ఆంధ్రప్రదేశ్‌

అనంతపురం నుంచి కృష్ణపట్నం వరకు మెగా పారిశ్రామిక క్లస్టర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: అనంతపురం నుంచి కృష్ణపట్నం వరకు తమిళనాడు తరహా అతి పెద్ద ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటవుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. చిత్తూరు జిల్లాలోని ఎలక్ట్రానిక్ క్లస్టర్ మొదలుకొని, అనంతపురం జిల్లాలోని ఆటోమొబైల్ పరిశ్రమ వరకు రానున్న కాలంలో దేశంలోనే అతి పెద్ద పారిశ్రామిక ప్రాంతంగా అవతరిస్తుందని తెలిపారు. తమిళనాడులోని ఇండస్ట్రియల్ క్లస్టర్ అత్యధిక వృద్ధితో దేశంలోనే ముందుందని, దాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో పారిశ్రామిక క్లస్టర్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర మంత్రులు కళా వెంకట్రావు, పి.నారాయణ, లోకేష్, పితాని సత్యనారాయణతో కలిసి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటికే ఇసుజు, భారత్ ఫోర్జ్, అపోలో, కియా, హీరో వంటి దిగ్గజ ఆటోమొబైల్ పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని, ఒకవైపు హీరో, భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు, మరోవైపు కియా వంటి సంస్థల ఏర్పాటుతో రాయలసీమ ప్రాంతం దేశంలోనే అత్యుత్తమ ఆటోమొబైల్ క్లస్టర్‌గా రూపుదిద్దుకోబోతోందని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో చెప్పారు. కియా మోటార్స్ అనుబంధ సంస్థలు 18 యూనిట్ల స్థాపనకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సంస్థలన్నీ కలిసి మొత్తం 761.2 మిలియన్ యూఎస్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయని, మొత్తం 6,799 మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయని చెప్పారు. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో 80 శాతం స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించేలా నిబంధనలు విధించి వాటిని పటిష్టంగా అమలుచేయాలని, ఆయా పరిశ్రమల అవసరాల మేర రాష్ట్రంలోని యువతకు తగిన నైపుణ్య శిక్షణ అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కొత్త ట్యాక్స్ నిబంధనల కారణంగా సాప్ట్‌లోన్ బదులుగా రీఫండ్ విధానాన్ని అనుసరించాలనే ప్రతిపాదనను అధికారులు ముఖ్యమంత్రి ముందుంచారు. సౌత్ కొరియాను అన్ని అంశాల్లో బెంచ్ మార్కుగా తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. వరల్డ్ బ్యాంక్ డూయింగ్ బిజినెస్ ప్రమాణాలకు అనుగుణంగా ‘బిజినెస్ రిఫామ్స్ యాక్షన్ ప్లాన్-2017’ను ఉన్నతీకరించి ఏపీ ర్యాంకును విశాఖ సీఐఐ సదస్సులో సగర్వంగా ప్రకటించుకుందామని చెప్పారు.
రూ.400 కోట్లతో టెక్స్‌టైల్స్ పరిశ్రమ
చిత్తూరు జిల్లాలో 150 ఎకరాల్లో రూ.400 కోట్ల పెట్టుబడులతో అరవింద్ ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్స్ అండ్ గార్మెంటింగ్ యూనిట్‌ను నెలకొల్పుతున్నారు. ఈ యూనిట్ ఏటా రూ.1000 కోట్ల ఎగుమతులు చేయగలదని అంచనా. 7వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. ఏపీ టెక్స్‌టైల్ అండ్ అపెరల్ పాలసీ 2015-20 ప్రకారం దీన్ని మెగా ప్రాజెక్టుగా గుర్తించారు. అనంతపురం జిల్లా పాలసముద్రంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్లతో సాయిదివ్య అపెరల్స్ అండ్ ఫ్యాషన్స్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి నాటికి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. 2వేల మందికి ఇందులో ప్రత్యక్షంగా, 600 మందికి పరోక్షంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో ‘నాచు కార్పొరేషన్ స్టీల్ ఇండస్ట్రీస్’ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ డీఐ పైప్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం రూ.1033.22 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. ఇందులో 800 మందికి ప్రత్యక్షంగా, 1200 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. భూమి కేటాయించిన 30 మాసాల్లోపు ఈ యూనిట్ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. మోహన్ స్పిన్‌టెక్స్ ఇండియా లిమిటెడ్ కృష్ణాజిల్లాలో మెగా టెక్స్‌టైల్స్ ప్రాజెక్టును రూ.289.20 కోట్లతో ఏర్పాటు చేస్తుంది. దీనిద్వారా 2750 మందికి ప్రత్యక్షంగా, 8వేల మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు దక్కుతాయి. శ్రీసిటీలో లెర్రీస్ సోలార్ టెక్నాలజీ సంస్థ సోలార్ సెల్స్, మాడ్యుళ్లను తయారుచేసే యూనిట్‌ను రూ.1500 కోట్లతో నెలకొల్పనున్నది. దీనివల్ల వెయ్యి మందికి ఉపాధి కలుగుతుంది. ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మిషన్లు, ఎల్‌ఈడీ లైట్ల తయారీ కేంద్రాన్ని చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసేందుకు డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా సన్నద్ధమైంది. 1500 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది.
