ఆంధ్రప్రదేశ్‌

ఉచిత విద్యుత్‌కోసం నర్సరీ రైతుల రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడియం, జనవరి 19: తూర్పుగోదావరి జిల్లాలో కడియం నర్సరీ రైతులు ఉచిత విద్యుత్‌ను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన చేబట్టారు. కడియం బంద్‌కు పిలుపునిచ్చిన నర్సరీ రైతులు సుమారు వెయ్యి మంది స్థానిక విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట బైఠాయించి తమ నిరసన తెలిపారు. తమను విద్యుత్ శాఖ అధికారులు గత రెండేళ్లుగా వేధిస్తున్నారని నర్సరీ రైతులు పేర్కొన్నారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వ్యవసాయ రంగంగా కడియం నర్సరీలను పరిగణించి ఉచిత విద్యుత్‌ను అమలుచేశారని, అప్పట్నుంచీ కొనసాగుతున్న పథకాన్ని నీరుగారుస్తూ ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం నర్సరీలకు మీటర్లు బిగించి రైతులను బకాయిదారులుగా చూపి, విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తోందన్నారు. దీనిపై తాము దశలవారీగా ఉద్యమాలు చేపట్టినప్పటికీ నేరుగా సీఎం చంద్రబాబునాయుడిని, విద్యుత్ శాఖ మంత్రిని కలిసినా ఫలితం లేకపోయిందన్నారు. ఇక తాము తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే ఆమరణ దీక్షకు దిగేందుకు కూడా వెనుకాడబోమని ఇండియన్ నర్సరీమెన్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం, కడియం నర్సరీమెన్ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లా చంటి అల్టిమేటం జారీచేశారు. నర్సరీ రైతులకు సంఘీభావంగా రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఆ పార్టీ కోఆర్డినేటర్లు గిరజాల బాబు, ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌లు నర్సరీ రైతులతోపాటు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ తీరునకు నిరసన వ్యక్తం చేశారు. నర్సరీ రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. నర్సరీ రైతుల ఆందోళనపై స్పందించిన ఎంపీ మాగంటి మురళీమోహన్ కడియం చేరుకుని నర్సరీ రైతులతో నేరుగా చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉందని, పదెకరాల లోపు నర్సరీ రైతులకు ఉచిత విద్యుత్ అమలయ్యేలా, మిగిలిన వారు బిల్లులు చెల్లించేలా సీఎం చంద్రబాబునాయుడుతో మాట్లాడి ఒక నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 26న సీఎం చంద్రబాబుతో ప్రత్యేక సమావేశం ఉందని, అప్పటి వరకూ ఆందోళన విరమించాలని ఎంపీ మాగంటి మురళీమోహన్ కోరారు. ఎంపీ వ్యాఖ్యలతో ఏకీభవించని వైసీపీ నాయకులు కొద్దిసేపు ఆయనతో వాగ్వివాదానికి దిగారు. నర్సరీ మెన్ అసోసియేషన్ ఎంపీ హామీపై వేచి చూసేందుకు అంగీకరించడంతో ఆందోళన తాత్కాలికంగా విరమించారు. ఇదిలా ఉండగా నర్సరీ రైతుల బంద్ పిలుపుతో శుక్రవారం కడియంలో బ్యాంకులు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా మూసివేశారు. దీంతో బంద్ విజయవంతమైంది. కాకినాడ - ధవళేశ్వరం కెనాల్ రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో కడియం నుంచి ఇతర మార్గాల ద్వారా ట్రాఫిక్‌ను మళ్లించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాజమహేంద్రవరం దక్షిణ మండల డీఎస్పీ నారాయణరావు స్వయంగా పరిస్థితిని సమీక్షించారు.