ఆంధ్రప్రదేశ్‌

‘ఆది’లో దూకుడు.. ఆనక దిద్దుబాటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 15: కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, అవమానంపై పార్టీ నాయకత్వం అనుసరిస్తోన్న వ్యూహాన్ని అర్థం చేసుకోవడంలో మంత్రులు, టీడీపీ సీనియర్లు అవస్థలు పడుతున్నారు. చివరి వరకూ ఒత్తిడి, పోరాటం.. అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే తీవ్ర నిర్ణయం తీసుకోవాలన్నది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అసలు వ్యూహమన్నది గత రెండు వారాల నుంచి నిరంతరం ఆయన చేస్తున్న సమీక్షలు, వీడియో, టెలీకాన్ఫరెన్సుల్లో స్పష్టమవుతూనే ఉంది. బాబుకూ కేంద్రం నుంచి బయటకు రావాలని వ్యక్తిగతంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, వైసీపీ-బీజేపీ రహస్య స్నేహం, మరో ఏడాది కేంద్రం నుంచి రావలసిన నిధులు, పోలవరం ప్రాజెక్టు పూర్తి వంటి కీలక అంశాలను దృష్టిలో ఉంచుకున్నందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే బీజేపీతో పొత్తు, రాజీనామాలపై ఎవరూ నోరు జారవద్దని తమ్ముళ్లను పదేపదే హెచ్చరిస్తున్నారు. కానీ, బీజేపీతో పొత్తు కొనసాగిస్తే తామూ మునిగిపోతామని భయపడుతున్న కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం ఆ రెండు అంశాలపై యథేచ్ఛగా మాట్లాడుతుండటం నాయకత్వానికి తలనొప్పిలా మారింది. తాజాగా కేంద్రం నుంచి బయటకు వచ్చే అంశంలో మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన ప్రకటన పార్టీని ఇరుకునపెట్టింది. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ తన ఎంపీలు ఏప్రిల్ 6న రాజీనామా చేస్తారని ప్రకటిస్తే తాము మార్చి 5నే చేసి కేంద్రం నుంచి బయటకు వస్తామని, అక్కడితో బీజేపీతో పొత్తు కూడా తెగదెంపులు చేసుకుంటామని సంచలన ప్రకటన చేశారు. జగన్ పిచ్చోడిలా తిక్కమాటలు మాట్లాడుతున్నారని, జగన్‌కు తమకూ పోలికే లేదన్నారు. రెండుసార్లు రాజీనామా చేస్తామని ప్రకటించిన జగన్.. బీజేపీ కోరకుండానే రాష్టప్రతి, ఉప రాష్టప్రతి ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులకు ఎలా మద్దతునిచ్చారని ప్రశ్నించారు. కేంద్రం నుంచి స్పందన రాకపోతే బయటకు వస్తామన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రకటన టీవీ చానెళ్లలో ప్రముఖంగా రావడంతో టీడీపీ నాయకత్వం హుటాహుటిన దిద్దుబాటుకు దిగింది. ఆ ప్రకటన చేసినందుకు మంత్రికి అక్షింతలు వేసింది. సున్నితమైన అంశాల్లో సొంత అభిప్రాయమేమిటి? పార్టీ లైన్‌ను రోజూ సీఎం చెబుతున్నా అర్థం చేసుకోకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే మీడియాకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అనంతరం పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ అది ఆదినారాయణరెడ్డి వ్యక్తిగత అభిప్రాయమే తప్ప, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆయన ఆవేశంలో మాట్లాడి ఉండవచ్చని, తాము మాత్రం నాయకత్వం ఆదేశాల ప్రకారమే వెళతామన్నారు. తాము రాజీనామాలంటూ చేస్తే అది ప్రజాక్షేమం కోసమే ఉంటుందని, తమ ఒత్తిడి వల్లే కేంద్రంలో కదలిక వచ్చిందన్నారు. తర్వాత నాయకత్వం ఆగ్రహించడంతో మంత్రి ఆదినారాయణ మాట మార్చారు. అది తన వ్యక్తిగత అభిప్రాయమే తప్ప, పార్టీ వైఖరి కాదని వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. తాను ఆ ప్రకటన జగన్‌ను ఉద్దేశించి చేసినది కాదన్నారు. 19 అంశాలపై కేంద్రం స్పందిస్తుందని ఆశిస్తున్నానన్నారు. ఎన్డీఏ నుంచి బయటకు రావాలన్నది తన అభిప్రాయమేనని, రాష్ట్ర ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని చెప్పారు. ఎన్టీఏ నుంచి అయితే బయటకు రావడం కచ్చితంగా జరగాలని వ్యాఖ్యానించారు.