రెండున్నర వేల ఎకరాల్లో
సౌత్ కొరియా టౌన్‌షిప్
రాష్ట్రంలో ఏర్పాటుచేసే దక్షిణ కొరియా టౌన్‌షిప్ కోసం రెండున్నర వేల ఎకరాలు కేటాయించే అంశంపై సమావేశంలో చర్చించారు. సౌత్ కొరియా ఇనె్వస్టుమెంట్ క్లస్టర్ పేరుతో వ్యవహరిస్తారు. ఈ సిటీ దేశానికే రోల్ మోడల్‌గా ఉండాలని ముఖ్యమంత్రి సమావేశంలో ఆదేశించారు.
మూడున్నరేళ్లలో 1817 పరిశ్రమలు
ఈ మూడున్నర ఏళ్లలో 18 శాఖలకు సంబంధించి 1817 ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చాయి. వీటి విలువ రూ.14,25,908 కోట్లు. ఈ పరిశ్రమలతో మొత్తం 33,28,58ల0 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కినట్టయింది. వీటిలో 543 సంస్థలు ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించగా, మరో 19 కంపెనీలు ఉత్పత్తి దశలో ఉన్నాయి. 49 ప్రాజెక్టులకు యంత్రసామాగ్రి బిగింపు దశలో, 184 పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 48 యూనిట్లు త్వరలో శంకుస్థాపన చేసుకోనున్నాయి. 975 పరిశ్రమలు నిర్మాణ దశకు చేరువలో ఉన్నాయి. 2016, 2017 సీఐఐ భాగస్వామ్య సదస్సులలో రూ.11,10,195 కోట్ల విలువైన 876 ప్రాజెక్టులకు ఎంవోయూలు చేసుకోగా, అందులో 156 యూనిట్లు ఇప్పటికే కార్యరూపం దాల్చి ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటివల్ల లక్షా 58వేల 813 మందికి ఉపాధి కలిగింది. మరో 13 పరిశ్రమలు ఉత్పత్తి దశలో ఉన్నాయి. 28 ప్రాజెక్టులకు యంత్రసామాగ్రి బిగింపు దశలో, 90 పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 19 యూనిట్లు త్వరలో శంకుస్థాపన చేసుకోనున్నాయి. 570 పరిశ్రమలు నిర్మాణ దశకు చేరువలో ఉన్నాయి.
2018 భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడుల వెల్లువ
సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందే పలు సంస్థలు రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి తమ ఆసక్తిని తెలియజేశాయి. ఇప్పటివరకు మొత్తం 281 ప్రాజెక్టులకు సంబంధించి అవగాహన ఒప్పందాలకు సంస్థలు ముందుకొచ్చాయని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోగ్యఖ్యరాజ్ ముఖ్యమంత్రికి వివరించారు. వీటి ద్వారా 4,20,746 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు. ఇండస్ట్రీస్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్, ఈడీబీ, మైన్స్ అండ్ జియాలజీ, టూరిజం, ఏపీ సీఆర్‌డీఏ, ఐటీఈ అండ్ సీ, ఎనర్జీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ శాఖలకు ఆయా సంస్థలు ఇప్పటికే అంగీకారం తెలిపాయి.

చిత్రం..రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో
మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు