ఆంధ్రప్రదేశ్‌

నల్లరేగడి నేలల్ల్లో క్యూరింగ్ దిశగా ముందస్తు వర్జీనియా పొగాకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 20: తేలికపాటి నల్లరేగడి నేలల్లో సంప్రదాయ పొగాకు స్థానే ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలు విస్తరిస్తున్నాయి. పొగాకు సాగుకు ప్రత్యామ్నాయంగా లాభాలను బేరీజు వేసుకుంటూ రైతులు ఇతర వాణిజ్య పంటలను గోదావరి జిల్లాల రైతులు ఆశ్రయిస్తున్నారు. పొగాకు కంటే గిట్టుబాటు ధరలు లాభసాటిగా లభిస్తున్నాయని ఆశిస్తూ గత రెండేళ్ల కాలంలో గోదావరి బేసిన్‌లోని నల్ల రేగడి నేలల్లో మొక్కజొన్న, పత్తి, పొద్దుతిరుగుడు, పచ్చ శనగ పంటలను వేస్తున్నారు. గతంలో ఈ పంటలన్నీ అందుబాటులో ఉండేవి కావు. సంప్రదాయబద్ధంగా ఒక్క వర్జీనియా సాగుకు మాత్రమే రైతులు అలవాటు పడ్డారు. పొగాకు, చెరకు పండించే రైతులు మాత్రమే మోతుబరి రైతులుగా ఉండేవారు. ఇపుడు పొగాకుకు బదులు ఇతర వాణిజ్య పంటలు లాభసాటిగా ఉండటంతో ఆ దిశగా రైతులు మళ్లుతున్నారు. తర తరాలుగా పండిస్తోన్న పొగాకు పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు వాపోతున్నారు. అనాధిగా వర్జీనియా సాగుకు అలవాటుపడిన రైతులు ఇపుడు అధికంగా ఇతర పంటల వైపు మళ్లుతున్నారు.
ఈ నేపధ్యంలో క్రమేణా పొగాకు సాగుపై రైతులకు ఆసక్తి సన్నగిల్లుతోంది. పొగాకు వేసేందుకు రైతులు లైసెన్స్‌లు తీసుకున్నప్పటికీ శనగ పంటకు లాభసాటి ధర లభిస్తోండటంతో పొగాకును వదిలి శనగ పంట వైపు మళ్లు తున్నారు. పొగాకు ఎకరాకు రూ.40వేలు ఖర్చవుతుంటే, శనగకు రూ.12వేలు మాత్రమే ఖర్చవుతోంది. కానీ లాభం మాత్రం పొగాకు మాదిరిగానే ఉండటంతో ఖర్చు తక్కువ, లాభం ఎక్కువగా ఉన్న శనగ వైపు రైతులు మళ్లారు. ఈ క్రమంలో ఒకపుడు పొగాకు పండించే నేలను ఇపుడు శనగ సాగు ఆక్రమిస్తోంది. ఇదిలా వుండగా తేలికపాటి నల్లరేగడి నేలల్లో సాగు చేసే వర్జీనియా సాగుకు సంబంధించి గోదావరి జిల్లాల్లో రైతులు రిజిస్ట్రేషన్లు గత ఏడాది మాదిరిగానే చేసుకున్నప్పటికీ సాగు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.
ఈ ఏడాది మొత్తం 1381 మంది రైతులు 1453 బ్యారన్లకు వర్జినియా సాగు చేసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో తేలికపాటి నేలల్లో 110 హెక్టార్లలోనూ, నల్ల రేగడి నేలల్లో 1285 హెక్టార్లలోనూ వెరసి సుమారు 1395 హెక్టార్లలో వర్జినియా సాగుకు శ్రీకారం చుట్టారు. అయితే గత నవంబర్ 17,18,19 తేదీల్లో కురిసిన భారీ వర్షాల వల్ల పొగాకు నారుమడులు కొట్టుకు పోయాయి. అప్పట్లో ముందస్తుగా వేసిన సాగు మాత్రమే సుమారు ఆరు బ్యారన్ల వరకు మాత్రమే మిగిలింది. ఇది ముందస్తుగా క్యూరింగ్ దశకు చేరుకుంది. ఈ ఏడాది 2.7 మిలియన్ కేజీల దిగుబడి సాధించ వచ్చని అంచనా వేశారు. వాస్తవానికి నవంబర్ 17కి ముందే పొగాకు నాట్లు పూర్తయ్యాయి. అదికాస్తా వరదకు కొట్టుకు పోవడంతో అనంతరం మళ్లీ సాగు మొదలెట్టారు. వరదకు మెరకలో వేసిన పొగాకు మాత్రమే మిగిలింది. దాదాపు 795 హెక్టార్ల విస్తీర్ణంలో పొగాకు కొట్టుకుపోయింది. ముందస్తు దిగుబడి వచ్చిన పొగాకు మాత్రం ఫిబ్రవరి 10-15వ తేదీ నుంచి క్యూరింగ్ జరుగుతోంది. మూడు ఎకరాలకు 26 క్వింటాళ్ల దిగుబడికి పొగాకు బోర్డు అనుమతి ఇచ్చింది. వర్జీనియా పొగాకు సాగును పరిశీలిస్తే.. 2005లో తొర్రేడు పొగాకు వేలం కేంద్రం పరిధిలో 1434 మంది రైతులు వర్జీనియా సాగుకు 1946 హెక్టార్లకు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ ఏడాది 1796 హెక్టార్లకు పడిపోయింది. అప్పట్లో 48 గ్రామాల పరిధిలో పొగాకు పండిస్తే ఇపుడు 41 గ్రామాల్లో మాత్రమే పొగాకు సాగవుతోంది. 2005లో 1756 హెక్టార్లలో పొగాకు సాగయితే ఈ ఏడాది 1469 హెక్టార్లకే నాట్లు పడ్డాయి. అయితే అప్పట్లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నప్పటికీ దిగుబడి తక్కువగా ఉండేది. క్రమేణా విస్తీర్ణం తగ్గిపోయింది..దిగుబడి మాత్రం పెరిగింది. అయితే కేజీ సరాసరి ధర మాత్రం రూ.32లు ఉండేది, అదే ఇపుడు కేజీ రూ.132లు లభిస్తోంది. అత్యధిక ధర అప్పట్లో రూ.47.70లు లభిస్తే గత సీజన్‌లో కేజీ అత్యధికంగా రూ.179లు లభించింది. 2005లో సాగయ్యే దిగుబడి విలువ రూ.8.13 కోట్లు ఉంటే, రూ.37.96ల కోట్ల విలువైన దిగుబడి లభిస్తోంది. ఏదేమైనప్పటికీ వాణిజ్య పంట వర్జినియాకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపుతున్నారని ఈ ఏడాది గోదావరి ఆవాసిత ఏటిపట్టు గ్రామాల సాగును బట్టి స్పష్టంగా తెలుస్తోంది.

చిత్రం..ముందస్తు సాగయిన వర్జీనియా పొగాకును క్యూరింగ్ చేస్తున్న దృశ్యం