హం. నిజానికి గవర్నర్ వైఖరిపై అటు అధికార తెలుగుదేశం పార్టీ కూడా తీవ్ర అసంతృప్తితో ఉంది. విభజన సమస్యలు అనేకం అపరిష్కృతంగా ఉండగా వాటిని పరిష్కరించకుండా, తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే ప్రతిపాదనలనే ఎప్పుడూ చర్చల్లో తీసుకురావడం టీడీపీకి రుచించడం లేదు. ప్రధానంగా సెక్రటేరియట్ అప్పగింతలో గవర్నర్ ప్రయత్నాలను టీడీపీ సీనియర్లు అప్పట్లోనే ఆక్షేపించారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం పంపిన ప్రతిపాదనలు మూడురోజుల్లోనే ఆమోదిస్తున్న గవర్నర్, తమ రాష్ట్రం వంతు వచ్చేసరికి కొర్రీలు వేస్తున్నారన్న అసహనంతో ఉంది. అయినప్పటికీ బాహాటంగా ఒక్కసారి కూడా దాన్ని వ్యక్తీకరించలేదు. ఇప్పుడు ఆ బాధ్యతను మిత్రపక్షమైన బీజేపీ తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీకి కావలసిన కార్యం గంధర్వులు చేసినట్టవుతోంది.
ఇక్కడి నుంచే పనిచేయాలి
ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ను నియమించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాశారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్టమ్రని, విజయవాడ రాజధానిగా పాలన సాగుతోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చారని హరిబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. అమరావతి నుంచే ఇప్పుడు పాలన సాగుతోందని అన్నారు. తాత్కాలిక సచివాలయం, శాసనసభా భవనం అమరావతిలోనే నిర్మించారన్నారు. అయినా, ఇప్పటికీ హైకోర్టు హైదరాబాద్ నుంచి పనిచేస్తోందని హరిబాబు ఆ లేఖలో వివరించారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న హైకోర్టును విభజించాలని చాలా కాలంగా డిమాండ్ ఉందని ఆయన చెప్పారు. త్వరలోనే ఏపీకి హైకోర్టు వస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే, ఏపీ గవర్నర్ కూడా హైదరాబాద్ నుంచే పనిచేస్తున్నారన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాలను చూసుకునే పూర్తి స్థాయి గవర్నర్ కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని హరిబాబు అన్నారు. అందువలన ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమించాలని హరిబాబు, రాజ్‌నాథ్‌కు రాసిన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
చిత్రం..కంభంపాటి హరిబాబు