ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో ఎన్టీఆర్ మెమోరియల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 18: తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన మహోన్నత వ్యక్తి దివంగత ఎన్టీ రామారావు అని, అలాంటి వ్యక్తి ఆదర్శాలను భావితరాలకు అందించడమే నిజమైన నివాళి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో గురువారం ఎన్టీఆర్ 22వ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని అమరావతిలో ఎన్టీఆర్ మెమోరియల్ ఏర్పాటు చేసి, ఆయన ఆదర్శాలను, ఆశయాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవడమే కాకుండా, అందులో దివంగత ఎన్టీరామారావు నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్టీ రామారావు మన మధ్య లేకపోయినా ఆయన అందించిన స్ఫూర్తిని, ఆదర్శాలను రాబోయే తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక సామాన్యుడు తన జీవితంలో సాధించిన విజయాల ద్వారా చరిత్ర సృష్టించి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. సినీ రంగంలో ఆయన వేసిన పాత్రలు నేటికీ మరెవ్వరూ మెప్పించలేని స్థాయిలో పౌరాణిక పాత్రలైన శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు, దుర్యోధనుడుగా తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. రాజకీయాలకు ఒక నూతన నిర్వచనం ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి అన్నారు. సేవాభావంలో చూసినా, పేద ప్రజలకు పక్కా ఇళ్లు నిర్మించినా, ఆహార భద్రత కల్పించినా ఆయన సృష్టించిన ఒరవడి నేటికీ ఆదర్శనీయమన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటమే కాకుండా ప్రపంచానికి తెలుగువారి ఖ్యాతిని చాటిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. అలాంటి నాయకుడు మన మధ్య లేకున్నా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందన్నారు. అలాంటి మహా నాయకుడు పుట్టిన తెలుగుగడ్డను భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్ది ఆయనకు నిజమైన నివాళులు అర్పిస్తామన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్న అభిమానులు, ప్రజా ప్రతినిధులను అభినందిస్తున్నానన్నారు. తొలుత స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత మధుర ఘట్టాలకు సంబంధించి ఏర్పాటు చేసిన చిత్రపటాలను ముఖ్యమంత్రి తిలకించారు. వర్ధంతి కార్యక్రమంలో నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్, ఉప ముఖ్యమంత్రులు కెఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర మంత్రులు కిమిడి కళా వెంకట్రావు, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పరిటాల సునీత, అమర్‌నాథ్ రెడ్డి, సీహెచ్ అయ్యన్నపాత్రుడు, కేఎస్ జవహర్, పితాని సత్యనారాయణ, కామినేని శ్రీనివాస్, భూమా అఖిలప్రియ, హౌసింగ్ బోర్డు చైర్మన్ వర్ల రామయ్య, గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్, ఎమ్మెల్సీ తొండపు జనార్దన్, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు