ఆంధ్రప్రదేశ్‌

ఏడాదిలోగా 18 లక్షల ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 19: రాష్ట్రంలో పేదలకు నిర్మించ తలపెట్టిన 18 లక్షల ఇళ్ల నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది జనవరిలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ కింద చేపట్టిన 5 లక్షల ఇళ్లతో సహా మొత్తం 18 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో నిర్మిస్తున్న రెండున్నర లక్షల ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న 10 వేల ఇళ్లకు ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో గృహ ప్రవేశాలు జరపాలని చెప్పారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణం కింద 2017-18లో రెండు లక్షల ఇళ్లు మంజూరు చేయగా, వీటిలో 1,88,559 పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎమ్మార్వో, ఆర్డీవోలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి పేదల ఇళ్ల స్థలాలకు సంబంధించి అర్హులైన వారికి వారసత్వ హక్కులు కల్పించాలని సూచించారు. ఉండవల్లిలో నూతనంగా నిర్మించిన సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా కలెక్టర్ల రెండో రోజు సమావేశంలో ముఖ్యమంత్రి వివిధ శాఖల ప్రగతి, పనితీరు, ఫలితాలను విశే్లషించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఇటీవల అర్హులుగా గుర్తించిన లక్షా 28 వేల కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డుల పంపిణీని మార్చి నుంచి చేపట్టాలని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి చెప్పారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందించాలని, అలా అని రేషన్ కార్డుల కోసం ఉమ్మడి కుటుంబాలను విచ్ఛిన్నం చేయడం సరికాదని, ఆ ధోరణిని ప్రోత్సహించవద్దని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మొత్తం 1,44,64,509 రేషన్ కార్డులు ఉండగా, 95.46 లక్షల రేషన్ కార్డులకు మాత్రమే బియ్యంపై కేంద్రం సబ్సిడీ అందిస్తోందని ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.ప్రజా సాధికార సర్వేను ఆధారం చేసుకుని ప్రభుత్వ పథకాలు అసలైన లబ్ధిదారులకు చెందేలా చూడాలని, అవసరమైతే ఒకే కుటుంబంలో ఇద్దరికి మించి ప్రయోజనం పొందినా ఫర్వాలేదని స్పష్టం చేశారు. ఏప్రిల్ నుంచి ఆధార్ ఫేషియల్ రికగ్నైజేషన్‌కు వెళ్తున్నందున రేషన్ సరుకుల అందజేతలో తలెత్తే సాంకేతిక ఇబ్బందులను అధిగమించవచ్చని తెలిపారు. రేషన్ సరుకుల అందజేతలో బయోమెట్రిక్ విధానం వల్ల సమస్యలు తలెత్తితే ఐరిస్, ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా అధిగమించాలని సూచించారు. ప్రస్తుతం 100 పాఠశాలల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని, ఫలితాల ఆధారంగా త్వరలో ఈ విధానాన్ని సంపూర్ణంగా అమలు చేస్తామని యుఐడిఎఐ చైర్‌పర్సన్ జె.సత్యనారాయణ సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ లాకర్ వుండాలని, డిజిటల్ లాకర్‌లో ప్రజలు తమతమ హెల్త్ రికార్డులు, సర్ట్ఫికెట్లు, ఇతర సమాచారాన్ని భద్రపరచుకోవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ లాకర్ విధానంతో దీన్ని అనుసంధానం చేయాలని అధికారులకు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల సమగ్ర సమాచారాన్ని పంచాయతీ రాజ్ శాఖ పోర్టల్‌లో అందుబాటులో ఉంచామని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. అన్ని ప్రభుత్వ శాఖలు ప్రజా సాధికార సర్వే, పీపుల్స్ హబ్‌తో అనుసంధానం చేయాలని సూచించారు. పంచాయతీ రాజ్ శాఖ అన్ని గ్రామాల సమగ్ర సమాచారాన్ని వెబ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచినట్టే మిగిలిన శాఖలు కూడా గ్రామాలవారీ సమాచారాన్ని తమ పోర్టల్‌లో ఉంచాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రణాళికా రచన కేంద్రీకృతంగా జరిపినా కార్యసాధనలో మాత్రం వికేంద్రీకరణ అవసరమని, అప్పుడే సత్ఫలితాలు వస్తాయని అన్నారు.
చిత్రం..కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు