ఆంధ్రప్రదేశ్‌

మరో ఉద్దానం ‘పరవాడ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్. కారునాయుడు
పరవాడ (విశాఖపట్నం), జనవరి 21: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ వ్యథ మరువక ముందే, పక్క జిల్లా విశాఖలో కిడ్నీ వ్యాధి పడగ విప్పింది. విశాఖ జిల్లా పరవాడ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. చాలామందికి ఆ వ్యాధి సోకిందన్న విషయం కూడా తెలియదు. గడచిన మూడు నెలల వ్యవధిలో ఆరుగురు వ్యక్తులు కిడ్నీ వ్యాధితో చనిపోయారు. ఇందురు ముగ్గురు కేవలం వారం రోజుల వ్యవధిలోనే చనిపోవడం గమనార్హం. దీన్నిబట్టి పరవాడలో ఈ వ్యాధి తీవ్రత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉద్దానంలో వైద్యులు, ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన అనేక మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ప్రాణాలు కోల్పోయారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు వందల సంఖ్యలో పెరిగిపోయారు. ప్రభుత్వం ముందుగా మేల్కొనక పోవడం వలన ఇక్కడి పరిస్థితి చేయదాటిపోయింది. వ్యాధిని అరికట్టే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. అలాగే పరవాడలో కూడా కిడ్నీ వ్యాధి ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.
కిడ్నీ వ్యాధి పరవాడ వాసులపై పగడవిప్పి చాలాకాలమే అయినా ఆ వ్యాధి గురించి గ్రామస్తులు తెలుసుకోలేకపోయారు. వ్యాధి ముదరడంతో రోగి చివరి దశలో ఆసుపత్రికి వెళుతున్నాడు. దీంతో వైద్యులు ఆ రోగిని కాపాడలేక చేతులెత్తేస్తున్నారు. మూడు నెలల వ్యవధిలో సుమారు ఆరుగురు రోగులు కిడ్నీ వ్యాధి బారినపడి మృత్యువాత పడ్డారు. మరో 30 మంది వరకు ప్రస్తుతం కిడ్నీ వ్యాధి బారిన పడినట్లు నిర్థారణ జరిగింది. ఇందులో పది మంది వివిధ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకుంటున్నారు.
ఒక్కసారిగా పరవాడ మండలంలో కిడ్నీ వ్యాధి ప్రజ్వరిల్లడానికి గల కారణాలపై అంచనాలు వేస్తున్నారు. నీరు, వాయు కాలుష్యం వలనే ఈ వ్యాధి ప్రబలిందని వైద్యులు చెబుతున్నారు. ఎన్‌టీపీసీ, ఫార్మా యూనిట్ల నుంచి విడుదలవుతున్న కలుషిత జలాలు ప్రజల ప్రాణాలను బలిగొంటున్నాయి.
ఇదిలా ఉండగా కిడ్నీ రోగులతో సమానంగా పరవాడలో క్యాన్సర్ రోగులు పెరుగుతున్నారు. అత్యధికంగా మహిళలు ఈ వ్యాధి బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారు. మహిళలు అధికంగా గర్భ, రొమ్ముకు సంబంధిత క్యాన్సర్స్‌తో బాధపడుతున్నారు. ఈ ప్రాంతంలో క్యాన్సర్ వ్యాధితో పదుల సంఖ్యలో మహిళలు మృత్యువాత పడ్డారు.
వ్యాధులపై కొరవడిన అవగాహన
కిడ్నీ, క్యాన్సర్ వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన లేదు. కనీసం ప్రజల్లో ఈ వ్యాధుల పట్ల అవగాహన తీసుకువచ్చే విధంగా ప్రభుత్వాలు కృషి చేయడం లేదు. అయితే పరవాడ గ్రామానికి చెందిన ఉప్పు గండివారివీధిలో కిడ్నీ, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారని సర్పంచ్ చుక్క రామునాయుడు, ఎంపీటీసీ పయిల శ్రీనివాసరావు తెలిపారు. వీరితోపాటు పరవాడ గ్రామంలో ప్రతీ వీధిలో ఈ వ్యాధి బారినపడిన వారు ఉన్నారు. కిడ్నీ, క్యాన్సర్ వ్యాధి లక్షణాలు తెలియకపోవడంతో వ్యాధులను ముదర పెట్టుకుని ఆసుపత్రికి వెళ్తున్నారు. పరవాడ మరో ఉద్దానం కాకముందే ప్రభుత్వం మేల్కొనాల్సిన అవసరం ఉంది. కానీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాత్రం ఇక్కడ ప్రబలుతున్న కిడ్నీ, క్యాన్సర్ వ్యాధుల గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పడం శోచనీయం. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వలనే ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ముదిరిందన్నది ప్రభుత్వం గుర్తించాలి.
కాలుష్యమే కారణం
కిడ్నీ, క్యాన్సర్ వ్యాధులకు కాలుష్యమే కారణం. పారిశ్రామికంగా పరవాడ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో వ్యాధులు అధికం అవుతున్నాయి. ప్రధానంగా జల కాలుష్యం కారణంగా కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి. సెల్ టవర్స్ కారణంగా క్యాన్సర్ వంటి రోగులు సోకుతున్నాయి.
- చుక్క రామునాయుడు,
సర్పంచ్, పరవాడ
తాగునీటి వల్లే..
తాగునీరు కలుషితం కావడం వలనే అత్యధికంగా కిడ్నీ వ్యాధులు వస్తాయి. ప్రధానంగా తాగునీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉండడం వలన కిడ్నీ వ్యాధులు ప్రబలే అవకాశం అధికంగా ఉంటుంది. ప్రధానంగా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు గ్రామాల్లో మంచినీటి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు చేయించాలి.
- ప్రసాద్, కిడ్నీ వ్యాధుల నివారణ వైద్యులు,
విశాఖపట్నం
మాకు సమాచారం లేదు
పరవాడలో కిడ్నీ, క్యాన్సర్ రోగులు పెరుగుతున్నారన్న విషయమై తమకు ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ స్థానికుల నుండి సమాచారం వస్తే వెంటనే సర్వే నిర్వహించడంతోపాటు పరీక్షలు నిర్వహిస్తాం. ప్రజల్లో అవగాహన తీసుకువచ్చే సదస్సులను నిర్వహిస్తాం.
- రమేష్,
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి,
విశాఖపట్నం