ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర, రాష్ట్రాలు ఆదుకోకుంటే చేనేత మనుగడ కష్టమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, ఫిబ్రవరి 15: సంక్షోభం కూరుకుపోయిన చేనేత పరిశ్రమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకుంటే మనుగడ కష్టమేనని హిందూపురం ఎంపీ, టీడీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మల కిష్టప్ప అన్నారు. గురువారం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని మార్కండేయ కల్యాణ మండపంలో జరిగిన టీడీపీ చేనేత విభాగం రాష్ట్ర ప్రతినిధుల సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. చేనేత దినోత్సవాన్ని ప్రధాని ప్రకటించినప్పుడు చేనేత ప్రజలు ఎంతో ఆనందపడ్డారని కిష్టప్ప అన్నారు. తరువాత చేనేతపై జీఎస్టీ విధించడం, కేంద్ర వార్షిక బడ్జెట్‌లో చేనేతకు కేటాయించిన నిధుల్లో 50 శాతం కోత విధించడంపై ఆనందం మొత్తం ఆవిరయిందన్నారు. జీఎస్టీ విధింపు వల్ల చేనేత వస్త్ర విక్రయాలు 20 శాతం పడిపోయాయని, ప్రత్యక్షంగా కార్మికులు ఈ విధానం వలన ఉపాధి కోల్పోయారని, చేనేతకు నష్టం చేసే చర్యలపట్ల కిష్టప్ప ఆందోళన వ్యక్తం చేశారు. చేనేతకు క్లస్టర్లు తప్ప కార్మికులకు, పరిశ్రమలకు ప్రయోజనం కలిగే విధానాలను అమలు చేయక పోవడం శోచనీయమన్నారు. రాజధాని అమరావతి నగరంలో చేనేత భవన్ నిర్మించాలని, ఆప్కోకు 150 కోట్ల కార్పస్ ఫండ్ ఇవ్వాలని, సహకార సంఘాలకు చెల్లించాల్సిన ఆప్కో బకాయిలను వెంటనే విడుదల చేయాలని సమావేశం ప్రభుత్వాన్ని కోరుతూ సమావేశం తీర్మానించింది. సమావేశ తీర్మానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందించనున్నట్లు కిష్టప్ప తెలిపారు. ఎమ్మెల్సీ పోతుల సునీత, రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పంచుమర్తి అనూరాధ, మాజీమంత్రి మురుగుడు హనుమంతరావు, మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నాగేశ్వరరావు, ప్రచార కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు, తదితరులు పాల్గొన్నారు.
ప్యాకేజీ అమలుకానందునే
పార్లమెంట్‌లో ఆందోళన
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకంటే ఎక్కువ లబ్ధి చేకూరే ప్యాకేజీ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెబితే ఆ రోజు ఒప్పుకున్నామని, ప్యాకేజీ అమలు కాని ఫలితంగానే పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగాల్సి వచ్చిందని విలేఖరులతో నిమ్మల కిష్టప్ప అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎటువంటి ఆందోళనకైనా సిద్ధమేనని కిష్టప్ప అన్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి వైసీపీకి చెందిన ఎంపీల చేత ఏప్రిల్ మాసంలో రాజీనామాలు చేపిస్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2016 నుంచి తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని చెబుతూనే ఉన్నారని కిష్టప్ప ఎద్దేవా చేశారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తే ప్రయోజనం ఉండదని, పార్లమెంట్ లోపల ఉండి రాష్ట్రానికి నిధులు సాధించు కోవాల్సిన అవసరం ఉందని కిష్టప్ప అన్నారు.